ముంబైలో విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
‘గ్యారంటీల’పై ప్రధాని సహా ఆ పార్టీ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలేనని మండిపాటు
మహారాష్ట్ర ప్రజలకు నిజాలు చెప్పేందుకే తాను వచ్చినట్లు వెల్లడి
సాక్షి ముంబై: ప్రధాని మోదీతోపాటు మహారాష్ట్రలో ని బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేపడుతున్న రేవంత్.. ఇందులో భాగంగా శనివారం ముంబైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతోపాటు మహారాష్ట్రలో ఉన్న బీజేపీ కూటమి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై మోదీ సహా బీజేపీ నేతలు అబద్ధాలు చెప్పడం మానుకోనంత వరకు తాము నిజాలు చెబుతూనే ఉంటామన్నారు. అందుకే తాను మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల అమలు విషయంపై నిజాలు చెప్పేందుకు వచ్చినట్లు రేవంత్ చెప్పారు.
అత్యధిక రైతు ఆత్మహత్యలు మహారాష్ట్రలోనే..
దేశంలోకెల్లా మహారాష్ట్రలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని మరిచిపోవడం వల్లే మహారాష్ట్రలో రైతులు అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తాము అధికారంలోకి వచి్చన 25 రోజుల్లోనే 22.22 లక్షల మంది రైతులకు రూ. 17,869 కోట్ల రుణమాఫీ, 10 నెలల్లోనే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు, రూ. 500కే గ్యాస్ సిలిండర్, 50 లక్షల మంది పేదలకు ప్రతి నెలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న రకం ధాన్యానికి రూ. 500 బోనస్ అందిస్తున్నట్లు రేవంత్ వివరించారు.
17 మెగా ప్రాజెక్టులను గుజరాత్‌కు తరలించారు
మహారాష్ట్రకు రావల్సిన 17 మెగా ప్రాజెక్టులు ప్రధాని మోదీ గుజరాత్‌కు తరలించుకొని పోయారని రేవంత్ ఆరోపించారు. దేశ చరిత్రలోనే మహారాష్ట్రకు ప్రత్యేక స్థానం ఉందని.. అంబేడ్కర్ సహా దేశ ప్రగతిని మార్చిన ఎందరో మహానుభావులకు మహారాష్ట్ర జన్నించిందని గుర్తుచేశారు. ప్రజలను మోసగించిన బీజేపీ కూటమిని ఈ ఎన్నికల్లో ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.
అమీన్ పటేల్‌ను గెలిపించండి...
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం ముంబై ముంబాదేవి నియోజకవర్గంలో తెలంగాణవాసులు ఎక్కువగా ఉండే కమాటిపురాలో రోడ్ షో నిర్వహించారు. మహావికాస్ అఘాడీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ముంబాదేవిలో మూడుసార్లు గెలిచి మరోసారి పోటీ చేస్తున్న కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అమీన్ పటేల్‌ను గెలిపించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణవాసులకు అండగా ఉంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment