సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? గతం కంటే బలపడుతున్నామా? బలహీనపడుతున్నామా? మనకు గతంలో వచ్చిన 26–28 శాతం ఓట్లు 40 శాతానికి చేరాలంటే ఏం చేయాలి? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 119 స్థానాల్లో ఎన్నిచోట్ల మనం గెలుస్తాం? 60 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చేందుకు మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటి? పార్టీలో అంతర్గత సమస్యలేంటి? ఎందుకీ విభేదాలు..?’’.. రాష్ట్ర కాంగ్రెస్ నూతన ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే ఇక్కడి నేతల నుంచి లోతుగా ఆరా తీస్తున్న అంశాలివి.
వీటితోపాటు రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీల పరిస్థితి ఏమిటి, వాటి విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారన్న దానిపైనా ఆయన సమాచారం సేకరిస్తున్నారు. రాష్ట్ర ఇన్‌చార్జిగా నియామకం అయ్యాక తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన మాణిక్‌రావ్ ఠాక్రే బుధవారం గాంధీభవన్ వేదికగా బిజీబిజీగా గడిపారు. దాదాపు 20 మంది నేతలతో విడివిడిగా సమావేశమై అభిప్రాయాలను తెలుసుకున్నారు. నేతలు చెప్పేది వింటూ, మధ్యలో ప్రశ్నలు అడుగుతూ వివరాలన్నింటినీ నోట్ చేసుకున్నారు.
ఏఐసీసీ కార్యదర్శులతో మొదలు
మాణిక్‌రావ్ ఠాక్రే బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఇతర నేతలు ఘనంగా స్వాగతం పలికారు. సుమారు పదిన్నర గంటల సమయంలో మాణిక్‌రావ్ ఠాక్రే గాంధీభవన్‌కు చేరుకోగా.. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మాణిక్‌రావ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. వెంటనే భేటీలు మొదలుపెట్టారు. తొలుత ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, నదీమ్ జావేద్, రోహిత్ చౌదరిలతో సమావేశమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితులు, ఏఐసీసీతో సమన్వయం, అధిష్టానం వద్ద ఉన్న పార్టీ సమాచారం, హాత్‌సే హాత్ జోడో యాత్ర ప్రణాళిక తదితర అంశాలపై ఇందులో చర్చించినట్టు సమాచారం.
వరుసగా సమావేశాలు
అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలతో విడివిడిగా అరగంట పాటు మాణిక్‌రావ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయం, హాత్‌సే హాత్ జోడో యాత్ర విజయవంతంపై చర్చించారు. పలు అంశాలపై వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఆనక సాయంత్రం దాకా వరుసగా సీనియర్ నేతలు వీహెచ్, అజారుద్దీన్, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, షబ్బీర్‌అలీ, మహేశ్వర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీగౌడ్, రేణుకాచౌదరి తదితరులతో విడివిడిగా భేటీ అయ్యారు. రాత్రి ఏడు గంటల సమయంలో జరిగిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీ సుదీర్ఘంగా మూడు గంటల పాటు సాగింది.
నేడు కూడా సమావేశాలు
గురువారం రెండోరోజు పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో మాణిక్‌రావ్ ఠాక్రే సమావేశం కానున్నారు. టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు, ఇతర ముఖ్య నేతలతో భేటీ అయిన అనంతరం ఆయన ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.
మాట్లాడుతూ.. మాట్లాడిస్తూ..
యువజన కాంగ్రెస్‌లో పనిచేసినప్పటి నుంచీ సుదీర్ఘకాలంగా కాంగ్రెస్‌లో చురుకుగా పనిచేసిన మాణిక్‌రావ్ ఠాక్రే.. రాష్ట్రంలో 2023 ఎన్నికలే లక్ష్యంగా నేతల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ పరిస్థితి, అధికారంలోకి వచ్చేందుకు ఉన్న మార్గాలపై ఆయన ఎక్కువ ఫోకస్ చేశారని.. నేతల మధ్య విభేదాలకు కారణాలు, సమన్వయం కోసం తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారని సమాచారం.
ఆయన తాను మాట్లాడుతూనే.. రాష్ట్ర నాయకులతో కూడా మాట్లాడించేలా ప్రశ్నలు వేశారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక ఠాక్రేతో సమావేశమైన పలువురు నేతలు.. రాష్ట్రంలో పార్టీ బలంగా ఉందని, సరైనదిశలో తీసుకెళ్లలేకపోవడమే ప్రధాన సమస్య అని వివరించినట్టు సమాచారం. పార్టీని ముందుకు తీసుకెళ్లడం ఏ ఒక్కరితోనో సాధ్యం కాదని.. కలసికట్టుగా ముందుకెళ్లాల్సి ఉంటుందని, దానికి మీరే మార్గం కనుక్కోవాలని కొందరు నేతలు పేర్కొన్నట్టు తెలిసింది. ఇటీవల నియమించిన కమిటీలు, పార్టీలో సమాచార లోపం తదితర అంశాలపైనా ఠాక్రేకు వివరించినట్టు సమాచారం. మొత్తమ్మీద తొలిరోజు 12 గంటలకుపైగా ఆయన సమావేశాలు నిర్వహించారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఠాక్రే ఫోన్
కొత్త ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడినట్టు సమాచారం. బుధవారం తాను గాంధీభవన్‌కు వస్తున్నానని, వచ్చి కలవాలని ఠాక్రే కోరగా.. తాను నియోజకవర్గంలో జరిగే సమావేశానికి వెళుతున్నానని, వచ్చిన తర్వాత కలుస్తానని వెంకటరెడ్డి చెప్పినట్టు తెలిసింది. ఠాక్రేతో సమావేశమయ్యేందుకు గాంధీభవన్‌కు రావాలంటూ టీపీసీసీ నుంచి కూడా వెంకటరెడ్డికి సమాచారం వెళ్లినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment