
తుని: అధికారంలో ఉన్న సమయంలో ఎంతో మంది నాయకులు, మహిళలను హింసించారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు తాము ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. శుక్రవారం కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో అదృçష్టంగా వచ్చిన పదవిని ప్రజల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకున్న నీచ చరిత్ర యనమలదని చెప్పారు. ఆయన, ఆయన తమ్ముడు ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవారని అన్నారు.
ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో డిస్కంలకు రూ.80 వేల కోట్లు బకాయిలు పెట్టిన ఘన చరిత్ర యనమలదని చెప్పారు. తుని నియోజకవర్గంలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని యనమలకు సవాల్ విసిరారు. యనమల సొంత గ్రామంలో పాఠశాల, రోడ్లు నిర్మించలేక పోయారని, ఆ అవకాశం తనకు దక్కిందని చెప్పారు. యనమల గ్రాఫ్ పడిపోతోందని, వచ్చే ఎన్నికల్లోనూ తాను 30 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తానని రాజా అన్నారు.
టీడీపీ హయాంలో వైఎస్సార్‌సీపీకి చెందిన 2,800 మంది పింఛన్లు తొలగించగా, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న తాను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించానన్నారు. ఇప్పుడు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని మంత్రి రాజా చెప్పారు. తుని నియోజకవర్గంలో 109 నీటి రిజర్వాయర్లు కట్టిస్తున్నామని, త్వరలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు ఇస్తామని అన్నారు. యనమల ఏరియా ఆసుపత్రిని ఆదాయ వనరుగా మార్చుకుని, రోజుకు లక్ష రూపాయలు దండుకున్నారని ఆయన వివరించారు.