ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్నది ఎంతటి పెద్దవారైనా వదిలిపెట్టం
తప్పుచేసిన వారిని జైలుకు పంపుతాం
నీటిపారుదల, విద్యుత్‌శాఖల్లో అవినీతిపై నిగ్గు తేలుస్తాం
మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘ఇండియన్ టెలికం యాక్ట్‌పై కేంద్రానికి పూర్తి అధికారం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసును సుమోటోగా స్వీకరించొచ్చు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ కేసును ఎందుకు సుమోటోగా తీసుకోవడం లేదు? ఆ పార్టీ నేతలు అవగాహన రాహిత్యంతో ప్రత్యక్షంగా కాంగ్రెస్‌పై అడ్డగోలు ఆరోపణలు చేస్తూ..పరోక్షంగా బీఆర్‌ఎస్‌కు సహకరిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న వారు ఎంతటి పెద్దమనుషులైనా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ విషయంలో చట్టం తనపని తాను చేసుకుని పోతోంది’అని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు స్పష్టం చేశారు. తుక్కుగూడలో ఈ నెల 6న కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన జనజాతర మహాసభ ఏర్పాట్లను బుధవారం వారు పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
పూర్తి వివరాలు వారి మాటల్లోనే...బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించింది. మా ఫోన్లు కూడా ట్యాప్ చేసింది. వీటిని అడ్డం పెట్టుకొని అక్రమ వసూళ్లకు పాల్పడింది. ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్నవారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారిని అరెస్టు చేసి జైలుకు పంపడం ఖాయం. ప్రాజెక్టులు, విద్యుత్ కొనుగోళ్లు పేరుతో తిన్న కమీషన్లు కక్కిస్తాం. ధరణి ఫోర్టల్‌ను అడ్డుపెట్టుకొని వారు కొల్లగొట్టిన ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్, వక్ఫ్, సీలింగ్ భూములను వెనక్కి తీసుకుంటాం. ఆర్థిక దోపిడికి పాల్పడిన వారికి జైలుకు పంపిస్తాం. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో.. మీరు మా తాట తీయడం కాదు.. ప్రజలే మీ తాట తీస్తారు అని హెచ్చరించారు.
కర్రుకాల్చి వాత పెట్టినా సిగ్గురాలే
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది..కరువొచ్చిందని బీఆర్‌ఎస్ నేతలు పదేపదే ప్రచారం చేస్తున్నారు. కరువుకు కాంగ్రెస్‌కు సంబంధం ఏమిటీ? కాంగ్రెస్ డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చింది. నాటి నుంచి నేటి వరకు వర్షపు చినుకు కురవలేదు. వర్షాకాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఈ ఏడాది 56 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని సెపె్టంబర్ 5న త్రిసభ్య కమిటీ ప్రకటించింది.
ఉన్న నీటి నిల్వలను జాగ్రత్తగా వాడుకోవాలని కేఆర్‌ఎంబీ కమిటీ ముందే హెచ్చరించింది. అయినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. బీఆర్‌ఎస్ పాలనలో కరువొస్తే...కాంగ్రెస్‌కు అంటగట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రజలు తెలివైనవారు. ఎవరు ఏమిటో వారికి తెలుసు. ఇప్పటికే ఒకసారి కర్రుకాల్చి వాతపెట్టారు. అయినా సిగ్గురాలే. మళ్లీ వారికి వాతపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
జనజాతరకు భారీగా తరలిరావాలి
అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇదే తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించింది. ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుంది. ఇదే స్ఫూర్తితో ఇదే వేదికపై నుంచి ఈ నెల 6న కాంగ్రెస్ జాతీయ గ్యారంటీలను ప్రకటించనుంది. ఏఐసీసీ ముఖ్యనేతలు రాహుల్‌గాందీ, ప్రియాంకగాంధీ ముఖ్య అతిథులుగా హాజరుకానుండటంతో కాంగ్రెస్ పార్టీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఐదు లక్షల మందికి తగ్గకుండా సభకు తరలించాలని నిర్ణయించింది. సభలో మహిళలకు పెద్దపీట వేయబోతున్నాం. వారికి ప్రత్యేక క్యాబిన్లు ఏర్పాటు చేస్తున్నాం. సభను విజయవంతం చేసేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం’అని మంత్రులు వివరించారు. ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ సీనియర్ నేత దేప భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment