
ఇప్పట్లో రాజకీయ పార్టీని ప్రారంభించలేనని సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన రాజకీయ ప్రకటనపై మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్‌హాసన్ స్పందించారు. రజనీకాంత్ ప్రకటనతో ఎంతో నిరాశ చెందినట్లు తెలిపారు. అయితే రజనీకాంత్ ఆరోగ్యమే తనకు ముఖ్యమని, ఎన్నికల ప్రచారం తరువాత రజనీని కలుస్తానని కమల్ హాసన్ తెలిపారు. కాగా డిసెంబర్ 31న రాజకీయ రంగ ప్రవేశంపై పూర్తి వివరాలు వెల్లడిస్తానని ప్రకటించిన తలైవా ఇప్పట్లో రాజకీయ పార్టీని ప్రారంభించలేనని మంగళవారం తెలిపిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇందుకు తనను క్షమించాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లోకి రాకుండానే సేవ చేస్తానని లేఖ ద్వారా పేర్కొన్నారు. చదవండి: రజనీకాంత్ అనూహ్య ప్రకటన
కాగా 2017 డిసెంబరులో ‘అరసియల్‌కు వరువదు ఉరుది’ (రాజకీయాల్లోకి రావడం ఖాయం) అని బహిరంగంగా ప్రకటించిన తలైవా రజనీకాంత్ అనేక పరిణామాల అనంతరం ఈనెల 3న పార్టీని స్థాపించనున్నట్లు ప్రకటించారు. జనవరిలో కొత్త పార్టీ పెడతానని, డిసెంబరు 31న ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు. అయితే ఇటీవల రజినీకాంత్ అన్నాత్తే షూటింగ్ సమయంలో అస్వస్థతకు గురై ఉన్నట్లుండి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. హైబీపీతో బాధపడిన ఆయన ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. అయితే అనారోగ్య కారణాలతో రజనీ ప్రస్తుతం రాజకీయ పార్టీ స్థాపనపై వెనక్కి తగ్గారు.