ఫాంహౌస్‌ ఇటుకలు కూడా మిగలవు! | CM Revanth Reddy Fires On KCR And BRS Leaders | Sakshi
Sakshi News home page

ఫాంహౌస్‌ ఇటుకలు కూడా మిగలవు!

Published Sun, Mar 10 2024 1:59 AM | Last Updated on Sun, Mar 10 2024 7:38 AM

CM Revanth Reddy Fires On KCR And BRS Leaders - Sakshi

మమ్మల్ని టచ్‌ చేస్తే కార్యకర్తలు ఊరుకోబోరు: సీఎం రేవంత్‌రెడ్డి 

మా ప్రభుత్వాన్ని పడగొడతామని కొందరి ప్రగల్భాలు... మేం అయ్యపేరు చెప్పుకుని అధికారంలోకి రాలేదు 

కేసీఆర్‌ను అసెంబ్లీకి రమ్మనండి..ఎవరెవరికి ఉద్యోగాలిచ్చామో చెప్తాం 

తెలంగాణ–2050 పేరిట రాష్ట్ర అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ 

హైదరాబాద్‌ అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరి యత్నాలు.. అలాంటి వారికి నగర బహిష్కరణ శిక్ష  

కబ్జాలపై ఉక్కుపాదం మోపుతాం.. మూసీని ప్రక్షాళన చేస్తాం.. 

400 సీట్లు గెలుస్తామంటున్న బీజేపీకి ఇతర రాష్ట్రాల్లో పొత్తులెందుకని ప్రశ్న 

బైరామల్‌గూడలో ఫ్లైఓవర్, నాచారం ఎస్టీపీలను ప్రారంభించిన సీఎం 

కండ్లకోయ వద్ద ఎన్‌హెచ్‌ 44పై ఎలివేటెడ్‌ డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌కు శంకుస్థాపన 

మూడు ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో ప్రసంగించిన ముఖ్యమంత్రి 

సాక్షి, మేడ్చల్‌ జిల్లా/ సాక్షి హైదరాబాద్‌: సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తమ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొడతామని కొందరు ప్రగల్భాలు పలుకుతున్నారని.. తమ కార్యకర్తలు తలచుకుంటే కేసీఆర్‌ ఫాంహౌజ్‌ గోడలే కాదు ఇటుకలు కూడా మిగలవని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వాన్ని కూల్చే మొనగాడు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుందని, రాష్ట్రం అభివృద్ధి వేగవంతం అవుతుందని చెప్పారు.

హైదరాబాద్‌ నగర అభివృద్ధికి, మెట్రో విస్తరణకు అడ్డుపడేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని.. అలాంటి వారిని నగరం నుంచి బహిష్కరించాల్సి వస్తుందని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌లోని బైరామల్‌గూడ వద్ద రూ.194 కోట్లతో నిర్మించిన రెండో లెవెల్‌ ఫ్లైఓవర్‌ను.. ఉప్పల్‌ నల్ల చెరువు, నాచారం పెద్ద చెరువుల వద్ద నిర్మించిన మురుగు నీటిశుద్ధి కేంద్రాల (ఎస్టీపీల)ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. సికింద్రాబాద్‌  ప్యారడైజ్‌ నుంచి బోయిన్‌పల్లి డెయిరీఫాం రోడ్‌ వరకు రూ.1,580 కోట్లతో నిర్మించనున్న ఎలివేటెడ్‌ డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌కు కండ్లకోయలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో రేవంత్‌ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందని కొందరు మాట్లాడుతున్నారు. మేం అల్లాటప్పాగా అడుక్కుని, అయ్య పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన వాళ్లం కాదు. రైతుబిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే మీ కళ్లు మండుతున్నాయా? అసలు మా ప్రభుత్వాన్ని కూల్చే మొనగాడు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా?ప్రభుత్వాన్ని, నన్ను టచ్‌ చేస్తే మా కార్యకర్తలు మీ కళ్లలో కారం కొడతారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అసెంబ్లీలో ప్రతిపక్షాలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. మేం మంచివాళ్లం. రాజ్యాంగ విలువలను కాపాడేవాళ్లం. కాబట్టే మీరు మాట్లాడగలుగుతున్నారు. 


అసెంబ్లీకి రమ్మను.. అన్నీ చెప్తాం.. 
ప్రతిపక్షాలు ప్రజాసమస్యలపై మాట్లాడకుండా, ధర్నాలు చేయకుండా కేసీఆర్‌ ధర్నాచౌక్‌ను ఎత్తేశారు. అలాంటిది నేడు ఆయన బిడ్డ కవిత ధర్నాచౌక్‌లో ధర్నా చేస్తూ మహిళల మీద ప్రేమ ఒలకబోస్తున్నారు. మా 90 రోజుల పాలనలో 28వేల ఉద్యోగాలు భర్తీ చేస్తే.. అందులో 43శాతం మహిళలకు ఇచ్చాం. మీ అయ్యను అసెంబ్లీకి పంపిస్తే.. ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చామో పేర్లతో సహా చెప్తాం. బీఆర్‌ఎస్‌ మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వనినాడు తండ్రిని అడగని కవిత ఇప్పుడు మహిళల గూర్చి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. 

మేడిగడ్డ పాపం మాకు అంటగడతారా? 
లక్షన్నర కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు మూడేళ్లకే కూలిపోయే పరిస్థితికి చేరాయి. దీనిపై నిపుణుల సలహాలు తీసుకుని ముందుకెళ్తాం. కానీ బీఆర్‌ఎస్‌ నేతలు వెంటనే మరమ్మతులు చేయాలంటూ ఆ పాపాన్నంతా మాకు అంటగట్టాలని చూస్తున్నారు. హరీశ్‌రావు మేడిగడ్డకు రమ్మంటే రారు. అసెంబ్లీలో మైక్‌ ఇచ్చినప్పుడు మాట్లాడరు. కానీ బయట ప్రభుత్వాన్ని బదనాం చేసే మాటలు మాట్లాడుతారు. 

బీజేపీకి పొత్తులు ఎందుకు? 
లోక్‌సభ ఎన్నికల్లో 400సీట్లు గెలుస్తామని పదే పదే చెప్తున్న ప్రధాని మోదీ.. ఎన్డీయే కూటమిలోకి కొత్త భాగస్వాములను ఎందుకు చేర్చుకుంటున్నారు? పక్క రాష్ట్రంలో చంద్రబాబు, పవన్‌తో, బిహార్‌లో నితిశ్‌తో, ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌తో, ఇతర రాష్ట్రాలతో మరికొందరితో పొత్తులు పెట్టుకోవడానికి ఎందుకు తాపత్రయ పడుతున్నారు? బీజేపీ కాలం చెల్లింది. దేశంలో కాంగ్రెస్‌ హవా కొనసాగుతుందని వారికి అర్థమైంది. 

ఎంపీలు ఉంటే అభివృద్ధి సాధ్యం 
అసెంబ్లీ ఎన్నికల్లో చాలాచోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎంపీలు గెలవాలి. అప్పుడే అభివృద్ధి పూర్తిగా సాధ్యమవుతుంది. ఈసారి కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుంది. కేంద్ర, రాష్ట్ర నిధులతో మరింతగా అభివృద్ధి జరుగుతుంది..’’ అని రేవంత్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, మైనంపల్లి రోహిత్‌ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
దేశానికే ఆదర్శంగా హైదరాబాద్‌ 
తెలంగాణ–2050 పేరిట రాష్ట్ర అభివృద్ధి కోసం త్వరలోనే మెగా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తాం. దాన్ని ప్రజల ముందుంచి.. అభ్యంతరాలు స్వీకరిస్తాం. మొత్తం తెలంగాణ, హైదరాబాద్‌లను 360 డిగ్రీలలో అన్నివైపులా అభివృద్ధి చేస్తాం. హైదరాబాద్‌ను దేశానికే ఆదర్శంగా నిలిపేలా చర్యలు చేపడతాం. హైదరాబాద్‌ పరిసరాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలు అన్నింటినీ ఒకే గొడుకు కిందికి తెచ్చి అన్నివైపులా అభివృద్ధి జరిగేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

మెట్రో రైల్‌ను మరింతగా విస్తరిస్తాం. మురికికూపంగా మారిన మూసీ ఇక్కడి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుండటమేగాక నల్లగొండ జిల్లాలో 50–60 వేల ఎకరాల్లో పంటలను కూడా బలి తీసుకుంటోంది. దీన్ని ప్రక్షాళన చేయడంతోపాటు 55 కిలోమీటర్ల పొడవునా మూసీ రివర్‌ఫ్రంట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తాం. ఇందుకు దాదాపు రూ.50వేల కోట్లు అవసరం. కేంద్రం నిధులు ఇచ్చి సహకరించాలి. 
 
కాంగ్రెస్‌ పనులతోనే నగరానికి గుర్తింపు 
కాంగ్రెస్‌ హయాంలో రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్‌ నగర అభివృద్ధి జరిగింది. కాంగ్రెస్‌ నిర్మించిన ఔటర్‌రింగ్‌రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయాల వల్లే ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్‌కు గుర్తింపు, ఐటీ–ఫార్మా రంగాల్లో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణకు వస్తున్న ఆదాయంలో 70శాతం వాటివల్లే సమకూరుతోంది.  

కబ్జాలపై ఉక్కుపాదమే
రాష్ట్రంలో కబ్జాదారులపై ఉక్కు పాదం మోపుతాం. ఎంతటి వారైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. కబ్జాలపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే స్వీకరించి చర్యలు చేపట్టాలని హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించాం. 

పాతబస్తీ మెట్రోను ఆపాలట! 
నిన్న మెట్రో విస్తరణకు అసదుద్దీన్‌ ఒవైసీ తో కలిసి పునాది రాయి వేయగానే దాన్ని ఆపాల్సిందిగా ఒకాయన ఢిల్లీకి చెప్పిండట. వాళ్లు ఇప్పుడు దాన్ని ఆపాలని అంటున్నారు. మీకు చేయడం చేతకాకపోతే.. మేం చేసేటప్పుడు అ యినా కాళ్లలో కట్టెలు పెట్టొద్దని కోరుతున్నా. కేంద్రాన్ని ఉసిగొల్పుతూ అడ్డుకుంటున్న వారిని హెచ్చరిస్తున్నా.. అలాంటి వారిని నగరం నుంచి బహిష్కరించాల్సి వస్తుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement