ఇది పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధం | CM YS Jagan Fires On Chandrababu At Jayaho BC Maha Sabha | Sakshi
Sakshi News home page

ఇది పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధం

Published Thu, Dec 8 2022 3:35 AM | Last Updated on Thu, Dec 8 2022 7:18 AM

CM YS Jagan Fires On Chandrababu At Jayaho BC Maha Sabha - Sakshi

గడప, గడపకూ మీరు కూడా వెళ్లాలి. ఇక నుంచి బూత్‌ కమిటీలు మొదలు కావాలి. ప్రతి 50 ఇళ్లకు ఒక అక్కచెల్లెమ్మ, ఒక అన్నదమ్ముడు మేపింగ్‌ జరగాలి. ప్రతి 50 ఇళ్లకు మనం ఓనర్‌షిప్‌ తీసుకోవాలి. మరో 18 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో ఈ సారి మన టార్గెట్‌ 175కు 175 సీట్లు అని గుర్తుపెట్టుకోవాలి.      
    – సీఎం వైఎస్‌ జగన్‌ 

జయహో బీసీ మహాసభ ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘మరో 18 నెలల్లో యుద్ధం జరగబోతోంది.. ఈ యుద్ధంలో నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, నిరుపేద వర్గాలు ఒకవైపు ఉంటే, మరో వైపు బీసీల తోకలను కత్తిరిస్తాను, ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? అనే దుర్మార్గమైన మనస్తత్వమున్న చంద్రబాబు ఉన్నారు. మంచికి, చెడుకు.. నిజాయితీకీ, వెన్నుపోటుకు.. పేదల భవిష్యత్‌కు, పెత్తందార్లకు.. మాట మీట నిలబడే నాయకత్వానికి, ప్రజలకు వెన్నుపోటు పొడిచే మనస్తత్వానికి మధ్య యుద్ధం జరగబోతోందని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండ’ని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

‘మీ ఇంట్లో మంచి జరిగితేనే జగనన్నకు తోడుగా ఉండండి. మంచి జరగకపోతే వద్దమ్మా.. జగనన్నే చెప్పాడు అని కూడా చెప్పండి.. ఎందుకంటే జగనన్న ఏదైతే చెప్పాడో అది చేస్తాడు’ అని అన్నారు. ‘వాళ్లంతా పేదల శత్రువులు. చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరి ఎన్నికలని తేల్చి చెప్పండి.. 2019కి మించి 2024 ఎన్నికల్లో మన గెలుపు ఖాయమని ఊరూరా.. ఇంటింటా చాటి చెప్పండి’ అని 85 వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో బుధవారం నిర్వహించిన జయహో బీసీ మహాసభలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే..

మారీచులతో యుద్ధం తప్పదు
► ఈ రోజు ఇక్కడకు వచ్చినవారంతా ప్రజాప్రతినిధులే. మీ మీ గ్రామాల్లో.. ప్రతి గడపకూ వెళ్లి 2024లో కూడా ఇంతకు మించిన గెలుపు ఖాయమని చెప్పండి. ఆ ఎన్నికల్లో కూడా మనమంతా మారీచులతోనూ, పెత్తందార్లతోనూ యుద్ధం చేయకతప్పదని చెప్పండి.

► పేదవాడి ఇంటింటికీ, మనిషి మనిషికీ మన ప్రభుత్వంలో పథకాలు అందితే.. రాష్ట్రం శ్రీలంక అవుతుంది అని ఈ పేదల శత్రువులు మాట్లా­డుతున్నారని ప్రతి ఇంట్లో చెప్పండి. వీళ్లంతా రైతులకు, అవ్వాతాతలకు, అక్కచెల్లెమ్మలకు, చదువుకుంటున్న పేదపిల్లలకు శత్రువులు అని, ఇలాంటి మారీచులతో మనమంతా యుద్ధం చేయక తప్పదని గట్టిగా చెప్పండి. 

► చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క సంక్షేమ పథకం పేరు కూడా గుర్తుకు రాదు. అలాంటి బాబుతో, ఆయన ఎల్లో మీడియాతో, దత్తపు­త్రుడితో... మూడున్నర సంవత్సరాలలో ఇన్ని విప్లవాత్మక సంక్షేమ పథకాలు, ఇంత డీబీటీ ఇచ్చిన మనం యుద్దం చేస్తున్నామని చెప్పండి. ఈ యుద్ధం సామాజిక న్యాయానికి, సామాజిక అన్యాయానికి మధ్య జరగబోతుందని చెప్పండి. పేదల భవిష్యత్తుకు, పేదలు పేదలుగానే మిగిలిపోవాలని ఆరాటపడే పెత్తందార్లకు మధ్య యుద్ధం జరగబోతుందని చెప్పండి. 

చంద్రబాబును నమ్మొద్దు.. 
► చంద్రబాబు ఆగడాలు, నిర్వాకాలనూ.. మనం చేస్తున్న మంచిని ప్రతి జిల్లాలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి గడపకూ తీసుకుపోవాలి. తేడా గమనించమని అందరినీ అడగండి. చంద్రబాబును మాత్రం నమ్మొద్దమ్మా.. ఎన్నికలప్పుడు మాత్రం రంగురంగుల స్వప్నాలను చూపిస్తాడు. బ్యాంకుల్లో పెట్టే బంగారం ఇంటికి రావాలంటే.. బాబునే ముఖ్యమంత్రి కావాలంటాడు. రైతులకు రుణమాఫీ కావాలంటే బాబే ముఖ్యమంత్రి కావాలంటాడు. 

► తాను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని అమెరికా చేస్తాను అని కూడా అంటాడు. కానీ నమ్మొద్దు. ఒక్కసారి నమ్మాం.. అడుగులు వెనక్కి పడ్డాయి. జగన్‌ని నమ్మాం, మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. మన బిడ్డని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొబెట్టుకున్నాం. మన బతుకులు మారాయా?లేదా? అన్నది ఒక్కసారి గుండెల మీద ఆలోచన చేయండి అని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement