చంద్రబాబు పగటికలలు కంటున్నారు
జనసేన కార్యకర్తలను పవన్ నిలువునా ముంచేశారు
డిప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజం
రేణిగుంట(తిరుపతి జిల్లా): ‘మీ ఇంటికి నేను మంచి చేశాను.. నన్ను ఆశీర్వదించండి. లేకుంటే నాకు ఓటేయొద్దు అని చెప్పగలిగే దమ్ముందా?’ అని చంద్రబాబును డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రశ్నించారు. చంద్రబాబు అధికారం గురించి పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెదుళ్లచెరువు ఎస్టీ కాలనీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో పథకాలను అమలు చేశారని వివరించారు.
చంద్రబాబు ఎప్పుడైనా ఎస్సీ, ఎస్టీ, బీసీలను రాజ్యసభకు పంపించారా? అని ప్రశ్నించారు. గొల్ల బాబూరావు అనే ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని, నలుగురు బీసీలను రాజ్యసభకు పంపిన ఘనత సీఎం జగన్‌కు దక్కిందన్నారు. ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలనుకుంటారా? అంటూ చంద్రబాబు హేళన చేశారని మండిపడ్డారు.
2019లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్‌కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. జనసేన కార్యకర్తలను నిలువునా ముంచేశారని విమర్శించారు. 24 సీట్లను కూడా చంద్రబాబు చెప్పిన వారికే ఇచ్చే దుస్థితిలో పవన్ ఉన్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్ చేతిలో చంద్రబాబు, పవన్‌కు మళ్లీ ఘోర పరాభవం తప్పదన్నారు.
ఎల్లప్పుడూ జగన్ వెంటే..
డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. ‘గంగాధరనెల్లూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ టికెట్‌ను నా కుమార్తెకు ఇస్తే చంద్రబాబుకు వచ్చిన నష్టమేంటి? నేనే సంతోషంగా నా కుమార్తెకు టికెట్ ఇవ్వాలని సీఎం జగన్‌ను అడిగాను. నా సేవలను పార్టీ మరో రకంగా వినియోగించుకుంటుంది.
నేను ఎప్పుడూ వైఎస్ కుటుంబాన్ని వదలను. దళితుడినైన నన్ను గుర్తించి డిప్యూటీ సీఎం పదవి వరకు తీసుకెళ్లిన సీఎం జగన్ మేలును ఎప్పటికీ మరువను. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లను అమ్ముకునే సంస్కృతి చంద్రబాబుది’ అని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment