తెలంగాణ బీజేపీలో ఊహించని ట్విస్ట్‌.. ఏం జరుగుతోంది? | Different Politics In Telangana's BJP | Sakshi
Sakshi News home page

కిషన్‌రెడ్డి ఎంట్రీతో బీజేపీలో కొత్త ట్విస్ట్‌లు.. కాషాయ పార్టీలో ఏం జరుగుతోంది?

Published Tue, Sep 19 2023 7:42 AM | Last Updated on Tue, Sep 19 2023 8:41 AM

Different Politics In Telangana BJP - Sakshi

తెలంగాణ కమలం పార్టీకి నాయకులు అక్కర్లేదా? ఇతర పార్టీల నుంచి వస్తున్నవారిని ఎందుకు వద్దనుకుంటున్నారు? ముందు రమ్మని ఆహ్వానించి తీరా ఆఫీస్‌కు వచ్చాక ఎందుకు తలుపులు మూస్తున్నారు? కొత్తగా వస్తున్న నేతల వల్ల నష్టం ఎవరికి? తమ సీట్లు పోతాయనే సీనియర్లు కొత్తగా వచ్చేవారికి ఎర్ర జెండా చూపుతున్నారా? అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది?..

ఎవరైనా తమ పార్టీలో చేరుతామని వస్తే.. అయితే చేర్చుకుంటామనో.. లేక లేదనో సమాధానం ఇస్తారు. కానీ, అన్ని పార్టీల్లోకెల్లా తమ పార్టీ రూటే సెపరేటు అన్నట్లుగా.. ముందు ఒకే చెప్పి తర్వాత నో చెప్పడం బీజేపీలో ప్రస్తుతం ట్రెండ్‌గా మారింది. ఇటీవల మాజీ మంత్రి కృష్ణయాదవ్ చేరికతో పాటు తాజాగా క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కుమార్ విషయంలోనూ ఇదే జరిగింది. ఏ పార్టీలో లేనివిధంగా జాయినింగ్స్ కోసమే ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసుకున్న కమలదళం ఇప్పుడిలా వింతగా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. ముందుగా చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర నాయకత్వం తీరా చేరేందుకు వచ్చాక చేతులెత్తేయడంతో బీజేపీ తీరు చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు.

ఇద్దరి విషయంలో ఇలా..
ఇటీవల మాజీ మంత్రి కృష్ణయాదవ్ చేరిక విషయంలోనూ చివరి నిమిషంలో బ్రేక్ పడింది.  ఆయన చేరేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. సిటీలో కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటుచేసుకున్నారు. తీరా చివరిక్షణంలో పార్టీ చేర్చుకోలేదు. అలాగే తాజాగా చికోటి ప్రవీణ్ కుమార్ జాయినింగ్ లోనూ ఇదే జరిగింది. సిటీ మొత్తం కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. భారీ ర్యాలీతో పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేర్చుకున్నారు. తీరా వచ్చాక చూస్తే రాష్ట్ర కార్యాలయంలో ఒక్క ముఖ్య నేత కూడా లేకుండాపోయారు. చేర్చుకుంటామని పిలిచి బీజేపీ నేతలు ముఖం చాటేశారు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.

హ్యాండిచ్చిన బీజేపీ నేతలు..
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చేరికల కమిటీ చైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో మాజీ మంత్రి అజ్మీరాచందూలాల్ తనయుడు అజ్మీరా ప్రహ్లాద్ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. వాస్తవానికి చికోటి ప్రవీణ్ కుమార్ తో పాటు ప్రహ్లాద్ చేరిక కూడా ఉండాల్సి ఉంది. కానీ చికోటి ర్యాలీగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి సమీపంలో ఉన్నారని తెలియగానే హడావుడిగా ప్రహ్లాద్ కు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కాసేపటికే అక్కడి నుంచి బడా నేతలంతా జారుకున్నారు. రాష్ట్ర ఎన్నికల ఇన్ చార్జి ప్రకాశ్ జవదేకర్ సహా, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ లక్ష్మణ్ ఒక్కొక్కరుగా పార్టీ కార్యాలయం నుంచి జారుకున్నారు. కిషన్ రెడ్డి సమక్షంలో చికోటి చేరాల్సి ఉండగా ఆయన కూడా పలు మీటింగుల సాకుతో చివరి క్షణంలో హ్యాండిచ్చారు.

కిషన్‌ రెడ్డి రాకతోనే..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియామకం అనంతరం పార్టీలో జాయినింగ్స్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ గా కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న అనంతరం చేరికల విషయంలో వింత పోకడలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ మంత్రి కృష్ణయాదవ్ అంబర్ పేట నియోజకవర్గం కాబట్టి కిషన్ రెడ్డి సీటుకు ఎక్కడ ఎసరు పడుతుందోననే ఆయన్ను చేర్చుకోలేదని ప్రచారం జరుగుతోంది. ఈటల చేర్చుకుందామంటే.. కిషన్ రెడ్డి అడ్డుకున్నట్లు తెలుస్తోంది. కృష్ణ యాదవ్, కిషన్ రెడ్డిది ఒకే సెగ్మెంట్ కాబట్టి పోటీ విషయంలో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని, కానీ చికోటి విషయంలో కిషన్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. చికోటిపై ఈడీ కేసులు ఉన్నాయన్న నేపథ్యంలో ఏమైనా అడ్డుకున్నారనుకుంటే.. ఆ విషయం పార్టీకి ముందు తెలియదా? అని ఆయన అభిమానులు లేవనెత్తుతున్నారు. ప్రహ్లాద్ ను చేర్చుకుని చికోటిని చేర్చుకోకపోవడమేంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

తెర వెనుక ఏం జరిగింది?
చికోటి ప్రవీణ్ చేరిక విషయంలో తెర వెనుక ఏదో జరిగినట్లుగా తెలుస్తోంది. ఆయన్ను పార్టీలో చేర్చుకుంటానని చెప్పి.. తీరా జాయిన్ చేసుకోకపోవడంపై చికోటి అభిమానులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.  బీజేపీలో చేరితే జాయిన్ అయ్యే వారి భవిష్యత్ ప్రమాదకరంలో పడుతుందనే సంకేతాలను రాష్ట్ర నాయకత్వం పంపిస్తోందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఎందుకంటే ముందు జాయినింగ్ కు ఒకే చెప్పి.. ఫలానా వ్యక్తులు బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జరిగాక చేర్చుకోకపోతే సదరు వ్యక్తి ఇమేజ్ ను డ్యామేజ్ అవుతుంది. అలాంటి ప్లాన్ కు ఏమైనా తెరదీశారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. బీజేపీలో ఇదే పరంపర కొనసాగితే కనుక పార్టీలో చేరే వారే కరవయ్యే ప్రమాదం ఉందని చర్చించుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement