ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. గతంలో గెలిపించినవారిలో భట్టి విక్రమార్క మినహా మిగిలినవారంతా కారెక్కి వెళ్ళిపోయారు. దీంతో ఇప్పుడు ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కేడర్ తప్ప లీడర్లు కనిపించడంలేదు. ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ స్థితిలో పార్టీని నడిపించే నాథులు కరువయ్యారనే టాక్ వినిపిస్తోంది. జిల్లాను ఉద్దరించే నేతల కోసం హస్తం పార్టీ నాయకత్వం పక్క పార్టీల వైపు చూస్తోందా? అనేది చర్చనీయాంశంగా మారింది.
ఖమ్మం జిల్లాలో మధిర మినహా మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని నడిపించడానికి నాయకులే లేరు. గత రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపించిన నేతలు గులాబీ గూటికి చేరిపోయారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఒక్కడే ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఎన్నికలు వచ్చినపుడు మధిరలో ఇతర పార్టీలను ఎదుర్కొని గెలవడానికి భట్టి సిద్ధంగా ఉన్నారు. ఇక మిగతా నియోజకవర్గాల్లో అసలు పోటీ చేయడానికి అభ్యర్థులే కనిపించడంలేదని అక్కడి కార్యకర్తలు వాపోతున్నారు. ఒకప్పుడు ప్రత్యర్థులతో ఢీ అంటే ఢీ అనే హస్తం పార్టీకి ఖమ్మం జిల్లాలో దుర్భర పరిస్తితులు ఏర్పడ్డాయి.
ఖమ్మంతో పాటు పాలేరు, సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించడమంటే అంత తేలికైన పనికాదు. క్యాడర్ తో కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థి అవసరం. ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హ్యాట్రిక్ సాధిస్తాననే ధీమాతో ఉన్నారు. ఆయన్ను ఓడించాలంటే పాటు స్థానికంగా అర్థబలం, అంగబలం ఉన్న శక్తివంతమైన నేత కాంగ్రెస్కు అవసరం. ఖమ్మం నియోజకవర్గంలో పువ్వాడకు గట్టి పోటి ఇచ్చే స్థాయి గల నేత ఒక్కరు కూడా లేరని అంటున్నారు. డీసీసీ అధ్యక్షుడు ఉన్నా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి మినహా పువ్వాడను ఎదుర్కొనేంత శక్తి ఆయనకు లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాల్లోను అదే పరిస్తితి నెలకోంది. సత్తుపల్లి కాంగ్రెస్ లో మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్, మానవతరాయ్ ఉన్నా బీఆర్ఎస్ నుంచి బలంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య లాంటి నేతను ఓడించాలంటే స్థానికంగా ఆ స్థాయి నేత ఉండటం అవసరం. వచ్చే ఎన్నికల్లో పాలేరు హట్ సీట్ గా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ రాయల నాగేశ్వర్ రావు కొంత యాక్టీవ్ గా పనిచేస్తున్నా..లోకల్ గా పార్టీ పుంజుకునే పరిస్తితి కనబడటంలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ తరపున సిటింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డితో పాటు వైఎస్సార్ టీపీ నుంచి వైఎస్ షర్మిల బరిలో నిలిచే అవకాశం ఉండటంతో గట్టి అభ్యర్థి కోసం చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ అన్వేసిస్తోంది.
వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక లాగా మారింది. టికెట్ ఆశిస్తున్న వారు అరడజను పైనే ఉన్నప్పటికీ..ఇందులో ఒక్కరికి కూడా గెలిచే సత్తా లేదని కాంగ్రెస్లోనే ప్రచారం జరుగుతోంది. పైగా వారిలో ఎవరికీ మరొకరితో పడదు. నాయకుల మధ్య ఉన్న గ్రూప్ తగాదాల కారణంగా వైరాలో రోజు రోజు పార్టీ మరింత బలహీనంగా మారుతోందని చెబుతున్నారు. దీంతో ఇక్కడ కూడ బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న ఓ బలమైన నేతను చేర్పించుకోని టికెట్ ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే గులాబీ పార్టీకి చాలాకాలం నుంచి దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పొంగులేటి కాంగ్రెస్లో చేరితే ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోతాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అంతటా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన పొంగులేటి ఏ పార్టీలో చేరతారనే విషయమై ఇంతవరకు స్పష్టత ఇవ్వడంలేదు. ఈ నెలలోనే ఆయన ఏదో ఒక పార్టీలో చేరతారని పొంగులేటి అనుచరులు చెబుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే జిల్లాలో నాయకత్వ సమస్య పూర్తిగా తీరిపోతుందని భావిస్తున్నారు. మరి కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment