బీసీల చేయందుకునేలా! | Congress is trying to turn the majority caste towards itself | Sakshi
Sakshi News home page

బీసీల చేయందుకునేలా!

Published Sat, Apr 22 2023 4:11 AM | Last Updated on Sat, Apr 22 2023 2:57 PM

Congress is trying to turn the majority caste towards itself - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే లక్ష్యంగా శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర కాంగ్రెస్‌.. ఈసారి సామాజిక ఎజెండాతో ఎన్నికల కదన రంగంలోకి దిగాలని నిర్ణయించింది. ప్రధానంగా బలహీనవర్గాల (బీసీల)ను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలకు పదును పెడుతోంది. బీసీలను అకట్టుకునే పలు అంశాలతో పకడ్బందీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

ఓబీసీల జనగణన, రిజర్వేషన్ల పెంపు, బీసీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ ఎత్తివేత వంటి అంశాలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని.. ఆయా అంశాల్లో కాంగ్రెస్‌ తరఫున సానుకూలతను, భరోసాను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోంది. ఇదే సమయంలో రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బీసీ వర్గాలకు చేసిన అన్యాయాలను ఎత్తిచూపాలని నిర్ణయించింది. ఈ కార్యాచరణకు సంబంధించి ఈ నెల 25న రాష్ట్ర కాంగ్రెస్‌ బీసీ నేతలతో గాందీభవన్‌లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు. 

బడుగుల ఎజెండా.. కాంగ్రెస్‌ జెండా.. 
రాష్ట్ర కాంగ్రెస్‌ ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది. దీనికితోడు మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో.. బీసీలను కూడా తమవైపు మలుచుకునేందుకు వ్యూహాలను పన్నుతోంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఓబీసీలను అవమానించారన్న బీజేపీ ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టడంతోపాటు.. బీసీల అభ్యున్నతిపై రాహుల్‌ గాం«దీకి ఉన్న సానుకూల దృక్పథాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

‘‘దేశంలో బీసీ ప్రధానమంత్రి ఉన్నప్పటికీ ఆయా వరా>్గలకు రిజర్వేషన్లు పెరగలేదని.. ఓబీసీ జనగణన చేపట్టడం లేదన్న అంశాలను ప్రజలకు వివరిస్తాం. ఇదే సమయంలో ఓబీసీ గణనకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని రాహుల్‌గాంధీ చెప్పిన విషయాన్ని.. రిజర్వేషన్లపై సీలింగ్‌ ఎత్తివేస్తామని కర్ణాటక ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేసిన విషయాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళతాం..’’ అని కాంగ్రెస్‌ వర్గాలు చెప్తున్నాయి.

ఇక బీసీలకు క్రీమీలేయర్‌ ఎత్తివేత, ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ వంటి దీర్ఘకాలిక డిమాండ్ల విషయంలోనూ కాంగ్రెస్‌ సానుకూల దృక్పథాన్ని వివరిస్తామని అంటున్నాయి. పలు బీసీ కులాలకు లబ్ధి కలిగిస్తామంటూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు విఫలమయ్యాయని.. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ ఉంటుందని పేర్కొంటున్నాయి. ఈనెల 25న జరిగే సమావేశం అనంతరం ప్రత్యక్ష కార్యాచరణను, క్షేత్రస్థాయికి చేరే ప్రణాళికను ప్రకటిస్తామని కాంగ్రెస్‌ నేతలు చెప్తున్నారు. 

‘బీసీ’ సమావేశ ఎజెండా ఇదే! 
ఈ నెల 25న జరిగే కాంగ్రెస్‌ బీసీ నేతల ప్రత్యేక సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి, కార్యాచరణను సిద్ధం చేయనున్నట్టు సమాచారం. దీనికి హాజరు కావాలంటూ ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్‌ బీసీ నేతలకు సమాచారం ఇచ్చారు. 

దేశవ్యాప్తంగా బీసీల అభివృద్ధి కోసం  కాంగ్రెస్‌ చేసిన కృషి, ఓబీసీల జనగణనకు కట్టుబడి ఉంటామని రాహుల్‌గాంధీ  చేసిన ప్రకటన, రిజర్వేషన్ల సీలింగ్‌ ఎత్తివేసి బీసీలకు లబ్ధి చేకూరుస్తామన్న అంశాలతోపాటు.. పార్టీ పదవుల్లో బీసీలకు ప్రత్యేక కోటా, ఈసారి ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత తదితర అంశాలపై చర్చించనున్నట్టు తెలిసింది. 

♦  గత ఎన్నికల్లో బీసీలకు ఎన్ని సీట్లు కేటాయించారు? ఈసారి ఎన్ని సీట్లు అడగాలి? పార్టీ పదవుల్లో ఉదయ్‌పూర్‌ తీర్మానం మేరకు తగిన కోటా ఎలా ఇవ్వాలి? అనే అంశాలపై స్పష్టతకు రానున్నట్టు సమాచారం.  

 ♦2004 ఎన్నికలకు ముందు మాజీ ఎంపీ వి.హనుమంతరావు నేతృత్వంలో వరంగల్‌లో జరిగిన బీసీ గర్జన తరహాలో.. రాష్ట్రంలోని బీసీ వర్గాలను సమీకరించి మరో భారీ సభను నిర్వహించే అంశంపై 25న సమావేశంలో చర్చించనున్నట్టు తెలిసింది. 

♦ బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని  ఏఐసీసీ పెద్దల దృష్టికి తీసుకెళతామని.. ఎన్నికల నాటికి బీసీ ఓటర్లు తమవైపు మొగ్గుచూపేలా కార్యాచరణ రూపొందిస్తామని కాంగ్రెస్‌ బీసీ నేతలు చెప్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement