
నిర్మల్: బంగారు తెలంగాణ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దోచుకున్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు బంగారు భారత్ అంటూ దేశాన్ని దోచుకునేందుకు బయలుదేరారని, కేసీఆర్ ఫ్రంట్ ఉత్తదే నని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ అన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో డిజిటల్ సభ్యత్వ లక్ష్యాన్ని పూర్తిచేసిన కాంగ్రెస్ నాయకులతో ఆదివారం ఆయన నిర్మల్‌లో సమావేశమయ్యారు.
ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసకృష్ణన్ తదితరులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఠాగూర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏక్ పోలింగ్ బూత్–ఏక్ ఎన్‌రోలర్’లెక్కన డిజిటల్ సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. మొత్తం 34,498 మంది ఎన్‌రోలర్స్‌ను నియమించామన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 78 సీట్లు గెలువడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలన్నారు. పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలౖపై పార్టీలోనే చర్చించుకోవాలి తప్పా బహిర్గతం చేయొద్దన్నారు.
అవినీతి మంత్రులు బీజేపీలో చేరుతారు..
టీఆర్‌ఎస్, బీజేపీ రెండూ ఒకటేనని, ఢిల్లీలో ఒకమాట, గల్లీలో ఒకమాటగా మాట్లాడతారని ఠాగూర్ ఆరోపించారు. టీఆర్‌ఎస్ అవినీతి మంత్రులంతా రక్షణ కోసం బీజేపీలో చేరుతారని చెప్పారు. మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి జిల్లాలో చెరువులు, గుట్టలను కబ్జా చేశారని, డీ–వన్ పట్టాలతో ప్రభుత్వ భూములనూ బినామీల పేరిట చెరబట్టారని ఆరోపించారు. సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఈ.అనిల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment