విశాఖ నగరంలో పచ్చ పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలున్నారు. కాని ఒకరంటే మరొకరికి పడదు. అసలు జిల్లాలోనే గ్రూప్ రాజకీయాలు రాజుకున్నాయి. మాజీ మంత్రులంతా గ్రూప్లుగా ఏర్పడి కొట్లాడుకుంటున్నారు. దీంతో విశాఖ జిల్లా టీడీపీ కుక్కలు చింపిన విస్తరిలా మారిందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్య నేతలంతా తమదే పైచేయి కావాలనే ఆరాటమే పార్టీకి ఈ గతి పట్టించిందని చెబుతున్నారు. ఇంతకీ పచ్చ పార్టీని ఆగం చేస్తున్న ఆ నాయకులెవరు..
ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు మరో తొమ్మిది నెలల్లోనే జరగబోతున్నాయి. ఎగ్జిక్యూటివ్ రాజధాని కాబోతున్న విశాఖలో పచ్చ పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ముఖ్యంగా ఇద్దరు మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు రెండు గ్రూప్లుగా విడిపోయి ఉమ్మడి జిల్లా పార్టీని కుక్కలు చింపిన విస్తరిలా చేశారంటున్నారు అక్కడి కేడర్. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. రాజకీయ ఆధిపత్యం కోసం వీరిద్దరూ ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ ఒకరి వర్గాన్ని మరొక వర్గం అణగదొక్కే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో తమ మార్క్ రాజకీయాలకు మరింత పదును పెడుతున్నారు.
తెలుగుదేశం పార్టీలో చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య ఉన్న వైరం ఈనాటిది కాదు. దాదాపు 20 ఏళ్లకు పైగా వీరిద్దరి మధ్య రాజకీయ ఆధిపత్య పోరాటం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో అయ్యన్న కుటుంబాన్ని కేవలం నర్సీపట్నంకు పరిమితం చేయాలని మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి పావులు కదుపుతున్నారు. అయ్యన్న మాత్రం ఈసారి ఎలాగైనా తన కుమారుడు విజయ్ కు అనకాపల్లి ఎంపీ సీటు ఇప్పించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. గత ఎన్నికల్లోనే అనివార్య కారణాలవల్ల సీటు ఇవ్వలేదని ఈసారి ఎలాగైనా తన కుమారునికి సీటు ఇవ్వాలని చంద్రబాబుపై అయ్యన్న ఒత్తిడి తెస్తున్నారు.
ఇదే సందర్భంలో అయ్యన్న కుటుంబానికి రాజకీయంగా చెక్ పెట్టేందుకు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి తమ కుమారులు గంటా రవితేజ, బండారు అప్పలనాయుడులను రాజకీయంగా తెరపైకి తీసుకువస్తున్నారు. అయ్యన్న కుమారునికి అనకాపల్లి ఎంపీ సీటు ఇచ్చినట్లయితే తమ కుమారులకి కూడా సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గంటా తన కుమారుని కోసం చోడవరం అసెంబ్లీ, బండారు తన కుమారుని కోసం మాడుగుల లేదా విశాఖ నార్త్ సీటు ఇవ్వాలని కోరుతున్నారు. అయ్యన్నపాత్రుని కుటుంబంలో రెండు సీట్లు ఇస్తే తమ కుమారులు పరిస్థితి ఏంటని పార్టీ అధినేత చంద్రబాబునుప్రశ్నిస్తున్నారు. అయ్యన్న కుమారునికి వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వకుండా అడ్డుపుల్ల వేయడం కోసం గంటా, బండారు తమ కుమారులను వ్యూహాత్మకంగా తెరపైకి తెస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీలో చర్చ నడుస్తోంది.
ఇదిలా ఉంటే నాయకుల గ్రూపు రాజకీయాలపై టిడిపి కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇటువంటి నాయకులవల్లే జిల్లాలో పార్టీకి ఉనికి లేకుండా పోయిందని..ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అయినా పార్టీని బలోపేతం చేయకుండా కొట్టుకుచావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘ఏపీలో బీజేపీ.. టీజేపీగా మారిపోయింది’
Comments
Please login to add a commentAdd a comment