అదే రాష్ట్రం.. అదే బడ్జెట్‌ | CM YS Jagan at Pulivendula bus stand opening ceremony | Sakshi
Sakshi News home page

అదే రాష్ట్రం.. అదే బడ్జెట్‌

Published Sun, Dec 25 2022 4:15 AM | Last Updated on Sun, Dec 25 2022 4:16 AM

CM YS Jagan at Pulivendula bus stand opening ceremony - Sakshi

పులివెందులలో ఆరోగ్య పథంను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

మన ఖర్మ కొద్దీ ఇవాళ మనం టీడీపీ, చంద్రబాబుతో మాత్రమే కాకుండా చెడిపోయిన వ్యవస్థతోనూ యుద్ధం చేస్తున్నాం. ఆ వ్యవస్ధ ఏమిటంటే.. ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. వీళ్లతో పాటు ఒక దత్తపుత్రుడు. వీళ్లంతా ఎలా తయారయ్యారంటే.. మూడు వంతుల నీళ్లున్న ఒక గ్లాసును చూపిస్తే.. మిగతా పావలా వంతు నీళ్లు నిండని భాగాన్ని వారు చూపిస్తూ.. ఇంకా గ్లాస్‌ నిండలేదు.. నీళ్లే లేవు అని ప్రచారం చేస్తున్నారు. అంతే తప్ప మూడు వంతులు నిండిందని మాత్రం చెప్పరు.
    – సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి ప్రతినిధి, కడప:  ‘అదే రాష్ట్రం, అదే బడ్జెట్‌.. అప్పుల పెరుగుదలలో మనకంటే గతంలోనే ఎక్కువ. గత పాలకులు మీ బిడ్డ ఇచ్చినన్ని స్కీమ్‌లు ఎందుకు ఇవ్వలేకపోయారు? కేవలం ముఖ్యమంత్రి మార్పుతో పేదలు, రైతులు,  అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, చదువుకుంటున్న పిల్లల తలరాతలు మారుతున్నాయి. కారణం ఏంటనేది పులివెందుల నుంచి ఇచ్ఛాపురం వరకు ప్రతి ఒక్కరూ ఆలోచించండి’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. పులివెందుల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పాడా) నిధులు రూ.22.40 కోట్లతో అధునాతనంగా నిర్మించిన డాక్టర్‌ వైఎస్సార్‌ బస్‌ టెర్మినల్‌ (ఏపీఎస్‌ ఆర్టీసీ బస్టాండ్‌)ను శనివారం ఆయన ప్రారంభించారు.

అనంతరం బస్టాండ్‌ ఆవరణలో నిర్వహించిన సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.  దేవుడి దయ, మీ అందరి చల్లని దీవె­న­లతో మనం అధికారంలోకి వచ్చిన ఈ మూడు­న్నరేళ్లలో పులివెందులను ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి బాటలో నడిపించేందుకు వేగంగా అడు­గులు వేశామని చెప్పారు. పలు అభివృద్ధి పనులు ఒక్కొక్కటిగా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నా­య­న్నారు. ఇందులో భాగంగా అత్యాధునిక వసతు­లతో కూడిన వైఎస్సార్‌ బస్‌ టెర్మినల్‌ను ఇవాళ ప్రారంభించామని చెప్పారు. ఇది మిగిలిన బస్‌ టెర్మినల్స్‌ అన్నింటికీ రోల్‌ మోడల్‌గా ఉండేలా కట్టామన్నారు.

ఒకవైపు ఇక్కడ వేగంగా పనులు జరు­గు­తున్నాయని తెలిసినా, ఈ బస్‌ టెర్మినల్‌కు సంబంధించి రకరకాల మాటలు విన్నామని తెలిపారు. పులివెందులలో బస్‌టెర్మినల్‌ కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నామని గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన (చంద్రబాబు) వ్యక్తి చెప్పాడని, వేగంగా సాగుతున్న పనులు కళ్లెదుటే కనిపించినా.. ఇలాంటి పెద్ద మనుషులు, వీరికి తోడు నెగిటివ్‌ మీడియా దారుణంగా దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఈ సభలో సీఎం ఇంకా ఏమన్నారంటే..
ఇడుపులపాయలో శనివారం క్రిస్మస్‌ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న సీఎం వైఎస్‌ జగన్‌..         

మీరిచ్చిన భరోసా వల్లే రాష్ట్రంపై చూపు
► గత ఎన్నికల్లో మనకు 151 సీట్లు వచ్చాయి. రేపు జరగబోయే ఎన్నికల్లో వై నాట్‌ 175 అని ఈ రోజు మీ బిడ్డ పిలుపునిచ్చే పరిస్థితిలో ఉన్నాడంటే కారణం.. ‘రాష్ట్రం వైపు నువ్వు చూడు, ఈ ప్రాం­తం మేం చూసుకుంటాం’ అని మీరు మీ బిడ్డకు తోడుగా నిలిచి భరోసా ఇవ్వడమే. అందుకే ఈరోజు మీబిడ్డ ఈ రాష్ట్రం వైపు చూడగలుగుతున్నాడు.

► నేరుగా బటన్‌నొక్కి ఎంత సొమ్ము మనం ప్రతి ఇంటికి చేర్చగలిగామని నిన్న (శుక్రవారం) కమలాపురంలో చెప్పాను. ఇప్పుడూ చెబుతున్నా. ఈ రోజు రూ.3 లక్షల కోట్లకు పైగా డీబీటీ, నాన్‌ డీబీటీ విధానంలో ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చాం. రూ.1.79 లక్షల కోట్లు (డీబీటీ) నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. ఈ రోజు వ్యవస్థలో ఎక్కడా వివక్ష, లంచాలు లేవు కాబట్టి ఇది సాధ్యమైంది. చివరకు మనకు ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే మంచి చేసే పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనిపిస్తోంది.

శరవేగంగా అభివృద్ధి పనులు
► 2019, 2020, 2021లో శంకుస్థాపన చేసిన పనులన్నీ శరవేగంగా పూర్తవుతున్నాయి. ఇందులో ముఖ్యమైన వాటిలో వైఎస్సార్‌ మెడికల్‌ కాలేజీ ఒకటి. పక్కనే కనిపిస్తోంది. రూ.500 కోట్లతో పనులు వేగంగా జరుగుతున్నాయి. టీచింగ్‌ ఆస్పత్రిని మరో ఆరు నెలల్లో 2023 జూలై నాటికి.. 2023 డిసెంబర్‌ నాటికి ఏకంగా మెడికల్‌ కాలేజీని కూడా ప్రారంభిస్తాం. 

► జీఎన్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కాలువ నుంచి హెచ్‌ఎన్‌­ఎస్‌ఎస్‌ కాలువకు నీటి ఎత్తిపోతల పథకానికి సంబంధించి 2023 డిసెంబర్‌ నాటికి కాలేటి వాగు రిజర్వాయర్‌లో నీటిని నింపి, చక్రాయ­పేట మండలంలోని 43 చెరువులకు నీళ్లిస్తాం. అటునుంచి రాయచోటి, తంబళ్లపల్లె, మదన­పల్లె, పుంగనూరు, పలమనేరు నియోజక­వర్గాలకు కూడా నీళ్లందించే దిశగా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. 

► చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి ఎర్రబల్లి చెరువుకు, అక్కడ నుంచి యూసీఐఎల్‌ పరిధిలోని గ్రామాలకు నీటి ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి 2023 జూన్‌ నాటికి ఎర్రబల్లి చెరువుకు, 2024 మార్చి నాటికి గిడ్డంగివారిపల్లె ట్యాంకుకు, యూసీ­ఐఎల్‌ పరిధిలోని గ్రామాలకు నీటిని సర­ఫరా చేస్తాం. అలవలపాడు ఎత్తిపోతల పథకా­నికి సంబంధించి 2023 నవంబర్‌ నాటికి పనులు పూర్తి చేసి.. వేముల, వేంపల్లె మండలా­ల్లోని పీబీసీ కెనాల్‌ టెయిల్‌ ఎండ్‌ గ్రామాలకు పూర్తిగా ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. 

సమగ్ర నీటి సరఫరా 
► పులివెందుల నియోజకవర్గంలో సమగ్ర నీటి సరఫరా కోసం దాదాపు రూ.480 కోట్లతో చేపడుతున్న వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. 2023 అక్టోబర్‌ నాటికి నియోజకవర్గ ప్రజలకు, పులివెందుల పట్టణానికి 2023 జూన్‌ నాటికి అందుబాటులోకి వస్తుంది. ప్రతి ఇంటికి కుళాయితో నీళ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. 

► పులివెందుల యూజీడీ పనులు 2023 మార్చి నాటికి, వేంపల్లె యూజీడీ పనులు 2023 అక్టో­బర్‌ నాటికి పూర్తయ్యేలా వేగంగా సాగుతు­న్నాయి. వేంపల్లెలో ప్రధాన రహదారుల విస్తర­ణకు సంబంధించి ఇప్పటికే భూసేకరణ పూర్త­యింది. రోడ్ల విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలు 2023 డిసెంబర్‌కు పూర్తవుతాయి. 

ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌
► పులివెందులలో క్రీడా సముదాయాలకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ 2023 మార్చి నాటికి  క్రీడాకారులకు అందుబాటులోకి వస్తుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే పులివెందులలో మహిళా డిగ్రీ కళాశాల ప్రారంభించాం. రూ.20 కోట్లతో వేంపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాల పనులు 2023 డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తాం. 

► 2023 మార్చి నాటికి నైపుణ్య అభివృద్ధి కేంద్రం పూర్తవుతుంది. సిటీ సెంట్రల్‌.. పులివెందులలో ఒక మాల్‌.  రూ.87 కోట్లతో నిర్మిస్తున్న ఈ మాల్‌ 2023 డిసెంబర్‌ నాటికి అందుబాటులోకి వస్తుంది. రాణితోపుకు సంబంధించి నగరవనం అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2023 మార్చి నాటికి పూర్తవుతాయి. 

► ఇడుపుల­పాయలో వైఎస్సార్‌ మెమోరియల్‌ అభి­వృద్ధి పనులు 2023 జూన్‌ నాటికి పూర్తవుతాయి. పట్టణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కలిగించేందుకు ఉలిమెల్ల సరస్సు అభివృద్ధి పనులు 2023 జూన్‌ నాటికి పూర్తవుతాయి. గండి ఆంజ­నేయ స్వామి దేవస్థానం పునర్నిర్మాణం 2023 జూన్‌కు పూర్తవుతుంది. ఇక నుంచి ప్రతి 3 నెలల­కొకసారి ప్రారంభోత్సవాలు కొనసాగుతాయి.

► ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజాద్‌బాషా, ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, పార్లమెంట్‌ సభ్యుడు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, కలెక్టర్‌ విజయరామరాజు, పులివెందుల మున్సిపల్‌ ఇన్‌­చార్జి వైఎస్‌ మనోహర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మెన్‌ వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  
 వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి    

బెంగళూరు–పులివెందుల–విజయవాడ
► కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మంచి రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం. పులివెందుల–బెంగళూరు ప్రయాణం సులభతరం చేసేందుకు ఏకంగా రూ.1,080 కోట్లతో ముద్దనూరు నుంచి బి.కొత్తపల్లి వరకు, రూ.840 కోట్లతో బి.కొత్తపల్లి నుంచి గోరంట్ల వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభమవుతాయి.  

► ఆరు వరుసలతో బెంగళూరు నుంచి పులివెందుల మీదుగా విజయవాడకు జాతీయ రహ­దారి నిర్మాణం రూ.13 వేల కోట్లతో చేపట్టే పనులకు సంబంధించి భూ సేకరణ దాదాపు చివరి దశకు వచ్చింది. ఇందులో 14 ప్యాకేజీ­లకు గాను ఇప్పటికే 10 ప్యాకేజీలకు టెండర్లను పిలిచారు. వీటితో రాబోయే రెండేళ్లలో గణనీ­యౖ­మెన మార్పులు కనిపించబోతున్నాయి.

► పులివెందులను మంచి నగరంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాం. ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుని దయ, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ బిడ్డకు ఇదే మాదిరిగా ఉండాలని, మీకు ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నా.  

రూ.125 కోట్లతో అభివృద్ధి పనులు 
► పులివెందులలో ఈరోజు దాదాపు రూ.125 కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులకు ప్రారం­భోత్సవాలు చేశాను. పులివెందుల రింగ్‌ రోడ్డులో ఐదు జంక్షన్ల సుందరీకరణ, ఆరోగ్య­పథం పేరుతో విజయ హోమ్స్‌ జంక్షన్, ప్రజా­పథం పేరుతో పులివెందుల–కదిరి జంక్షన్, పల్లెప­థం పేరుతో బొగ్గుడుపల్లె సర్కిల్‌ను ప్రారంభించాం. ఇలా ఐదు జంక్షన్ల ద్వారా పులివెందుల నాలుగు రోడ్ల కూడలికి వచ్చి చూస్తే సుందరంగా కనిపించేలా తీర్చిదిద్దాం. ఇదీ మన పులివెందుల అని రాష్ట్రం, దేశమంతా చూపించగలుగుతున్నాం.

► అన్ని హంగులతో విస్తరించిన 100 అడుగుల కదిరి రోడ్డు ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు చాలా సంతోషం అనిపించింది. నిజంగా మనం పులివెందులలోనే ఉన్నామా? లేదా ఏదైనా పెద్ద నగరంలో ఉన్నామా? అన్నట్టు ఆ రోడ్డు చాలా బాగుంది. దీన్ని ఆదర్శంగా చేసుకుని పులివెందులలోని అన్ని పెద్ద రోడ్లు అదే మాదిరిగా తయారు కావాలని అధికారులకు చెప్పాను. 

► పట్టణ ప్రజలకు అధునాతన కూరగాయల మార్కెట్, ప్రజలు మానసిక ఉల్లాసం పొందేందుకు డాక్టర్‌ వైఎస్సార్‌ మెమోరియల్‌ పార్క్‌ను ప్రారంభించాం. ప్రజల చిరకాల కోరిక అయిన రాయలాపురం బ్రిడ్జిని కూడా అధునాతన హంగులతో ప్రారంభించుకున్నాం. నాడు–నేడు ద్వారా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణంలోని అహోబిలపురంలో ఉన్న స్కూల్‌ను, చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ను, యూజీడీ పనుల్లో భాగంగా 10 ఎంఎల్‌డి ఎస్టీపీని ప్రారంభించాం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement