సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ అంటే బందిపోట్ల రాక్షసుల సమితి అని కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. ముఖ్యమంత్రిగా గత తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యాలను కేసీఆర్ నెరవేర్చలేదని అభియోగం మోపింది. కేసీఆర్‌ది మోసపూరిత సర్కార్ అని విమర్శించింది. ‘తల్లికి మట్టి గాజులు తేలేనోడు చిన్నమ్మకు బంగారు గాజులు తెస్తా’అన్నట్టు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వందల హామీలను తుంగలో తొక్కిన కేసీఆర్ బీఆర్‌ఎస్ పేరుతో దేశానికి ఏదో చేస్తానంటున్నారని దుయ్యబట్టింది.
ఈ మేరకు హాథ్ సే హాథ్ జోడో యాత్రలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై చార్జిషీట్‌ను సోమవారం విడుదల చేసింది. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విడుదల చేసిన ఈ చార్జిషీట్‌లో మొత్తం 13 అభియోగాలను బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ మోపింది. అమరుల ఆశయాలను, తెలంగాణ అభివృద్ధిని పట్టించుకోని కేసీఆర్ తెలంగాణ పదా న్ని తొలగించి ఇప్పుడు బీఆర్‌ఎస్ పేరుతో రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చి మరోమారు ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించింది. మేధా వుల మౌనం అసమర్థులకు రాజమార్గం కాకూడదంటూ తెలంగాణలోని మేధావివర్గం, నిరుద్యోగులు, రైతులు, ప్రజాస్వామికవాదులు కేసీఆర్ కుట్రలను ప్రజలకు తెలియజేసి తెలంగాణ భవిష్యత్తును రక్షించాలని ఆ చార్జిషీట్‌లో కాంగ్రెస్ కోరింది.
కాంగ్రెస్ చార్జిషీట్‌లో బీఆర్‌ఎస్‌పై మోపిన అభియోగాలివే..
►డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఎందరికిచ్చారో చెప్పాలి
►దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని, కాపలాకుక్కలా తానుంటానని చెప్పి అలా చేయకుండా దళితులను దగా చేసింది నిజం కాదా?
►తెలంగాణ ఇస్తే ఇంటికో ఉద్యోగమని చెప్పి మళ్లీ అసెంబ్లీలో అనలేదని మాట మార్చడం నిరుద్యోగులను మోసం చేయడం కాదా?
►తొమ్మిదేళ్లయినా కేజీ టూ పీజీ నిర్బంధ విద్యను ఎందుకు అమలు చేయలేదు?
►అధికారంలోకి వచ్చాక నియామకాలు ఎక్కడకు పోయాయి? నిరుద్యోగులకు ఇస్తానన్న రూ.3 వేల భృతి ఏమైంది?
►కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తా రద్దు చేస్తా అంటూ ఎందుకు రద్దు చేయడం లేదు?
►పోడు భూములకు పట్టాలు, దళితులు, గిరిజనులకు మూడెకరాల భూపంపిణీ ఏమైంది?
►రైతులకు ఉచిత ఎరువులు ఏవి?
►గొల్ల కుర్మలకు గొర్రెలేవీ?
►ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలేదీ?
►ఎస్సీ, ఎస్టీలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ ఏమైంది?
►నియోజకవర్గానికో మెడికల్ కాలేజీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, పాలిటెక్నిక్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలలు ఏమయ్యాయి?
►ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగునీరు ఎక్కడ పారింది?
Comments
Please login to add a commentAdd a comment