Badvel By Election: ఓటింగ్‌ శాతం పెరగాలి: సీఎం జగన్‌ | CM YS Jagan Says Voting percentage increase Badvel by-election | Sakshi
Sakshi News home page

Badvel By Election: ఓటింగ్‌ శాతం పెరగాలి: సీఎం జగన్‌

Published Fri, Oct 1 2021 2:21 AM | Last Updated on Fri, Oct 1 2021 7:05 AM

CM YS Jagan Says Voting percentage increase Badvel by-election - Sakshi

సీఎం జగన్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న వైఎస్సార్‌సీపీ బద్వేలు అభ్యర్థి దాసరి సుధ

సాక్షి, అమరావతి: బద్వేలు ఉప ఎన్నికలో ఓటింగ్‌ శాతం పెరగాలని, ఓటు వేసేలా ఓటర్లను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎక్కడా అతి విశ్వాసం ఉండకూడదని, కష్టపడి ప్రజల ఆమోదం పొందాలని స్పష్టం చేశారు. 2019లో 77 శాతం ఓటింగ్‌ జరిగిందని, ఇప్పుడు అంత కంటే ఎక్కువగా ఓటింగ్‌ శాతం పెరగాలన్నారు. బద్వేలు ఉప ఎన్నిక నేపథ్యంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివంగత ఎమ్మెల్యే డాక్టర్‌  వెంకట సుబ్బయ్య భార్య సుధ కూడా డాక్టర్‌ అని, మన పార్టీ తరఫున ఆమెను అభ్యర్థిగా నిలబెడుతున్నామని  ప్రకటించారు. బద్వేలు నియోజకవర్గ బాధ్యతలన్నీ ఇక్కడున్న (సమావేశంలో పాల్గొన్న) వారందరిమీదా ఉన్నాయని స్పష్టం చేశారు. నామినేషన్‌ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని ఆదేశించారు. 2019లో  వెంకసుబ్బయ్యకు వచ్చిన 44 వేలకుపైగా ఓట్ల మెజార్టీ కన్నా.. డాక్టర్‌ సుధకు ఇప్పుడు ఎక్కువ మెజార్టీ రావాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఎం ఏమన్నారంటే..

ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుపోవాలి
► ఉప ఎన్నికలో ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుపోవాలి. ప్రతి మండలాన్ని బాధ్యులకు అప్పగించాలి. గ్రామ స్థాయి నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించాలి. 
► ఒక్కో ఇంటికి కనీసం మూడు నాలుగు సార్లు వెళ్లి  వారిని అభ్యర్థించాలి. వారు పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా చైతన్య పరచాలి. నెల రోజుల పాటు మీ సమయాన్ని కేటాయించి, ఈ ఎన్నికపై దృష్టి పెట్టాలి. 
► బద్వేలు ఉప ఎన్నికకు పార్టీ ఇన్‌ఛార్జిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటారు. వచ్చే సోమవారం నుంచి పార్టీ తరఫున కార్యక్రమాలు మొదలు పెట్టాలి. మన ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఎలాంటి మేలు జరిగిందో తెలియజేయాలి.
► ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (మైనార్టీ వ్యవహారాలు) అంజాద్‌ బాషా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
ఈ ఏడాది మార్చిలో బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఉప ఎన్నిక జరుగుతోంది. ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. శుక్రవారం (నేడు) నోటిఫికేషన్‌ జారీ కాగానే, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 8వ తేదీ నామినేషన్ల దాఖలుకు తుది గడువు. 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉప సంహరణకు గడువుగా నిర్ణయించారు. అక్టోబర్‌ 30న పోలింగ్‌ నిర్వహిస్తారు. నవంబర్‌ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement