సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సంచలన వ్యాఖ్యలకు మారుపేరుగా మారిన ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం) అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ మరోసారి రాజకీయ దుమారానికి తెరలేపారు. ఒకవైపు ఎన్డీఏ సారథి అయిన భారతీయ జనతా పార్టీపై పరోక్షం గా విమర్శలు చేసిన మాంఝీ, మరోవైపు రాష్ట్రీయ జనతాదళ్ అగ్రనేత తేజస్వీ యాదవ్ బిహార్ భవిష్యత్తు అని అభివర్ణించారు. ఆదివారం మాంఝీ చేసిన రెండు ట్వీట్లు రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు అద్దం పడుతున్నాయి. ఇటీవల హిందుస్థానీ అవామ్ మోర్చా కార్యవర్గ సమావేశాల సమావేశం తర్వాత తమకు ఒక ఎమ్మెల్సీ పదవి, మరో మంత్రి పదవి కావాలని మీడియా సాక్షిగా డిమాండ్ చేసిన మాంఝీ, ఆదివారం వరుసగా రెండు ట్వీట్లు చేశారు. రాజకీయాల్లో సంకీర్ణ ధర్మాన్ని పాటించడం ఎలానో ఎవరైనా నితీశ్ కుమార్ నుంచి నేర్చుకోవచ్చని అందులో పేర్కొన్నారు. కూటమిలోని పార్టీల అంతర్గత వ్యతిరేకత, ఒకరిపై ఒకరు కుట్రలు చేసుకుంటున్నప్పటికీ వారికి సహకారం అందించడం నితీశ్ కుమార్ గొప్పతనం అని ఏ రాజకీయ పార్టీ పేరు ప్రస్తావించకుండా మాంఝీ వ్యాఖ్యానించారు. (కీలక నిర్ణయం: బీజేపీ బాటలో మమత)
మాంఝీ చేసిన ఈ ట్వీట్ ఎన్డీఏ అంతర్గత విషయమని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. తను ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ నితీశ్ కుమార్‌తో మాత్రమే సాన్నిహిత్యంగా ఉన్నానని మాంఝీ గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే కూటమిలో తను నితీశ్‌కు దగ్గరగా ఉన్నానని, అదే సమయంలో బీజేపీకి దూరంగా ఉన్నానని చెప్పే ప్రయత్నం తన వ్యాఖ్యల ద్వారా చేస్తున్నారు. మరో ట్వీట్‌లో బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌కు సలహాలు, సూచనలు చేశారు. తేజస్వీ బిహార్ రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉందని చెప్పిన ఆయన, ప్రతిదీ సరైన సమయంలో జరుగుతుందని సూచించారు. మూఢం కారణంగా ఆర్జేడీ తమ పార్టీ కార్యక్రమాలు ప్రారంభించకుండా ఆగినప్పుడు, రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ విషయంలో ఎందుకు తొందరపడుతున్నారని తేజస్వీకి చురకలంటించారు.
మా ప్రభుత్వం పూర్తి కాలం ఉంటుంది
జేడీయూ రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికల ఫలితాన్ని అందరూ మరచిపోయి పనిచేయడం ప్రారంభించాలని, ఐదేళ్లపాటు ప్రభుత్వం సాఫీగా కొనసాగుతుందని అన్నారు. బీజేపీ ఆదేశాల మేరకు తాను ముఖ్యమంత్రి అయ్యానని పునరుద్ఘాటించారు.
Comments
Please login to add a commentAdd a comment