సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి కాంగ్రెస్‌ను వీడాలని నిర్ణయించుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితోపాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేయనున్నారు. దీనిపై శనివారం అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు. ఈ మేరకు సంగారెడ్డి నియోజకవర్గ ముఖ్య నాయకులు, తన అనుచరులకు జగ్గారెడ్డి సమాచారం ఇచ్చారని.. అయితే ఇప్పటికిప్పుడు వేరే పార్టీలో చేరే ఆలోచనలో లేరని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడనున్న అంశాన్ని జగ్గారెడ్డి కూడా ధ్రువీకరించారు. శనివారం వివరాలను వెల్లడిస్తామన్నారు.
రేవంత్‌రెడ్డితో పొసగకనే..!
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పొసగకపోవడం తోపాటు.. ముక్కుసూటిగా మాట్లాడే తనను కోవర్టుగా చిత్రీకరించారనే మనస్తాపంతోనే జగ్గారెడ్డి రాజీనామా నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకాన్ని వ్యతిరేకించిన జగ్గారెడ్డి.. అధిష్టానం తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించడంతో సర్దుకుపోవాలని భావించారు. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నిక సహా పలు అంశాలపై రేవంత్ వైఖరిని బహిరంగంగానే తప్పుపట్టారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో తనకు సమాచారం ఇవ్వకుండా రేవంత్ పర్యటించడంపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. రేవంత్‌ను తప్పించాలంటూ పార్టీ అధిష్టానానికి లేఖలు రాశారు. ఈ విషయం మీడియాలో రావ డంతో పార్టీ అధిష్టానం జగ్గారెడ్డిని మందలించింది. దీనికితోడు రాష్ట్ర నేతలు కూడా జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో.. తాను రేవంత్ గురించి మాట్లాడబోనని జగ్గారెడ్డి ప్రకటించారు. అయితే.. రేవంత్‌ను వ్యతిరేకిస్తుండటం, పలు అంశాల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్ణయాలకు అనుకూలంగా మాట్లాడటం తో.. సోషల్ మీడియాలో జగ్గారెడ్డిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆయన టీఆర్‌ఎస్ కోవర్టు అన్నట్టుగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని జగ్గారెడ్డి ఖండించారు. ఇలా చాలా అంశాల్లో రేవంత్ వర్గంతో ఆయనకు విభేదాలు కొనసాగుతూ వచ్చాయి.
భార్య చెప్పిన విషయంతో..
రేవంత్‌రెడ్డితో మనస్పర్థలు, ఇతర విభేదాలు ముందునుంచే ఉన్నా.. గురువారం సాయంత్రం జగ్గారెడ్డికి ఆయన సతీమణి నిర్మలారెడ్డి చేసిన ఫోన్‌కాల్ తాజా నిర్ణయానికి కారణమైనట్టు వారి సన్నిహితులు చెప్తున్నారు. గురువారం నిర్మలారెడ్డి దగ్గరి బంధువు వివాహం జరిగింది. సాయంత్రం 4 గంటల సమయంలో హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. తర్వాత సంగారెడ్డికి వెళ్లి.. స్థానికంగా పలు కార్యక్రమాల్లో పాల్గొ న్నారు.
నిర్మలారెడ్డి బంధువు వివాహానికి మాత్రం వెళ్లలేకపోయారు. ఆ సమయంలో జగ్గారెడ్డికి నిర్మలారెడ్డి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఆమె చెప్పిన విషయమే.. కాంగ్రెస్‌కు జగ్గారెడ్డి రాజీనామా నిర్ణయానికి కారణమైందని సన్నిహితులు చెప్తున్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ చేపట్టిన నిరసనలను జగ్గారెడ్డి తప్పుపట్టిన నేపథ్యంలో.. నియోజకవర్గంలోని ఇద్దరు కీలక అనుచరులు నిర్మలారెడ్డికి ఫోన్‌చేసి మాట్లాడారని, జగ్గారెడ్డి తీరు సరికాదన్నట్టుగా మాట్లాడారని అంటున్నారు.
‘‘మేడమ్.. మన సార్ మాట్లాడుతున్నది వాస్తవమే. అయినా కొన్ని విషయాలు ప్రచారంలోకి వస్తున్నాయి. జగ్గారెడ్డి టీఆర్‌ఎస్ కోవర్టు అనే ప్రచారం ఎక్కువ అవుతోంది. ఇది మంచిది కాదు. పార్టీ కోసం మాట్లాడి నిందల పాలవుతున్నారు. కష్టకాలంలోనూ జగ్గారెడ్డి పార్టీ కోసం ఉన్నారు. ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆయన్ను పార్టీ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలని చెప్పండి’’ అని అనుచరులు పేర్కొ న్నట్టు చెప్తున్నారు. నిర్మలారెడ్డి ఈ విషయాన్ని జగ్గారెడ్డికి వివరించారని ఆయన సన్నిహితులు అంటున్నారు. తన నియోజకవర్గంలోనే ఇలాంటి అభిప్రాయం ఉన్నందున.. తాను కాంగ్రెస్‌లో కొనసాగి పార్టీకి నష్టం చేయడం మంచిది కాదని జగ్గారెడ్డి అభిప్రాయానికి వచ్చారని చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment