సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో టికెట్ల వ్యవహారం చిచ్చురేపుతోంది. బీసీలకు 34 సీట్లు ఇస్తామని రాజకీయ వ్యవహారాల కమిటీలో ఇచ్చిన హామీ మేరకు టికెట్లు కేటాయించకపోతే ప్రత్యక్ష కార్యా చరణకు సిద్ధం కావాలని ఆ వర్గం నేతలు నిర్ణయించారు. గురువారం రాత్రి నగర శివారు శంషాబాద్‌కు సమీపాన రాళ్లగూడలోని ఓ కళాశాలలో సమావేశమైన బీసీ నేతలు.. పార్టీలోని కొందరు బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరుపై కూలంకషంగా చర్చించినట్లు సమాచారం. బీసీలకు టికెట్ల వ్యవహారంపై అంతర్గతంగా పార్టీలోనే చర్చించాలని, బహిరంగంగా పత్రికలకు ఎక్కరా దంటూ పార్టీలోని కొందరు నేతలు హెచ్చరికలు చేయడాన్ని వారు తీవ్రంగా తప్పుపట్టినట్లు తెలిసింది. ఇది బీసీలను అణగదొక్కే చర్యగా వారు అభిప్రాయపడినట్లు సమాచారం.
ఈ సమావేశంలో పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, కాసుల బాలరాజ్, శ్రీహరి ముదిరాజ్ దండ శ్రీనివాస్, ఐనీల దామోదర్, ప్రదీప్‌కుమార్ వంటి నేతలు దాదాపు 40 మంది పాల్గొన్నారు. టికెట్ల వ్యవహారంలో సామాజిక సమతుల్యత పాటించకపోతే ఎలా అని, రాజకీయ వ్యవహారాల కమిటీ లో చేసిన నిర్ణయాన్ని కూడా గౌరవించకపోవడం ఏమి పద్ధతి అని కొందరు ప్రశ్నించారు. సర్వేలు, ఆర్థిక పరిస్థితులనే సాకులు చూపి బీసీలకు టికెట్లలో కోత విధించడం సమంజసం కాదని వారు పేర్కొన్నట్లు తెలిసింది.
టికెట్ల ఖరారుకు ముందే బీసీలకు 34 స్థానాలు (ప్రతి పార్లమెంట్‌లో రెండు అసెంబ్లీ స్థానాలు) కేటాయింపు విషయం మరోసారి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని, ఢిల్లీ కూడా వెళ్లి పార్టీ పెద్దలను కలిసి పరిస్థితిని వివరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఈ సమావేశంలో పాల్గొన్న ఓ నాయకుడు వెల్లడించారు. సీనియర్లు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, మహేశ్‌కుమార్‌గౌడ్ వంటి నేతలు హాజరుకాకపో యినా.. సమావేశంలో చర్చించిన అంశాలను వారికి వివరించినట్లు తెలిసింది. గత నెలలోనే బీసీ నేతలంతా ఢిల్లీ వెళ్లి పార్టీ సంస్థాగత వ్వవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమై బీసీలకు 34 సీట్లు ఇవ్వాలని కోరిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment