
(ఏ. అమరయ్య, సాక్షి, అమరావతి): రాజకీయ బలాల రీత్యా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇప్పటికీ ప్రధాన రాజకీయ శక్తిగానే ఉందని, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో సానుకూలత ఉందని సీపీఎం అభిప్రాయపడినట్లు ఆ పార్టీ రాష్ట్ర నూతన కార్యదర్శి వి. శ్రీనివాసరావు తెలిపారు. గ్రామీణ పేదలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీల్లో వైఎస్సార్‌సీపీకి ఆదరణ తగ్గలేదని, మిగతా వర్గాల్లో అక్కడక్కడా అసంతృప్తి వ్యక్తమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ రాష్ట్ర నూతన కార్యదర్శిగా ఎన్నికైన ఆయన శుక్రవారం ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాల్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యల మొదలు ప్రస్తుత రాజకీయ పరిస్థితి వరకు పలు అంశాలను ప్రస్తావించారు. అందులోని ముఖ్యాంశాలు..
బీజేపీపై మెతక వైఖరిని విడనాడాలి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలు ఫెడరలిజానికి విఘాతం కలిగించేలా ఉన్నాయి. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేసిందన్న విషయాన్ని గుర్తించాలి. ప్రత్యేక హోదా సహా రాష్ట్ర విభజన చట్టంలోని ఏ అంశాన్నీ అమలు చేయలేదు. ఇవికాక విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించి తీరుతామని చెబుతోంది. ఇలాంటి సమస్యలపై వైఎస్సార్‌సీపీ గొంతెత్తాలి. చాపకింద నీరులా చొచ్చుకుపోయేందుకు ప్రయత్నిస్తున్న ఆరెస్సెస్‌కు ముకుతాడు వేయాలి. ఇటువంటి దశలో వైఎస్సార్‌సీపీ మౌనంగా ఉండడం రాష్ట్రానికి క్షేమకరం కాదు. వైఎస్సార్‌సీపీ తమ భావసారూప్య పార్టీ కానప్పటికీ కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా కలిసివస్తే ఆయా సందర్భాలను బట్టి సహకరిస్తాం.
పూర్వ వైభవానికి టీడీపీ పాకులాట
ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న టీడీపీ తీవ్ర నిరుత్సాహంలో ఉంది. పూర్వవైభవం కోసం పాకులాడుతోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడాలని టీడీపీ మహానాడు ఇచ్చిన పిలుపు అంతిమంగా బీజేపీకే తోడ్పడుతుందని మా పార్టీ భావిస్తోంది.
కొత్త కార్యదర్శిగా మా ప్రాధామ్యాలు..
► పార్టీని పటిష్టం చేయడం, ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు చేయడం.
► వామపక్ష ప్రజాతంత్ర పార్టీలను, శక్తులను కలుపుకుని ప్రజా సమస్యలపై ఉద్యమించడం.
► కార్మిక, కర్షక, కౌలురైతు, వ్యవసాయ కూలీలు సహా వివిధ వర్గాలు, తరగతుల హక్కుల కోసం ఆందోళనలు నిర్వహించడం.
► గ్రామాల్లో భూస్వాములు, ధనిక రైతులు, కాంట్రాక్టర్లు వ్యాపార కూటమిగా ఏర్పడ్డ నేపథ్యంలో మా పార్టీ శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉండి వారి దుశ్చర్యలను ఎదిరించడం.
► సంస్థాగత నిర్మాణ లోపాలను పార్టీ మహాసభల్లో చర్చించాం. ఇప్పటికే దిద్దుబాటు ప్రారంభమైంది. పార్టీ నిర్మాణాన్ని మరింత సమర్ధంగా చేపట్టబోతున్నాం.
► స్వతంత్ర రాజకీయ పునాదిపై పార్టీని నిర్మించుకుంటాం.
దళితులపై దాడుల్ని సహించం
రాష్ట్రంలో కులవివక్ష నేటికీ కొనసాగుతోంది. కులవివక్ష దాడులు, చివరకు హత్యలు కూడా జరుగుతున్నాయి. ఆధిపత్య, అగ్రకుల దురహంకారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని రకాల విజిలెన్స్ మానిటరింగ్ కమిటీల్లో పార్టీలు, సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. దళితులపై దాడులు ఎక్కడ జరిగినా ఉద్యమించి తీరుతాం. రాష్ట్రంలో 36% నిరక్షరాస్యత ఉంటే అందులో 47% మంది దళితులు. ఈ పరిస్థితిని మార్చేందుకు మా పార్టీ, ప్రజా సంఘాలు చొరవచూపుతాయి. ప్రతి దళితవాడకు 2 ఎకరాల స్థలం మంజూరు చేసి అభివృద్ధి చేయాలి. ఇక ఎన్నికల గురించి పార్టీ మహాసభల్లో చర్చించలేదు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చర్చిస్తాం.
ఉద్యోగ సంఘాలతో సీఎం చర్చలు జరపాలి
ఇక రాష్ట్ర ప్రభుత్వద్యోగులకు 11వ పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తక్షణమే తెరదించాలని వి. శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి శుక్రవారం ఆయన లేఖ రాశారు. సీఎం నేరుగా రంగంలోకి దిగి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని కోరారు. పెరిగిన ధరలు, ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులకు తగిన విధంగా ఉద్యోగులు వేతన పెంపు కోరుకుంటున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ప్రభుత్వ పథకాలను, నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలుచేయాల్సింది ఉద్యోగులేనని, అందువల్ల ఆ సంఘాల నేతలతో ముఖ్యమంత్రే స్వయంగా చర్చలు జరిపి పరిష్కరించాలని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.