
న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ప్రారంభమైంది. పార్టీ నాయకత్వానికి సంబంధించి విభేదాలు బయటపడిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ అగ్ర నాయకత్వంలో సమూల మార్పు కావాలని కోరుతున్న వర్గం ఒకవైపు, రాహుల్ గాంధీ మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుతున్న మరో వర్గం తెరపైకి వచ్చాయి.పార్టీ నాయకత్వంలో మార్పు ప్రస్తుతం అత్యవసరమని, క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో చురుగ్గా పనిచేసే శాశ్వత నాయకత్వం, ఏఐసీసీ, పీసీసీ కార్యాలయాల్లో అనునిత్యం అందుబాటులో ఉండే నాయకత్వం ఇప్పుడు పార్టీకి కావాలని పేర్కొంటూ సుమారు 23 మంది సీనియర్ నేతలు ఇటీవల సోనియా గాంధీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
అయితే, తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సోనియా సీడబ్ల్యూసీ భేటీలో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. పూర్తి స్థాయి అధ్యక్షురాలిగా సోనియా కొనసాగడమా? లేదా నూతన వ్యక్తి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడమా సీడబ్ల్యూసీ నిర్ణయించనుంది. సీడబ్ల్యూసీ సభ్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇదిలాఉండగా.. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద కొందరు కార్యకర్తలు సోమవారం ఉదయం నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానంలో గాంధీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే ఉండాలని డిమాండ్ చేశారు. వేరే వ్యక్తుల చేతుల్లోకి పగ్గాలు వెళ్తే కాంగ్రెస్ భ్రష్టు పట్టిపోతుందని హెచ్చరించారు.
(చదవండి: కాంగ్రెస్ పార్టీలో విభేదాలు!)
Comments
Please login to add a commentAdd a comment