సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో సంక్షోభం మరింత ముదురుతోంది. వలస నేతల వల్ల అసలైన కాంగ్రెస్ నాయకులకు అవకాశం లేకుండా పోతోందంటూ పలువురు సీనియర్లు శనివారం ఆరోపణలు చేయగా.. అదే రోజున రేవంత్ అనుచరులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌కు లేఖ రాశారు. ఇది ఆదివారం బయటికి వచ్చింది.
రేవంత్‌రెడ్డి అనుచరులుగా పేరున్న పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు సీతక్క (ఎమ్మెల్యే), వేం నరేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు సీహెచ్ విజయరమణారావు, దొమ్మాటి సాంబయ్య, వజ్రేష్ యాదవ్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, పీసీసీ ప్రధాన కార్యదర్శులు సుభాష్‌రెడ్డి, చారగొండ వెంకటేశ్, పటేల్ రమేశ్‌రెడ్డి, సత్తుపల్లి మల్లేశ్, చిలుక మధుసూదన్‌రెడ్డి, శశికళ యాదవరెడ్డి రాజీనామా చేసినవారిలో ఉన్నారు. వారు మాణిక్యం ఠాగూర్‌కు రాసిన లేఖలో సీనియర్ల వ్యవహారశైలిని తప్పుపట్టారు.
లేఖలోని ప్రధానాంశాలు వారి మాటల్లోనే..
‘‘మాకు పదవులు రావడమే నేరం అన్నట్టుగా సీనియర్లు వ్యవహరించడం బాధ కలిగించింది. బీఆర్‌ఎస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్‌ను ఎప్పుడు గెలిపిద్దామా అని చూస్తున్నారు. మనలో మనం విమర్శలు చేసుకోవడంపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. జనంలో కాంగ్రెస్ పట్ల ఉన్న సానుకూలతను చిల్లర రాజకీయాలతో మనమే పాడుచేసుకుంటున్నామన్న అభిప్రాయం ఉంది. కేసీఆర్‌ను గద్దెదింపడానికి మేం రేవంత్ నేతృత్వంలో పనిచేస్తూనే ఉన్నాం.
రాజకీయ పునరేకీకరణలో భాగంగా తెలంగాణ ఇచ్చిన సోనియా నేతృత్వంలో పనిచేయడమే సరైన వేదిక అనుకున్నాం. రాహుల్‌గాంధీ ఆహ్వానంతో పార్టీలో చేరాం. సోనియా నేతృత్వంలో పనిచేయడం గౌరవంగా భావించాం. కాంగ్రెస్‌లో చేరిననాటి నుంచి పార్టీ సిద్ధాంతాలకు, నాయకత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ వస్తున్నాం. ఇదివరకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో, ప్రస్తుతం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలమన్న స్పృహతోనే వ్యవహరిస్తున్నాం.
వారి వ్యాఖ్యలు బాధించాయి
దేశ ప్రధాని అయ్యే అవకాశాన్ని తృణప్రాయంగా వదిలేసిన సోనియా, భారత్ జోడో యాత్రతో దేశం కోసం రాహుల్ పడుతున్న తపన మాకు స్ఫూర్తి. మా ఆరేళ్ల సేవలకు గుర్తింపుగా ఏఐసీసీ ఇటీవల మాకు పదవులు ఇచ్చింది. ఈ పదవులు మా బాధ్యతను పెంచాయని భావించాం. కానీ ఉత్తమ్ నేతృత్వంలో దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ, తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, మహేశ్వర్‌రెడ్డి, కోదండరెడ్డి తదితరులు భట్టి విక్రమార్క నివాసంలో సమావేశమై, తర్వాత మీడియాతో మాట్లాడుతూ పీసీసీ కమిటీల్లో సగానికిపైగా టీడీపీ నుంచి వచ్చిన వారితోనే నింపేశారని ఆరోపణ చేశారు.
ఇది మాకు బాధ కలిగించింది. ఈ పరిణామాలు కార్యకర్తల్లో గందరగోళానికి కారణం అవుతున్నాయి. మనమంతా కలిసికట్టుగా బీఆర్ఎస్పై పోరాటం చేయాలని వారు కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో పదవుల పేరుతో పంచాయితీలు పెట్టుకోవడం పార్టీకి నష్టం చేస్తుంది. సమయం లేదు. అందరం కలిసి బీఆర్ఎస్ను ఓడించాలి. సోనియా రుణం తీర్చుకోవాలి. లక్ష్యసాధనలో మాకు పదవులు లేకపోవచ్చు. కేసీఆర్‌తో పోరుకు మా పదవులే అడ్డంకి అయితే మాకు పదవులు వద్దు. ఈ పేరుతో పార్టీని పలుచన చేయొద్దు. రైతులకు మద్దతు ధర లేదు. రుణమాఫీ, పంటలబీమా అందట్లేదు.
కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యలేదు. డ్రగ్స్, గంజాయి మత్తులో యువత చిత్తవుతోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నియంతృత్వ, అరాచక పాలన సాగిస్తున్నది. స్వేచ్ఛ, సామాజిక న్యాయానికి భిన్నంగా పాలన సాగుతోంది. ప్రశ్నించే గొంతులను అణచివేస్తూ కేసీఆర్ రాజ్యమేలుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని సమైక్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది’’ అని నేతలు తమ లేఖ పేర్కొన్నారు.
చదవండి: కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?.. కమిటీల ఏర్పాటు దేనికి సంకేతం!
Comments
Please login to add a commentAdd a comment