బెంగుళూరు వేదికగా మంగళవారం రెండో రోజు విపక్షాల ఐక్యత భేటీ జరిగింది. 2024 ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ సమావేశానికి కాంగ్రెస్ సహా 26 ప్రతిపక్ష పార్టీలు, అగ్ర నేతలు హాజరయ్యారు. సీట్ల పంపకం, ఉమ్మడి కార్యాచరణ, తదితరాలపై కూటమి కీలక చర్చలు జరిపారు. ఈ క్రమంలో విపక్షాల భేటీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రధానమంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీకి ఆసక్తి లేదని ఖర్గే స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారం కోసం పాకులాడటం లేదని, దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకిక విలువలు, సామాజిక న్యాయాన్ని కాపాడేందుకే తామంతా కలిశామని ఖర్గే పేర్కొన్నారు.
చదవండి: విపక్షాల భేటీ.. మహాకూటమి పేరు ఇదే..!
‘కాంగ్రెస్‌కు అధికారం లేదా ప్రధాని పదవిపై ఆసక్తి లేదు. ఈ విషయాన్ని ఇప్పటికే చెన్నైలో స్టాలిన్ బర్త్‌డే సందర్భంగా చెప్పాను. ఆ వ్యాఖ్యలకు మేము కట్టుబడి ఉన్నాం. ప్రస్తుతం ఈ భేటీలో 26 ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. 11 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. బీజేపీ స్వయంగా 303 స్థానాల్లో గెలుపొందలేదు. అధికారంలోకి వచ్చేందుకు మిత్రపక్షాల ఓట్లను ఉపయోగించుకున్న కాషాయ పార్టీ.. ఆ తర్వాత వారిని విస్మరించింది’ అని ఖర్గే మండిపడ్డారు.
మరోపక్క విపక్షాల భేటీకి దీటుగా ఎన్డీయే మంగళవారం ఢిల్లీలో సమావేశం కానుంది. ఏకంగా 38 మిత్రపక్షాలతో కలిసి మెగా పోటీ భేటీ తలపెట్టింది. ఈ సమావేశంలో ఎల్జేపీ, హిందూస్తానీ అవామ్ మోర్చా వంటి కొత్త పార్టీలు పాల్గొంంటాయని ఇప్పటికే బీజేపీ వెల్లడించింది. అతి కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికల ముందు ఇక హస్తిన, బెంగళూరు వేదికలుగా జరగుతున్న అధికార, విపక్ష కూటముల పోటాపోటీ భేటీల మీదే ఇప్పుడిక అందరి కళ్లూ నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment