
ఆధిపత్య పోరులో తెలుగు తమ్ముళ్లు వీధి కొట్లాటకు దిగారు. తమను అజమాయిషీ చేయడమేంటంటూ పార్టీ డివిజన్ అధ్యక్షుడినే చితకబాదారు.
పటమట(విజయవాడ తూర్పు): ఆధిపత్య పోరులో తెలుగు తమ్ముళ్లు వీధి కొట్లాటకు దిగారు. తమను అజమాయిషీ చేయడమేంటంటూ పార్టీ డివిజన్ అధ్యక్షుడినే చితకబాదారు. ఈ ఘటన బుధవారం విజయవాడలోని 19వ డివిజన్‌లో జరిగింది. లబ్బీపేటలోని టీడీపీ కార్యాలయం ఎదురుగా బుధవారం ఆ పార్టీ కార్యకర్తల మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. పార్టీ డివిజన్ అధ్యక్షుడు బాగం సాయిప్రసాద్ ఆ వివాదంపై తీర్పు చెప్పేందుకు వెళ్లాడు.
దీనికి కార్యకర్తలు.. తమ మధ్యకు రావొద్దని, సంబంధం లేని అంశాల్లో జోక్యం చేసుకోవద్దంటూ ఆయనకు సూచించారు. పార్టీ డివిజన్ అధ్యక్షుడిగా నియమితులైనప్పట్నుంచి ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తున్నావంటూ దుర్భాషలాడుతూ సాయిప్రసాద్‌ను చితకబాదారు. పార్టీ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. స్థానికులు కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు సమాచారమివ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని వారందరినీ స్టేషన్‌కు తరలించారు.