సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా ప్రతి కార్యకర్త, నాయకుడు పనిచేయాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే చెప్పారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించడం కాంగ్రెస్‌కు అత్యంత అవసరమనే విషయాన్ని పార్టీ నేతలు గుర్తెరగాలని హితవు పలికారు. ఇన్‌చార్జిగా నియమితులైన తరువాత తొలిసారిగా బుధవారం హైదరాబాద్‌కు వచ్చిన ఠాక్రే రెండురోజుల పాటు పార్టీలోని వివిధ స్థాయి నాయకులతో సమావేశమయ్యారు.
సీనియర్ కాంగ్రెస్ నేతలతో పాటు పీఏసీ, పీఈసీ, డీసీసీ, పీసీసీ కార్యవర్గాలు, కాంగ్రెస్ అనుబంధ సంఘాలు, అధికార ప్రతినిధులు, ముఖ్య నాయకులతో వేర్వేరుగా చర్చించారు. జనవరి 26 నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్న ‘హాథ్‌సే హాథ్ జోడో’కార్యక్రమంపైనే ప్రధానంగా దిశా నిర్దేశం చేసిన ఠాక్రే.. పనిలో పనిగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ పరంగా చేపట్టాల్సిన చర్యల గురించి వివరించారు. ఎన్నికలు ఎంతో దూరంలో లేవనే విషయాన్ని నొక్కి చెపుతూ అంతర్గత విభేదాలను పక్కనబెట్టి సీనియర్లు, అనుభవజ్ఞులు అంతా ఒక్కతాటిపైకి వచ్చి పనిచేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
నియోజకవర్గాల్లో గెలుపు లక్ష్యంగా ఏం చేయాలనే దానిపై దృష్టి పెడితే.. చిన్న చిన్న సమస్యలు పరిగణనలోకి రావని స్పష్టం చేశారు. నిత్యం ప్రజల్లో ఉండడం ద్వారా, వారికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందనే భద్రతా భావాన్ని కల్పించాలని సూచించారు. అంతర్గత సమస్యలను తనకు వదిలేసి, ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలని నేతలందరికీ స్పష్టం చేశారు.
సమష్టిగా పనిచేస్తే అధికారం మనదే..
రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చి మరోసారి గెలుపు లక్ష్యంగా పావులు కదుపుతున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పట్ల రాష్ట్ర ప్రజల్లో అసంతృప్తి నెలకొని ఉందని ఠాక్రే చెప్పారు. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేననే అభిప్రాయం ప్రజల్లో ఇప్పటికీ బలంగా ఉందని అన్నారు. అయితే అంతర్గత కుమ్ములాటలు, పార్టీ ఫిరాయింపుల వల్ల కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వాసంలోకి తీసుకోలేని పరిస్థితి ఉందని వివరించారు.
అందువల్ల బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పిస్తూ, జనం సమస్యలపై పోరాడితే స్వల్ప వ్యవధిలోనే వారిని కాంగ్రెస్ వైపు మళ్లించవచ్చని సూచించినట్లు తెలిసింది. బీజేపీ, టీఆర్‌ఎస్, ఎంఐఎం ఒకే తాను ముక్కలనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి సంస్థాగతంగా బలం లేదని, గత ఎన్నికల్లో వంద చోట్ల డిపాజిట్లు కూడా రాలేదని నాయకులు ఠాక్రే దృష్టికి తీసుకురాగా.. సమష్టిగా పనిచేస్తే అధికారం మనదేనని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.
అంతర్గత కుమ్ములాటలపై సీరియస్!
పార్టీలో నాయకుల మధ్య నెలకొన్న అంతర్గత కుమ్ములాటలపై ఠాక్రే ఒకింత సీరియస్ అయినట్లు తెలిసింది. పార్టీకి ఉన్న అనుకూలతలను అంతర్గత విభేదాలతో దూరం చేస్తున్నారని ఆయా సమావేశాల్లో వ్యాఖ్యానించినట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్న సమావేశంలో.. పార్టీకి నాయకత్వం వహిస్తున్న సీనియర్లు, అనుభవజ్ఞులు ఒక్కతాటిపై నడిస్తే, జిల్లాలు, నియోజకవర్గాల్లో సమన్వయం ఉంటుందని చెప్పినట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి. కలిసికట్టుగా పనిచేయాలంటూ హెచ్చరికలతో కూడిన హితబోధ చేసినట్లు తెలిసింది.
చెత్తబుట్టలో షోకాజ్ నోటీసులు: కోమటిరెడ్డి
భేటీ అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘నాకిచ్చిన షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడ్డాయి. మా ఫోటోలను మార్ఫింగ్ చేసిన విషయాన్ని ఏఐసీసీనే పట్టించుకోవడం లేదు. నా ఫొటో మార్ఫింగ్ అయిందని స్వయాన సీపీ చెప్పారు. ఇక పీసీసీ కమిటీలను నేను పట్టించుకోను. నాలుగైదుసార్లు ఓడిపోయినవాళ్లతో నేను కూర్చోవాలా?’అని వ్యాఖ్యానించారు. తాను నియోజకవర్గంలో బిజీగా ఉండడం వల్లే బుధవారం ఠాక్రేను కలవలేదని చెప్పిన ఆయన.. సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డి ఎందుకు కలవలేదో వాళ్లనే అడగండి అని అన్నారు.
ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో బ్రేక్‌ఫాస్ట్ సమయంలో సమావేశమైన ఠాక్రే, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గంటకు పైగా వివిధ అంశాలపై చర్చించారు. మునుగోడు ఎన్నిక సమయంలో చోటు చేసుకున్న పరిణామాలతో పాటు రాష్ట్రంలో వైఎస్ షర్మిల, చంద్రబాబు రాజకీయ అడుగులు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. టీపీసీసీ నాయకులు షర్మిలపై విమర్శలు చేసినట్లుగా..చంద్రబాబుపై చేయడం లేదని కోమటిరెడ్డి వివరించినట్లు సమాచారం. ఇలావుండగా రెండురోజుల రాష్ట్ర పర్యటన ముగించిన ఠాక్రే గురువారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment