ఎక్కడైనా ఒక పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై వచ్చిన వారిని ఆ పార్టీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకుంటారు. కానీ ఇప్పటికే పార్టీలో ఉన్న వారు మరోసారి కొత్తగా చేరినట్లు కలరింగ్ ఇవ్వడం, పక్క పార్టీకి చెందిన యువకులను మాయమాటలు చెప్పి పార్టీ కార్యాలయానికి పిలిపించి మెడలో పచ్చకండువా వేసి పార్టీలో చేరినట్లు ప్రకటిస్తున్నారు టీడీపీ జిల్లా నేతలు. నానాటికీ దిగజారిపోతున్న పార్టీ ఇంకా ఉనికిలోనే ఉందని జనాలకు చెప్పుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రభుత్వ సంక్షేమ పథకాలతో జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ నానాటికీ పెరుగుతోంది. ప్రతిపక్ష టీడీపీకి ప్రజల్లో నూకలు చెల్లిపోతున్నాయి. పార్టీ కేడర్ క్రమంగా దూరమవుతోంది. దీంతో అధినాయకత్వం మొదలు జిల్లా స్థాయి నాయకుల వరకు ఏమీ పాలుపోవడం లేదు. ఎలాగైనా పార్టీలో కొంత ఉత్సాహాన్ని నింపేందుకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దొడ్డిదారి మార్గాన్ని అన్వేషించాడు. వైఎస్సార్‌సీపీ నుంచి ఎవరిని బయటకు గెంటేస్తారా...వాళ్లను దగ్గరకు తీద్దామని ఎదురుచూస్తూ ఉన్నారు. దీనికి తోడు పార్టీలో ఉండేవాళ్లకే టీడీపీ కండువాలు వేసి వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలో చేరుతున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు.
వైఎస్సార్‌సీపీలో నుంచి కాకర్ల ఈశ్వర్ అనే కార్యకర్తను ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డి కొంతకాలంగా పార్టీకి దూరంగా పెట్టాడు. దీనిని గమనించిన దామచర్ల.. కాకర్ల ఈశ్వర్‌కు వలవేశాడు. ఎలాగూ బాలినేని కుటుంబం తనను దూరంగా పెట్టింది. కాబట్టి ఇక్కడ మంచి ప్యాకేజీ మాట్లాకుంటే పోలా అని ఈశ్వర్ తలచాడు. దీంతో ఈశ్వర్ వైఎస్సార్‌సీపీలోని కొందరు అనుచరులకు ‘‘బాలినేని ప్రణీత్ అన్న వస్తున్నాడు వెళదాము రండి’’ అంటూ ఆదివారం కబురు పంపాడు. యువకులు కొందరు ద్విచక్ర వాహనాలు వేసుకొని వచ్చారు. వాళ్లందరి వాహనాలకు పెట్రోలు కొట్టించాడు. వీరితో పాటు టీడీపీ కార్యాలయం కూడా పార్టీలోని మరికొందరు యువకులను వాళ్లకు తోడు చేసింది.
అయితే ఈశ్వర్ చెప్పింది ఒకటి..చేసింది మరొకటి. బాలినేని నివాసానికి అని చెప్పి పాత గుంటూరురోడ్డులోని టీడీపీ ఆఫీసుకు వాళ్లను తీసుకెళ్లాడు. దీంతో కొందరు ఆ విషయం పసిగట్టి వెనక్కు వెళ్లిపోయారు. కొందరు సన్నిహితంగా ఉండేవాళ్లు టీడీపీ కార్యాలయంలో ఇరుక్కుపోయారు. వాళ్లకు దామచర్ల చేత బలవంతంగా టీడీపీ కండువాలు వేయించాడు. సందట్లో సడేమియా అంటూ టీడీపీలో ఉన్న వాళ్లకు కూడా కొంతమందికి పార్టీ కండువాలు వేసి వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చినట్లు కలరింగ్ ఇచ్చారు. తీరా తేరుకున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పొరపాటు జరిగిపోయిందని సోమవారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయానికి వెళ్లారు. టీడీపీ కార్యాలయంలో ఈశ్వర్ చేసిన దుశ్చర్య గురించి చెప్పారు. టీడీపీలోకి వెళ్లటం తమకు ఇష్టం లేదంటూ మళ్లీ మేయర్ గంగాడ సుజాతతో పాటు మరికొంతమంది వైఎస్సార్‌సీపీ నాయకుల వద్ద పార్టీ కండువాలు వేయించుకున్నారు.
పార్టీ కండువాలు వేయించుకున్న వారిలో బాపట్ల సాయి, కొప్పెర్ల విజయ్, శేఖర్, షాహిద్‌తో పాటు పలువురు ఉన్నారు. ఇదే తరహాలో నాలుగు రోజుల క్రితం మూడో డివిజన్‌లో కూడా మరో తంతు జరిగింది. మెప్మాలో గతంలో ఆర్‌పీగా పనిచేసిన టీడీపీ చెందిన ముంతాజ్.. గ్రూపు మీటింగ్ ఉందని చెప్పి కొంతమంది మహిళలను డివిజన్‌లోకి పిలిపించింది. వాళ్లలో పది మంది వరకు టీడీపీ వాళ్లే ఉన్నారు. వైఎస్సార్ సీపీ నుంచి ఏ ఒక్కరూ అక్కడకు వెళ్లలేదు. డివిజన్‌లో కార్యక్రమం ఏర్పాటు చేసి దామచర్లను పిలిపించింది. వైఎస్సార్‌సీపీ నుంచి పార్టీలోకి వస్తున్నారంటూ దామచర్లకు చెప్పింది. అంతే ఆయన పచ్చకండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. కండువాల కార్యక్రమానికి ముందే కొంతమంది మహిళలు అక్కడ నుంచి వెళ్లిపోయారు. అసలు మూడో డివిజన్ టీడీపీ అధ్యక్షుడికి గానీ, కార్యదర్శికి కానీ ఈ కండువాల పంచాయితీనే తెలియదు. దీన్ని బట్టి అసలు టీడీపీలో ఎవరు ఉన్నారో కూడా దామచర్లకు తెలియదంటే ఆయనకు పార్టీ మీద ఉన్న పట్టు ఏపాటిదో అట్టే అర్థమవుతోంది. ప్యాకేజీల కోసం వచ్చే వారి కోసం దామచర్ల తివాచీలు పరుస్తున్నట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment