న్యూఢిల్లీ: శనివారంతో ఏడు దశల లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. నేటి సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడనునన్నాయి. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ చర్చలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే కాంగ్రెస్ నిర్ణయంపై అధికార బీజేపీ సెటైర్లు వేసింది. లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతున్నామని కాంగ్రెస్ పార్టీకి ముందే తెలిసిందని విమర్శలు గుప్పించింది. అందుకే మీడియాకు, ప్రజలకు ముఖం చూపించలేక పారిపోతున్నారని మండిపడింది.
ఎగ్జిట్ పోల్ డిబేట్‌లకు దూరంగా ఉండబోతున్నామంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా చేసిన ప్రకటనపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఆ పార్టీ ప్రధాన వ్యూహకర్త, కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ఓటమిని అంగీకరించినట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు.
ఈ మేరకు అమిత్ షా ‘ఎక్స్’ వేదికగా .. ‘భారీ ఓటమి ఎదురవ్వబోతున్నట్టు కాంగ్రెస్ పార్టీకి తెలుసు. మీడియా, ప్రజలకు ఏం ముఖం చూపిస్తారు? అందుకే కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్స్‌కు దూరంగా పారిపోతోంది. కాంగ్రెస్ పార్టీ పారిపోవద్దు. ఓటమిని ఎదుర్కొని ఆత్మపరిశీలన చేసుకోవాలని నేను చెప్పదలచుకున్నాను’’ అని పేర్కొన్నారు.
దేశంలో పురాతన పార్టీగా ఉన్న కాంగ్రెస్ చిన్న పిల్లల్లా ప్రవర్తించడం తగదని జేపీ నడ్డా విమర్శించారు, . తాను ఆడుకునే బొమ్మను ఎవరో లాగేసుకున్న తీరుగా హస్తం పార్టీ ధోరణి ఉందని, ప్రతిపక్షాల్లో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ నుంచి ఒక నిర్దిష్ట స్థాయి పరిపక్వతను ఆశిస్తున్నట్టు ఆయన వ్యాఖ్యానించారు. ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తాయనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్స్‌కు దూరంగా జరుగుతోందని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment