
బీఆర్‌ఎస్‌కు స్టేచర్ మీద ఉన్న పట్టింపు రాష్ట్ర భవిష్యత్తు విషయంలో ఏది?
ఒకప్పుడు మీకు అధికార పార్టీ స్టేచర్ ఉండేది.. ఇప్పుడది గుండుసున్నా
బీఆర్‌ఎస్‌ను జనం మార్చురీకి పంపారు
గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు
నేను కేసీఆర్‌ను ఏదో అంటున్నానని కేటీఆర్, హరీశ్ అంటున్నారు
ఆయనకేదైనా అయితే ప్రతిపక్ష నేత పదవి కోసం వారు పోటీపడతారేమో!
నేను అలా కోరుకోను.. కేసీఆర్ వందేళ్లు ఆరోగ్యంగా, ప్రతిపక్ష నేతగా ఉండాలి.. నేను సీఎంగా ఉండాలి
ఆయన అసెంబ్లీకి వస్తే పూర్తి చిట్టా విప్పుతా
సాక్షి, హైదరాబాద్: ‘‘బీఆర్‌ఎస్ నేతలు మాటకు ముందు, మాటకు తర్వాత స్టేచర్ అంటున్నారు. ఆ స్టేచర్ విషయంలో ఉన్న ఆసక్తి, పట్టింపు ఈ స్టేట్ ఫ్యూచర్ విషయంలో ఏదీ? ఒకప్పుడు మీకు అధికార పార్టీ స్టేచర్ ఉండేది, తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్టేచర్ వచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీని జనం మార్చురీకి పంపారు. స్టేచర్ గుండుసున్నా అయింది. నేను ఇదే చెప్పా, అందులో తప్పేముంది. నేను కేసీఆర్‌ను ఏదో అంటున్నానని కేటీఆర్, హరీశ్‌రావు అంటున్నారు.
కేసీఆర్ నుంచి తీసుకునేందుకు ఇక ఏమీ లేదు. ఆయనది ప్రధాన ప్రతిపక్ష హోదా. ఆయనకు జరగరానిది ఏదైనా జరిగితే.. కేటీఆర్, హరీశ్‌రావు దానికోసం పోటీపడతారేమో. దాన్ని నేనైనే కోరుకోను కదా! కేసీఆర్ వందేళ్లు ఆరోగ్యంగా ఉండాలి. అదే ప్రతిపక్ష నేత పాత్ర పోషించాలి. నేను ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇది మా భవిష్యత్తు కార్యాచరణ..’’అని ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు శనివారం ఆయన సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
వివరాలు సీఎం రేవంత్ మాటల్లోనే..
‘‘పార్టీలో పెద్ద మనిషి హోదాలో కేసీఆర్.. తాడు బొంగరం లేనట్టు వ్యవహరిస్తున్న కేటీఆర్, హరీశ్‌రావులను సరిదిద్దాలి. ఇకనుంచి నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు. నా రాజకీయ అనుభవం గురించి మాట్లాడుతున్నారు. జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన నేను మంత్రి కాకుండా నేరుగా సీఎం అయ్యా. గతంలో ఎన్టీఆర్, నరేంద్ర మోదీ డైరెక్ట్‌గా సీఎం అయి పాలన అందించలేదా? 40ఏళ్ల రాజకీయ అనుభవం అంటారు కదా.. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే.. అందులో మంచిని గుర్తించి నేర్చుకునేందుకు నేను సిద్ధం.. రైతులకు సంబంధించిన ఏ విషయంపై అయినా చర్చ జరగాలని కేసీఆర్ కోరితే నేను రెడీ. సభకు వచ్చి చర్చించాలి. పూర్తి చిట్టా విప్పుతా.
ఇలానే ఉంటే వచ్చే ఎన్నికల్లో గుండు సున్నా..
భూకంపం కూడా ఒక్కసారి రాదు, రెండుమూడు సార్లు కదిలి కంపిస్తుంది. తుఫాన్ ముందు కొంత ప్రశాంతత ఉంటుంది. కొన్నేళ్లు అలాంటి ప్రశాంతత చూపిన ప్రజలు చివరికి ఎన్నికల్లో ప్రభావం చూపారు. అసెంబ్లీ ఓటమి, పార్లమెంటు ఎన్నికల్లో సున్నా వచ్చినా కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్‌ఎస్ నేతల్లో మార్పు రాలేదు. వారి అధికారాన్ని దూరం చేసినందుకు నామీద కోపం ఉండొచ్చు. కానీ సీఎం కుర్చీకైనా గౌరవం ఇవ్వాలి కదా.. ఇంకా కుల దురహంకారాన్ని వీడలేదు. ఇట్లానే ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గుండుసున్నా ఖాయం.
గవర్నర్ ప్రసంగం అలానే ఉంటుంది..
గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ విధానంలా ఉందని బీఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. అవును.. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ విధానంలానే ఉంటుంది. ఎందుకంటే మాది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలతో కూడిన విధానాలనే పథకాలుగా అమల్లోకి తెచ్చాం. మా ఎన్నికల మేనిఫెస్టో ఆధారంగా రూపొందిన పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపిన విషయాలనే గవర్నర్ ప్రస్తావించారు. అలాంటప్పుడు విమర్శించడం ఏమిటి? ప్రతిపక్ష నేతలు అజ్ఞానమే విజ్ఞానంగా, అడ్డగోలుతనమే గొప్పతనంగా భావిస్తున్నట్టున్నారు’’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో నిరుద్యోగ రేటు తగ్గింది..
‘‘అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే యువతకు 57,924 ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో మరోటి లేదు. నేను సవాల్ విసురుతున్నా.. ఉంటే చెప్పండి. 2023 జూలై నుంచి సెప్టెంబర్ వరకు నిరుద్యోగ రేటు 22.9 శాతంగా ఉంటే.. 2024 జూలై నుంచి సెప్టెంబర్ మధ్య 18.1 శాతానికి తగ్గింది. కేంద్ర కార్మిక శాఖ ఆదేశం మేరకు లేబర్‌ఫోర్స్ సంస్థ నిర్వహించిన సర్వే నివేదిక చెప్పిన వాస్తవమిది. నిరుద్యోగ సమస్యను తగ్గించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది.’’
ఔను.. మోదీ బడే భాయే..
‘‘దేశంలోని ముఖ్యమంత్రులకు ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ బడే భాయే (పెద్దన్న). ఈ మాటను మరోసారి చెప్తున్నా. రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను తరచూ ప్రధానిని కలుస్తూనే ఉంటాను. పార్టీపరంగా ఆయనతో విభేదించొచ్చు. కానీ ప్రధానిగా గౌరవిస్తా. గత 15 నెలల్లో ఢిల్లీకి 32 సార్లు వెళ్లా, మూడు పర్యాయాలు ప్రధానిని కలిశా. నేను కలవని కేంద్రమంత్రి అంటూ ఎవరూ లేరు. అవసరమైతే మరో 300సార్లు వెళ్తా. మీరు ప్రధానిని గౌరవించరు. గవర్నర్‌ను గౌరవించరు. ప్రజలను పట్టించుకోరు.’’
Comments
Please login to add a commentAdd a comment