ధర్మవరంలో కార్పొరేట్‌ పాలిటిక్స్‌ | Corporate Politics in Dharmavaram | Sakshi
Sakshi News home page

ధర్మవరంలో కార్పొరేట్‌ పాలిటిక్స్‌

Published Tue, Apr 30 2024 9:37 AM | Last Updated on Tue, Apr 30 2024 11:33 AM

Corporate Politics in Dharmavaram

ధర్మవరం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా కార్పొరేట్‌ రాజకీయం రంగ ప్రవేశం చేసింది. ఢిల్లీ నుంచి వచ్చానన్న బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌ ఇక్కడ గల్లీలో ప్రలోభాలు, బెదిరింపులతో నీచరాజకీయాలు చేస్తున్నారు. రూ.కోట్లు కుమ్మరించి అధికార పార్టీ నాయకులను కొనుగోలు చేసేందుకు ప్రయతి్నస్తున్నారు. తనకు మద్దతు ఇవ్వని వ్యాపారులపై సీబీఐ, ఐటీ, ఈడీలతో దాడులు చేయిస్తానంటూ తన వర్గీయుల ద్వారా బెదిరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.  

ధర్మవరం: ప్రొద్దుటూరుకు చెందిన సత్యకుమార్‌ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగప్రవేశం చేయగానే ధర్మవరంలో కొత్త సంస్కృతి మొదలైంది. ఆయనకు మద్దతుగా ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి రెండు వేల మందికిపైగా ధర్మవరంలో దిగారు. పట్టణంలోని అద్దె ఇళ్లు, లాడ్జీలలో తిష్ట వేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులను ప్రలోభాలకు గురిచేయడమే పనిగా పెట్టుకున్నారు. డబ్బు ఇస్తామని, నామినేటెడ్‌ పదవులు, సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని.. ఇలా పలు రకాలుగా ప్రలోభపెడుతున్నారు. గ్రామస్థాయి నాయకుడికైతే రూ.10 లక్షలు, ఓ మోస్తరు నాయకుడికైతే అంతకన్నా ఎక్కువ ఇస్తామని చెబుతున్నారు. 

ఇటీవల వైఎస్సార్‌సీపీ నాయకుడు గిర్రాజు నగేశ్, ఏపీ కురుబ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోటి బాబు, ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్‌లను పెద్దఎత్తున ప్రలోభపెట్టి సత్యకుమార్‌ సమక్షంలో బీజేపీలో చేర్చుకున్నట్లు సమాచారం. వీరివెంట భారీగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వస్తారని భావించినప్పటికీ వారి అంచనాలు తలకిందులయ్యాయి. వంద మందితో పారీ్టలో చేరుతానని చెప్పిన గిర్రాజు నగేశ్‌ కనీసం పది మందికి కూడా కండువా కప్పించలేకపోయాడు. కోటిబాబు వెంట కూడా ఎవరూ వెళ్లలేదు. కోటిబాబు బీజేపీలోకి చేరిన మరుసటి రోజే ఆయన సోదరులు మళ్లీ వైఎస్సార్‌సీపీలో చేరడం విశేషం.

 అదేవిధంగా తమ ప్రలోభాలకు లొంగని వారిని సీబీఐ, ఈడీ, ఐటీ దాడుల పేరిట సత్యకుమార్‌ మనుషులు బెదిరిస్తున్నట్లు తెలిసింది. పట్టు–చేనేత వస్త్ర వ్యాపారానికి కేంద్రమైన ధర్మవరంలో వ్యాపారులకు ఈ తరహా బెదిరింపులు ఎక్కువైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాగా, సత్యకుమార్‌ ప్రచారానికి కూడా ఇతర ప్రాంతాల నుంచి డబ్బులు ఇచ్చి జనాన్ని తరలిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల ఆయన నామినేషన్‌ కార్యక్రమానికి కూడా ప్రొద్దుటూరు, కర్నూలు, రాప్తాడు తదితర ప్రాంతాల నుంచి డబ్బులు ఇచ్చి వాహనాల్లో జనాలను తీసుకురాగా, వారు మధ్యలోనే వెళ్లిపోయారు. 

బీజేపీపై చేనేతల ఆగ్రహం.. 
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత వ్రస్తాలపై 5 శాతం జీఎస్టీ విధించడంతో నేతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. జీఎస్టీ రద్దు చేయాలని నేతన్నలు నిరసన తెలిపినా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా గత కేంద్ర బడ్జెట్‌లో జీఎస్టీ 5 నుంచి 12 శాతానికి పెంచాలని భావించింది. అప్పట్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌లు కేంద్ర ఆర్థికమంత్రిని కలిసి చేనేత వస్త్రాలపై జీఎస్టీని పెంచడం వల్ల కలిగే నష్టాలను వివరించడంతో 5 శాతానికే పరిమితం చేశారు. ఈ క్రమంలో బీజేపీపై నేతన్నలు, వ్యాపారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement