సాక్షి, అమరావతి: దళిత సంక్షేమంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శించారు. ఊహా ప్రపంచంలో తిరుగుతూ ప్రతిదీ తానే కనిపెట్టానని చెప్పుకొనే చంద్రబాబు.. ఎస్సీ నాయకులంతా తన భ్రమలను ప్రచారం చేయాలని కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దళితులకు సంక్షేమం అందించడంలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన సీఎం వైఎస్ జగన్‌ను తూలనాడటం సిగ్గు చేటని మండిపడ్డారు.
ఆయన శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా పనిచేసి కూడా దళితులు గుర్తుంచుకునేలా ఏ ఒక్క పథకాన్నీ అందించలేదన్నారు. ఇప్పటికైనా దళితుల సంక్షేమంపై చర్చించేందుకు చంద్రబాబు ముందుకురావడం శుభపరిణామమని చెప్పారు. కనీసం చర్చ తర్వాతైనా వాస్తవాలు తెలసుకుంటారన్నారు.
సీఎం జగన్ దళిత సంక్షేమంలో డిస్టింక్షన్ సాధిస్తే, చంద్రబాబు ఫెయిలయ్యారని పేర్కొన్నారు. దళిత సంక్షేమం, దళితులకు ఎవరు మేలు చేశారనే అంశంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, అసెంబ్లీ వేదికగా చర్చిద్దామని చెప్పారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీ వేదికగా దళిత సమస్యలపై చర్చకు రావాలని సవాలు చేశారు.
విద్యతోనే దళితుల జీవితాల్లో వెలుగులు
విద్యతోనే దళితుల జీవితాల్లో వెలుగులు సాధ్యమన్న అంబేడ్కర్ ఆలోచన స్ఫూర్తిని సీఎం జగన్ అమలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో విద్య, వైద్యరంగాల్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టి భ్రష్టుపట్టించారని విమర్శించారు. సీఎం జగన్ నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, ఆరోగ్యశ్రీతో విద్య, వైద్యాలను పెట్టుబడిదారీవ్యవస్థ చేతుల్లోంచి విడిపించి సామాన్యుడికి అందించారని చెప్పారు.
రాష్ట్రంలో ఎటువంటి వివక్షకు తావులేకుండా రూ.2.08 లక్షల కోట్లు ప్రజలకు నేరుగా అందింస్తే.. అందులో ఏకంగా రూ.53 వేల కోట్లకుపైగా దళితులకు ఇచ్చి ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడ్డారన్నారు. కరోనా తర్వాత పేదవాడికి డబ్బు పంచమని ప్రపంచం అంతా చెబుతుంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి ముందుకు రాలేదని చెప్పారు. కానీ సీఎం జగన్ సంక్షేమాన్ని ఆపలేదని గుర్తుచేశారు. ఒకే ఒక్క పరీక్ష ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో పారదర్శకంగా నియామకం చేస్తే దాన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలే అధికంగా ఉద్యోగాలు పొందడం సంస్కరణకు నిదర్శనమని చెప్పారు.
మీ ఆర్థికశాస్త్రంలో ఎప్పుడైనా ఉందా?
చంద్రబాబులో అసహనం పెరిగిపోతోందని, సీఎం జగన్‌ను నోటికొచ్చినట్టు మాట్లాడటం హేయమని చెప్పారు. తాను చేయలేనిది ఎదుటివారు చేస్తే ఓర్వలేని గుణం చంద్రబాబులో నిలువెల్లా ఉందన్నారు. 30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్లస్థలాలు ఇస్తే.. సింహభాగం దళితులకే అందాయని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా సెంటుస్థలం ఇచ్చారా? ఆయన ఆర్థికశాస్త్రంలో ఆ విధానం ఉందా? అని ప్రశ్నించారు.
సీఎం జగన్ చేసిన మేలుతో జగనన్నే మా భవిష్యత్తు అని ప్రతి కుటుంబం చెబుతోందన్నారు. ‘అసెంబ్లీ కంటే ప్రజాస్వామ్యంలో చర్చావేదిక ఏం ఉంటుంది. మీరు చర్చిద్దాం అంటున్నారు కదా. అసెంబ్లీకి రండి. మీరు వస్తానంటే ప్రత్యేక అసెంబ్లీ పెట్టమని కూడా కోరతాం. అమరావతిలో పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తామంటే దానికి వ్యతిరేకంగా కేసులు వేసింది మీరే. ఇప్పుడు దళితుల సంక్షేమం గురించి ఏం మాట్లాడతారు.
విజయవాడ నడిబొడ్డున రూపుదిద్దుకుంటున్న అంబేడ్కర్ విగ్రహాన్ని చూస్తే దళితుల ఆత్మగౌరవం ఎంతగా పెరుగుతోందో తెలుస్తోంది..’ అని చెప్పారు. దళితులను రాజకీయంగా ఉన్నతస్థానాల్లో కూర్చోబెట్టడమే కాకుండా క్యాబినెట్‌లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడం దేశ చరిత్రలో ఎక్కడా లేదన్నారు.
మండలిలో 43 మంది వైఎస్సార్సీపీ సభ్యులు ఉంటే వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సభ్యులు 22 మంది ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో 29 ఎస్సీ నియోజకవర్గాలు, నాలుగు పార్లమెంటు స్థానాలు ఉంటే.. జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో 28 నియోజకవర్గాల్లోను, నాలుగు పార్లమెంటు స్థానాల్లోను గెలిచిన విషయాన్ని చంద్రబాబు మర్చిపోకూడదని ఆయన పేర్కొన్నారు.
దళిత సంక్షేమంలో చంద్రబాబు విఫలం
Published Sat, Apr 29 2023 4:25 AM | Last Updated on Sat, Apr 29 2023 4:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment