సాక్షి, నారాయణపేట: పాలమూరును నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. సోమవారం ఇక్కడ జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. ‘ఇక్కడి నుంచి ఎంతో మంది మంత్రులు ఉండె.. కానీ ఒక్క పని చేయలేదు. ఒక్కడు కూడా జై తెలంగాణ అన్న పాపాన పోలేదు. ఇపుడు మల్ల దోఖా చేసేందుకు వస్తున్నారు. మన భవిష్యత్ బాగుండాలంటే బీఆర్‌ఎస్ మాత్రమే శ్రీరామ రక్ష.
కరెంటు మూడు గంటలు ఉండాల్నా.. 24 గంటలు కావాల్నా.. 24 గంటలు కావాలంటే బీఆర్‌ఎస్ గెలవాలె. రైతుల భూములు కాపాడాలని ధరణి తెచ్చాం. ఇపుడు ధరణిని తీసేస్తామని కాంగ్రెస్ అంటోంది. నారాయణపేట హైదారాబాద్ తర్వాత మున్సిపాలిటీ గా ఏర్పడిన మొదటి పట్టణం. ఉమ్మడి ఏపీలో అప్పట్లో నారాయణ పేట ఎడారిని తలపిస్తుండే. కాంగ్రెస్ పాలకులే నాశనం పట్టించారు. తెలంగాణ వచ్చినంక ఒక్కొక్కటి సర్దుకుంటున్నం. ఏడెనిమిది నెలల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాల్వ పనులు పూర్తి అయితయి. నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాలకు నీళ్లొస్తయ్’ అని కేసీఆర్ అన్నారు.
రాహుల్ గాంధీకి ఎద్దున్నదా తెల్వనీకి...
‘జోగులాంబ తల్లి ఒక శక్తి పీఠం. అందుకే జిల్లాకు అమ్మవారి పేరు పెట్టాం. తిరుపతి వెంకట కవులను సన్మానించిన చరిత్ర గద్వాలది. గద్వాలను గబ్బు పట్టించిన గబ్బు నాయళ్లు ఎవరు? ఆ పార్టీల చరిత్ర కూడ తెలుసుకోవాలి. కృష్ణా, తుంగభద్ర నదులను ఎటు కాకుండగా ఆగం చేసిందెవరు. ఇక్కడి నాయకులు ఆంధ్ర నాయకులకు మంగళహారతులు పట్టిండ్రు. రాహుల్ గాంధీకి వ్యవసాయం గురించి తెల్వడానికి ఆయనకు ఎద్దు ఉన్నదా? వ్యవసాయం ఉన్నదా? పాత పాలమూరు జిల్లాలో పెద్ద సంఖ్యలో వాల్మీకి బోయలున్నారు. వారిని ఎస్టీల్లో కలపాలని అసెంబ్లీలో రెండు సార్లు తీర్మానం చేసి పంపినా ప్రధాని మోదీకి చీమ కుట్టినట్టు కూడా లేదు’ అని కేసీఆర్ గద్వాల సభలో మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment