సాక్షి ప్రతినిధి, కర్నూలు: అసెంబ్లీ, పార్లమెంట్‌లో జిల్లా నుంచి ప్రాతినిధ్యంలేని దారుణ స్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ వర్గపోరుతో మరింత బలహీనపడుతోంది. నేతల మధ్య విభేదాలు ముదిరి పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఆలూరు, ఎమ్మిగనూరు, డోన్‌తో పాలు పలు నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్ ప్రత్యామ్నాయ పారీ్టల వైపు చూస్తోంది. ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే, ఇన్‌చార్జ్ బీవీ జయనాగేశ్వరరెడ్డికి వ్యతిరేకంగా మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పనిచేస్తున్నారు. ఈనెల 2వ తేదీన కార్యాలయాన్ని సైతం ప్రారంభించారు.
చదవండి: అధికారం కోసం బాబు ఎంతకైనా తెగిస్తాడు
బీవీని వ్యతిరేకించే గోనెగండ్ల మాజీ ఎంపీపీ కృష్ణారెడ్డి, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు పరమేశ్వరరెడ్డి, మాజీ సర్పంచ్ రంగముణితో పాలు పలువురికి కోట్ల అండగా నిలిచారు. పైగా పార్టీ ఆదేశిస్తే ఎవ్వరైనా పోటీ చేయొచ్చని ఆయన చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. దీంతో జయనాగేశ్వరరెడ్డికి పార్టీలో ప్రాధాన్యం లేదని టీడీపీ శ్రేణులతో పాటు ఎమ్మిగనూరు ప్రజల్లో భావన మొదలైంది. రెండున్నరేళ్లుగా నాగేశ్వరరెడ్డి నియోజకవర్గాన్ని, టీడీపీ కార్యకర్తలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కార్యకర్తలకు అందుబాటులో లేకుండా హైదరాబాద్‌కు మకాం మార్చారు.
దీంతో ప్రణాళిక ప్రకారం అతన్ని తప్పించేందుకు పార్టీ అధిష్టానమే ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తోందనే వాదన విన్పిస్తోంది. ఇదిలా ఉండగా జయనాగేశ్వరరెడ్డి పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు సోమిశెట్టితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి.. పార్టీ వ్యతిరేకులను ప్రోత్సహిస్తున్నారని, ఇది సరికాదని వ్యాఖ్యలు చేశారు. వార్డు పర్యటనలు సైతం చేస్తున్నారు. అయితే ఆయన వెంట టీడీపీ ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలు కలిసి రావడం లేదు.
డోన్‌లో సుబ్బారెడ్డికి వ్యతిరేక పవనాలు
డోన్ నియోజకవర్గంలో పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా కేఈ ప్రతాప్ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌చార్జ్‌గా ధర్మవరం సుబ్బారెడ్డిని నియమించారు. అయితే సుబ్బారెడ్డి నాయకత్వాన్ని మండల స్థాయి నాయకులు అంగీకరించడం లేదు. ప్యాపిలి మాజీ ఎంపీపీలు తొప్పెర శీను, సరస్వతి, చెన్నయ్య తదితరులు సుబ్బారెడ్డి నాయకత్వంలో తాము పనిచేసే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. సుబ్బారెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్, అక్కడి నుంచి వైఎస్సార్‌సీపీ, ఆపై టీడీపీలో చేరి రోజుకో పార్టీ మార్చి, వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు. ఎవ్వరితో చర్చించకుండా పార్టీ నిర్ణయం తీసుకోవడాన్ని కూడా తప్పుబట్టారు. ఈ పరిణామాలపై ఏకంగా కరపత్రాలు ముద్రించి నియోజకవర్గంలో పంపిణీ చేశారు.
డోన్ మునిసిపాలిటీలోని టీడీపీ నాయకులు చిట్యాల మద్దయ్యగౌడ్, కేశన్నగౌడ్‌లు కూడా సుబ్బారెడ్డి నాయకత్వాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని బాహాటంగానే ప్రకటించారు. సుబ్బారెడ్డిని కేడర్ అంగీకరించకపోవడం, కేఈ ప్రతాప్‌ను అధిష్టానం వద్దనడంతో డోన్‌లో నాయకత్వలేమితో టీడీపీ కొట్టుమిట్టాడుతోంది. దీంతో కోట్ల సుజాతమ్మను డోన్‌కు వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించినట్లు సమాచారం. అయితే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అత్యంత బలంగా ఉన్న డోన్‌లో తాను గెలవడం సాధ్యం కాదని సుజాతమ్మ డోన్‌పై విముఖత ప్రదర్శిస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలో అంతర్గత పోరు, ఆధిపత్య పోరుతో టీడీపీ కొట్టుమిట్టాడుతోంది. నేతల తీరుతో టీడీపీలో ఉంటే భవిష్యత్ లేదని ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు మండల, గ్రామస్థాయి నాయకులు ఇతరపారీ్టల వైపు చూస్తున్నారు.
ముదురుతున్న ఆలూరు పంచాయితీ
ఆలూరులో కోట్ల సుజాతమ్మ, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ మధ్య వర్గపోరు రోజురోజుకు ముదురుతోంది. ఈనెల 8న కేఈ ప్రభాకర్ మొలగవెల్లిలోని చెన్నకేశవస్వామి రథోత్సవానికి వెళ్లారు. ఆలూరు, కర్నూలు అసెంబ్లీ టికెట్లు ఆశిస్తున్నానని, అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడైనా సరే పోటీ చేస్తానని చెప్పారు. కేఈ వెంట ఆలూరు మాజీ ఇన్‌చార్జ్ వైకుంఠం మల్లికార్జున చౌదరి, మాజీ ఎంపీపీ దేవేంద్రప్ప కూడా ఉన్నారు.
ఈ క్రమంలో వెంటనే మరుసటి రోజు కోట్ల సుజాతమ్మ ఆలూరు, ఆస్పరితో పాటు పలు చోట్ల పర్యటించారు. ఆలూరు నుంచి తానే పోటీ చేస్తానని, అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు తమకు ఉన్నాయని, ఎవ్వరు ఎలాంటి ప్రకటనలు చేసినా నమ్మొద్దని టీడీపీ శ్రేణులకు చెప్పారు. సీనియర్లను కాదని జూనియర్లను మండల కన్వీనర్లుగా నియమించడంతో సుజాతమ్మను టీడీపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. వీరంతా కేఈ వర్గం వైపు నడుస్తున్నారు. ఇదిలా ఉండగా 2014లో టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయిన వీరభద్రగౌడ్ కొత్తగా తెరపైకి వచ్చారు. ఆలూరులో ఇటీవలే ఇల్లు తీసుకుని, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు. దీంతో ఇక్కడ టీడీపీ మూడు వర్గాలుగా విడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment