
సాక్షి, హైదరాబాద్ : వరుస ఎన్నికల్లో ఓటమి పాలవుతూ రోజురోజుకూ దిగజారిపోతున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ను కష్టాలు వదలడంలేదు. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరుతుండగా మరికొంతమంది సైతం అదే దారిని ఎంచుకునే పనిలో పడ్డారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనూహ్య విజయంతో దూసుకొచ్చిన కమళం పార్టీ నేతల కన్ను కాంగ్రెస్ పార్టీపై పడింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌కు ప్రత్నామ్నాయ శక్తిగా ఎదగాలని పావులు కదుపుతోంది. దీనిలో భాగంగానే పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలకు కాషాయ కండువా కప్పెపనిలో నిమగ్నమైంది. ఇప్పటికే డీకే అరుణా, విజయశాంతి లాంటి సీనియర్లు కాంగ్రెస్‌ను వీడి కాషాయతీర్థం పుచ్చుకోగా.. మరికొంత మంది కీలక నేతలు సైతం బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్‌కు చెందిన కాంగ్రెస్ కీలక నేతలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్వాయి హరీష్ రావు, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ పార్టీ మార్పుపై పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఫిబ్రవరి 14న వీరు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరాతారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల నుంచి మరి కొంతమంది టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. దీనిపై శనివారం నిర్వహించే మీడియా సమావేశంలో వారే స్వయంగా ప్రకటన చేస్తారని ఆదిలాబాద్ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా గత లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు ఆదిలాబాద్ నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసే వ్యూహంలో భాగంగా ఇతర పార్టీలకు చెందిన సీనియర్లపై బీజేపీ గాలం వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment