
సాక్షి, హైదరాబాద్: పోతిరెడ్డిపాడును కాంగ్రెస్ పార్టీనే మొదలుపెట్టిందని, కాంగ్రెస్‌కు చెందిన మంత్రులే ప్రోత్సహించారని.. టీఆర్‌ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నిజానికి పోతిరెడ్డిపాడును ఆపాలని కాంగ్రెస్ నాయకులే ఉద్యమాలు చేశారని ఆయన స్పష్టంచేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద భట్టి విలేకరులతో మాట్లాడుతూ.. అసలు పోతిరెడ్డిపాడు పాపం కేసీఆర్‌దేనని వ్యాఖ్యానించారు. 1985–86 ప్రాంతంలో ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు పనులు మొదలు పెట్టిందని చెప్పారు. ఆ సమయంలో టీడీపీ శాసనసభ్యుడిగా ఉన్న కేసీఆరే దానికి బాధ్యుడని విమర్శించారు.
దాదాపు 406 కిలోమీటర్లు ఓపెన్ కెనాల్ ద్వారా రోజుకు ఒక టీఎంసీ చొప్పున 15 టీఎంసీలను చెన్నై నగరానికి తాగునీటి కోసం తీసుకువెళ్లే పని మొదలుపెట్టిందే నాడు కేసీఆర్ మంత్రిగా ఉన్న ప్రభుత్వమని చెప్పారు. ఓపెన్ కెనాల్ వల్లనే ఏపీ నాయకులు నీళ్లు తోడుకోవడం, అడ్డగోలుగా నీటిని తీసుకెళ్లే వీలుకలిగిందని భట్టి పేర్కొన్నారు. పాపం కేసీఆర్ చేస్తే.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపైనే నిందలు వేస్తారా అని నిలదీశారు. కృష్ణా నదిపై సంగమేశ్వరం దగ్గర రాయలసీమ లిఫ్ట్‌ను ఏపీ ప్రభుత్వం నిర్మిస్తుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం తాము చేశామని, ఇది చాలా ప్రమాదకరమని కాంగ్రెస్ పార్టీ అరిచిగీపెట్టినా ఈ ప్రభుత్వం నిద్ర లేవలేదని ఎద్దేవా చేశారు. ఏడాది తర్వాత లేచి అరుస్తున్నారని, అప్పుడు కూడా కేసీఆర్‌కు సోయి లేక కాదని, ఆయనకు తెలంగాణ ప్రయోజనాల కంటే స్వంత రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment