
న్యూఢిల్లీ: దేశంలో అత్యవసర స్థితి విధించి 46 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ నాటి దురాగతాలను, దారుణ పరిస్థితులను గుర్తు చేశారు. ఆ చీకటి రోజులను మర్చిపోలేమన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేయడానికి, రాజ్యాంగ విలువలను కాపాడడానికి ప్రతినబూనుదామని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎమర్జెన్సీ పేరుతో ప్రజాస్వామ్యాన్ని కాలరాయడానికి కాంగ్రెస్ ప్రయత్నించిందని విమర్శించారు.
నాడు ఎమర్జెన్సీని వ్యతిరేకించి, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు కృషి చేసిన మహనీయులను గుర్తు చేసుకోవాలని ట్వీట్ చేశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దారుణ చర్యలకు సంబంధించిన ఒక లింక్‌ను కూడా ప్రధాని పోస్ట్ చేశారు. ‘ఎమర్జెన్సీ చీకటి రోజులను మర్చిపోలేం. 1975 నుంచి 1977 వరకు రాజ్యాంగబద్ధ వ్యవస్థలను క్రమబద్ధంగా నాశనం చేశారు’అని పేర్కొన్నారు. ఇతర బీజేపీ నేతలు కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
‘అధికార దాహంతో 1975లో ఇదే రోజున కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసింది. ఒక కుటుంబానికి వ్యతిరేకంగా గళమెత్తిన వారిని అణచివేసేందుకే ఎమర్జెన్సీ విధించారు. భారత చరిత్రలో అది ఒక చీకటి అధ్యాయం’అని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రభుత్వ వేధింపులను ఎదుర్కొంటూ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన నాయకులను బీజేపీ చీఫ్ జేపీ నడ్డా గుర్తు చేసుకున్నారు. 1975 జూన్ 25న నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర స్థితిని విధించారు. ప్రాథమిక హక్కులపై ఆంక్షలు విధించారు. వ్యతిరేకులను, విపక్ష నాయకులను జైళ్లలో బంధించారు. చివరకు, 1977లో ఎమర్జెన్సీని ఎత్తివేసి ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు.