కందికుంట ఎదుటే మనోహర్ నాయుడుపై దౌర్జన్యం చేస్తున్న చంద్రదండు ప్రకాష్ నాయుడు
కదిరి(అనంతపురం): టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం రచ్చ రచ్చగా మారింది. సొంత పార్టీ నాయకుడిపైనే నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ అనుచరులు రెచ్చిపోయారు. సోమవారం కదిరి పట్టణంలోని అమృత ఫంక్షన్ హాలులో సమావేశం నిర్వహించారు. గ్రూపులు, వర్గ పోరు కారణంగానే నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ చేతిలో వరుసగా రెండు సార్లు ఓడిపోయామని టీడీపీ నాయకుడు మనోహర్ నాయుడు అనడంతో కందికుంట అనుచరులు ఒక్కసారిగా ఆయనపైకి దూసుకెళ్లారు.
ఆయన చేతిలోని మైకు లాక్కొని ‘ఇక్కడ కందికుంట వర్గం తప్ప మరో వర్గానికి తావు లేదు. నువ్వు అనవసరంగా ఏదేదో మాట్లాడితే బాగుండదు’ అని హెచ్చరించారు. అయితే మనోహర్ నాయు డు స్వరం పెంచుతూ.. ‘నేను చెప్పింది అక్షరాలా నిజం. పార్టీ మీద అభిమానం కన్నా కందికుంట భజనపరులే ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. వ్యక్తుల కన్నా పార్టీనే సుప్రీం. ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకోవడానికి కలిసి కట్టుగా పనిచేద్దాం’ అని చెప్పడంతో వారు మరోమారు దౌర్జన్యానికి దిగారు. చివరకు కందికుంట మైకు అందుకొని సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
చాంద్‌బాషా దూరం : టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాతో పాటు ఆయన వర్గీయులు హాజరు కాలేదు. అది పార్టీ సమావేశం కాదని, కందికుంట భజనపరుల మీటింగ్ అని చాంద్‌బాషా అనుచరులు బాహాటంగానే విమర్శించారు. నకిలీ డీడీల కేసులో కందికుంట మళ్లీ జైలుకెళ్లడం ఖాయమని, కావున వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ చాంద్‌బాషాకే వస్తుందని వారు అంటున్నారు. ఇటీవల పార్టీ నిర్వహించిన సర్వేలో సైతం కందికుంటకు 35.9 శాతం రాగా.. చాంద్‌బాషాకు 64.1 శాతం మద్దతు లభించిందని చాంద్ అనుచరులు చెబుతున్నారు. ఈ సర్వేపై ఇప్పటికే కందికుంట, చాంద్‌బాషా వర్గీయుల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది.
చాంద్‌కు అంతసీన్ లేదు : వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి అధికారం కోసం అమ్ముడుపోయిన చాంద్‌బాషా ఇకమీదట వార్డు మెంబర్‌గానూ గెలవలేరని, అలాంటి వ్యక్తికి సర్వేలో 64 శాతం వచ్చిందంటే టీడీపీ కార్యకర్తలెవరూ నమ్మరని కందికుంట వర్గీయులు అంటున్నారు. కాగా...రానున్న రోజుల్లో ఇరువురు నాయకుల మధ్య వర్గ పోరు మరింత ముదరడం ఖాయమని, ఇక్కడ మళ్లీ ఫ్యాన్ ప్రభంజనమే ఉంటుందని స్వయానా టీడీపీ కార్యకర్తలే వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment