ఒక ఎంపీ సీటివ్వండి | cpi leaders meeting cm revanth reddy : telangana | Sakshi
Sakshi News home page

ఒక ఎంపీ సీటివ్వండి

Published Wed, Jan 3 2024 2:27 AM | Last Updated on Wed, Jan 3 2024 2:27 AM

cpi leaders meeting cm revanth reddy : telangana - Sakshi

సీఎం రేవంత్‌రెడ్డితో కూనంనేని, చాడ వెంకటరెడ్డి, నారాయణ, అజీజ్‌పాషా

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమకు ఒక స్థానం కేటాయించాలని సీపీఐ బృందం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సీఎంతో సీపీఐ ప్రతినిధి బృందం మంగళవారం మర్యాదపూర్వకంగా సమావేశమైంది. సచివాలయంలో సుమారు గంట పాటు జరిగిన భేటీలో వర్తమాన అంశాలపై చర్చ జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్‌ కె.నారాయణ, సయ్యద్‌ అజీజ్‌ పాషా, కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌ రెడ్డి, పశ్యపద్మ తదితరులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ అవగాహన సత్ఫలితాలను ఇచ్చిందని ఈ సందర్భంగా సీపీఐ నేతలు పేర్కొన్నారు. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, సీపీఐలు తెలంగాణలో అవగాహనతో పోటీ చేసేందుకు పరస్పరం సహకరించుకోవాలన్నారు. కాగా, ఖమ్మం లేదా నల్లగొండ స్థానాల్లో ఏదో ఒకటి ఇవ్వాలని రేవంత్‌ను కోరినట్లు సమాచారం.

అయితే అధిష్టానం నిర్ణయం మేరకు తమ నిర్ణయం ఉంటుందని సీఎం అన్నట్లు తెలిసింది. కాగా, గత ఎన్నికల సందర్భంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం రెండు ఎమ్మెల్సీ స్థానాలు తమకు కేటాయించాలని కూడా సీపీఐ నేతలు సీఎంకు గుర్తుచేశారని సమాచారం. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం అన్నట్లు తెలిసింది.

న్యాయవిచారణ పరిధిలో సింగరేణిని చేర్చాలి
ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడడంతో పాటు, పటిష్టపరచాలని సీఎంకు సీపీఐ ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. సింగరేణి కాలరీస్‌లో జరిగిన  అవినీతి, అక్రమాలను న్యాయవిచారణ పరిధిలోకి తీసుకురావాలని కూనంనేని సాంబశివరావు కోరారు. అలాగే సమ్మె నోటీసు ఇచ్చిన జెన్‌ కో కార్మికులు, ఇతర ఉద్యోగులపై గత ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని, సుమారు 400 మంది ఫోర్‌ మెన్‌ ఆర్టిజన్లను వివిధ కారణాలతో పనిచేసిన చోటు నుంచి బైటకు పంపడమో, తొలగించడమో జరిగిందని, ఎస్‌ఈలను డీఈలు, డీఈ, ఏడీఈలుగా డిమోట్‌ చేయడం వంటి చర్యలకు పాల్పడిందని, వీటిని సరిచేయాలని సీఎంను కోరారు. 

సాయంత్రం 4 నుంచి 5 వరకు అందుబాటులో ఉంటా: సీఎం
కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందు బాటులో ఉన్నట్లుగా ప్రజలలో భావన నెలకొందని, సీఎం, మంత్రులు కూడా అందుబా టులో ఉంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్న దని సీపీఐ నేతలు తెలిపారు. వివిధ ప్రజా సమస్యలపై  ఎమ్మెల్యేలు, ప్రజా సంఘాలు, పార్టీల నేతల ను కలిసేందుకు  సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు తాను అందుబాటులో ఉంటానని సీఎం చెప్పినట్లు సీపీఐ నేతలు వెల్లడించారు.

ఈ సచివాలయం మీ కోసమే కేసీఆర్‌ కట్టించారు: నారాయణ
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త సచివాల యాన్ని రేవంత్‌రెడ్డి కోసమే కట్టించారని నారా యణ సరదాగా వ్యాఖ్యానించారు. గత ప్రభు త్వం వివిధ సంస్థలు, శాఖల్లో రిటైర్డ్‌ అధికా రులను నియమించి ఏళ్ళ తరబడి కొనసాగించిందని, కొత్త ప్రభుత్వంలో ఆ సంప్రదాయా నికి స్వస్తి పలకాలని నారాయ ణ సూచించారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌లను ప్రభుత్వంలోకి తీసుకో వద్దని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement