బీఏసీ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో స్పీకర్ తమ్మినేని, మంత్రులు బుగ్గన, అనిల్, టీడీపీ నేత అచ్చెన్నాయుడు తదితరులు
సాక్షి, అమరావతి: బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి మాట్లాడుతున్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం ప్రతులను టీడీపీ సభ్యులు చించివేసి సభలో అనాగరికంగా వెదజల్లడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారం కోసం వికృత చేష్టలకు పాల్పడటాన్ని ఖండించారు. ఇదేనా విపక్షం విధానం? అని నిలదీశారు. సోమవారం గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం నిర్వహించిన బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశంలో టీడీపీ సభ్యుల అనుచిత ధోరణి పట్ల సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘గవర్నర్‌ది రాజ్యాంగబద్ధమైన పదవి.. ఆయనకు రాజకీయాలతో సంబంధం ఉండదు. అందువల్ల ఆయన్ను విమర్శించడం సరికాదు. చర్చలో పాల్గొంటే విపక్షాలకు కూడా అభిప్రాయం చెప్పే అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.. ’ అని సూచించారు.
రాజీనామాలకు రెడీనా..?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు గవర్నర్‌పై దాడి చేసినట్లే తామూ చేశామని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడంపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నర్‌పై ప్రసంగం ప్రతులను విసిరేసి దాడి చేసినట్లు నిరూపిస్తే నాతోపాటు మా మంత్రివర్గం మొత్తం రాజీనామా చేస్తాం. లేదంటే చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తారా?’ అని సీఎం జగన్ సవాల్ చేయడంతో అచ్చెన్నాయుడు నీళ్లు నమిలారు. మన రాష్ట్ర శాసనసభలో కాదు.. ఇతర రాష్ట్రాల్లో గవర్నర్‌పై దాడి చేసిన ఘటనలున్నాయంటూ దాటవేసే యత్నం చేశారు. శాసనసభలో జరగనిది జరిగినట్లుగా ప్రతిపక్షం సత్యదూర ప్రచారం చేస్తున్నట్లు మరోసారి రుజువైందని సీఎం జగన్ పేర్కొనడంతో అచ్చెన్న మౌనం దాల్చారు.
స్పీకర్ అధ్యక్షతన బీఏసీ..
ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించిన అనంతరం సభ వాయిదా పడింది. ఆ తరువాత స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాలు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, టీడీపీ తరఫున ఆపార్టీ శాసన సభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు ఇందులో పాల్గొన్నారు.
తప్పుదోవ పట్టించడం సబబేనా?
శాసనసభలో అధికారపక్షం తరఫున చర్చించేందుకు 25 అంశాలను మంత్రులు బీఏసీలో ప్రతిపాదించారు. టీడీఎల్పీ పక్షాన కూడా 25 అంశాలను ప్రతిపాదిస్తున్నామని, వాటిపై చర్చించేందుకు తగిన సమయం ఇవ్వాలని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మైక్ ఇవ్వకుండా ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారని అచ్చెన్న వ్యాఖ్యానించటాన్ని సీఎం జగన్ ఖండించారు. శాసనసభ గత సమావేశాల్లో ఒక అంశంపై ప్రతిపక్ష సభ్యులు మాట్లాడాక మంత్రి వివరణ ఇచ్చారని, ఆ తర్వాత కూడా అదే అంశంపై సంప్రదాయానికి విరుద్ధంగా ప్రతిపక్షం మాట్లాడేందుకు ప్రయత్నించడంతో స్పీకర్ మైక్ కట్ చేశారని చెప్పారు. అదే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు అధికార పక్ష సభ్యులు సభలో అనని మాటలను అన్నట్లుగా చిత్రీకరించారని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులను ఎవరూ దూషించకపోయినా.. దూషించినట్లుగా దుష్ప్రచారం చేసి వ్యక్తిగత, రాజకీయ లబ్ధి కోసం సభను తప్పుదోవ పట్టించడం ఎంతవరకు సబబు? అని నిలదీశారు.
అదే నిజమైతే.. మైక్ కట్ చేసేవారు
అధికార పక్ష సభ్యులు చంద్రబాబు కుటుంబ సభ్యులను దూషించినట్లు రికార్డుల్లో ఉందా? అని ఈ సందర్భంగా అచ్చెన్నను సీఎం జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులను కించపరుస్తూ అధికారపక్ష సభ్యులు మాట్లాడి ఉంటే స్పీకర్ మైక్ కట్ చేసేవారని, చర్యలూ తీసుకునేవారని చెప్పారు. అలాంటప్పుడు చంద్రబాబు ఎందుకు డ్రామా ఆడారని సీఎం జగన్ నిలదీయగా.. చంద్రబాబు కుటుంబ సభ్యులను అధికారపక్ష సభ్యులు దూషించినట్లు ఎవరో తమ చెవిలో చెప్పారని అచ్చెన్న తెలిపారు. దీనిపై సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. అనని మాటలను అన్నట్లుగా ఊహించుకుని.. సభను తప్పుదోవ పట్టించి.. వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం ఎవరు ప్రయత్నించినా తక్షణమే సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను సీఎం జగన్ కోరారు.
ప్రజా సమస్యలపై ఎన్ని రోజులైనా చర్చిద్దాం..
ప్రజాసమస్యలపై ఎన్ని రోజులైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమని సీఎం జగన్ స్పష్టం చేశారు. అధికారపక్షం ప్రతిపాదించిన 25 అంశాలను కాకుండా ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన 25 అంశాలనే చర్చకు తీసుకోవడానికి సిద్ధమన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంపై ప్రతిపక్షానికి చిత్తశుద్ధి ఉంటే సత్యదూరమైన ఆరోపణలు చేయకుండా వాస్తవాలు మాట్లాడాలని సూచించారు.
► గతంలో గవర్నర్‌పై వైఎస్సార్‌సీపీ సభ్యులు దాడి చేశారు
► ప్రజా సమస్యలపై చర్చించేందుకు మాకు మైక్ ఇవ్వటం లేదు
–అచ్చెన్నాయుడు
► నిరూపిస్తే మేమంతా రాజీనామా చేస్తాం. లేదంటే చంద్రబాబుతో సహా మీరంతా రాజీనామాలకు సిద్ధమా? మీ అసత్య ప్రచారం మరోసారి రుజువైంది.
► గత సమావేశాల్లో అధికారపక్ష సభ్యులు అనని మాటలను అన్నట్లుగా ఊహించుకుని రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాటకం ఆడారా? లేదా? అవాస్తవాలు ఎలా మాట్లాడతారు? ప్రజా సమస్యలపై ఎన్ని రోజులైనా చర్చించేందుకు మేం సిద్ధం.
– సీఎం జగన్
అధికార పక్షం చర్చకు ప్రతిపాదించిన అంశాలివీ..
1. జిల్లాల విభజన – పరిపాలనా వికేంద్రీకరణ
2. ప్రత్యేక హోదా – విభజన హామీలు
3. విద్యారంగంలో సంస్కరణలు. నాడు – నేడు, అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, కొత్త యూనివర్శిటీల ఏర్పాటు, ఉన్నత విద్య సిలబస్‌లో మార్పులు.
4. వైద్య ఆరోగ్య రంగం, ఆరోగ్యశ్రీ, నాడు – నేడు, నూతన వైద్య కళాశాలల ఏర్పాటు, ఉద్యోగాల కల్పన
5. కరోనా నియంత్రణ, ప్రభుత్వ చర్యలు, వ్యాక్సినేషన్, ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు
6. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, కొత్త పీఆర్సీ అమలు, ఉద్యోగాల భర్తీ
7. పెన్షన్ల పెంపు, దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.2,500 అమలు
8. ఉపాధి హామీ అమలు, మౌలిక వసతుల కల్పన
9. పోలవరం ప్రాజెక్టు – గత ప్రభుత్వం తప్పిదాలు
10. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద పథకాల అమలు
11. రాష్ట్రంలో రోడ్డు నెట్‌వర్క్ అభివృద్ధికి చర్యలు
12. శాంతి భద్రతలు
13. గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణ
14. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ
15. ఇళ్ల పట్టాల పంపిణీ–ఇళ్ల నిర్మాణం
16. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల సంక్షేమం
17. వ్యవసాయ రంగం–ఇన్‌పుట్ సబ్సిడీ, ఉచిత ఇన్సూరెన్స్, సున్నా వడ్డీ రుణాలు, రైతు భరోసా కేంద్రాలు, ఈ–క్రాప్, మద్దతు ధర, వైఎస్సార్ జలకళ
18. మహిళా సాధికారత–దిశ చట్టం–వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, నామినేటెడ్ పదవులు.
19. గ్రామ సచివాలయాలు–వలంటీర్లు, ప్రజలకు జరుగుతున్న మేలు
20. ప్రభుత్వ సంక్షేమ పథకాలు–డీబీటీ, పారదర్శక పాలన
21.పారిశ్రామిక అభివృద్ధి
22. అవినీతి నిర్మూలన– పారదర్శక పాలన
23. వ్యవసాయానికి 9 గంటల ఉచిత కరెంట్– విద్యుత్ రంగంలో సంస్కరణలు, గత సర్కారు నిర్వాకాలు, భారీ బకాయిలు.
24. అమూల్ ప్రాజెక్టుతో పాడి రైతులకు మేలు
25. ప్రభుత్వ హామీలు–అమలు తీరు
Comments
Please login to add a commentAdd a comment