సాక్షి, హైదరాబాద్: మార్కండేయ ప్రాజెక్టు సందర్శన సందర్భంగా తమ పార్టీకి చెందిన దళిత, గిరిజన నాయకులపై అధికార బీఆర్‌ఎస్ నేతల దాడిని నిరసిస్తూ ఈనెల 22న నాగర్‌కర్నూల్ కేంద్రంగా ‘దళిత గిరిజన ఆత్మగౌరవ సభ’ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ సభకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రే ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
ఈనెల 20, 21, 22 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్న ఆయన రాష్ట్ర ఇన్‌చార్జి హోదాలో ఈ సభకు తొలిసారి అతిథిగా రానున్నారు. కాగా, పంజగుట్ట చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలంటూ టీపీసీసీ బృందం బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కలిసి విజ్ఞప్తి చేయనుంది. పంజగుట్ట చౌరస్తా నుంచి తొలగించి పోలీస్‌స్టేషన్‌లో ఉంచిన అంబేడ్కర్ విగ్రహాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు అప్పగించాలంటూ కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆ విగ్రహాన్ని పంజగుట్ట చౌరస్తాలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరనుంది.
ఇందుకోసం శాంతికుమారి అపాయింట్‌మెంట్ కోరుతూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఇప్పటికే పార్టీ తరఫున లేఖ రాశారు. సీఎస్ అపాయింట్‌మెంట్ లభిస్తే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం సీఎస్‌ను కలిసి అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు, ఎమ్మెల్యేలకు ఎర కేసుతోపాటు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరడాన్ని కూడా విచారించాలని కోరనుంది.
గొంతుపై కాలుపెట్టి చంపే యత్నం చేశారు: నాగం
మార్కండేయ ప్రాజెక్టు సందర్శన కోసం వెళ్లిన సమయంలో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తల గొంతుపై కాలు పెట్టి చంపేందుకు యత్నించారని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, మాజీ ఎంపీ మల్లురవితో కలిసి ఆయన గాం«ధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. దళిత, గిరిజన నేతలపై దాడులు చేయడమేకాక తిరిగి వారిపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment