సాక్షి, హైదరాబాద్: ఈనెల 29వ తేదీన ఎమ్మెల్యేల కోటాలో జరిగే రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీనే దక్కించుకునే అవకాశముంది. సంఖ్యాబలం పరంగా చూస్తే కాంగ్రెస్‌కు ఒకటి, బీఆర్‌ఎస్‌కు ఒకటి రావాల్సి ఉన్నా.. ఈ రెండు స్థానాలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు, వేర్వేరుగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో.. అధికార కాంగ్రెస్ పార్టీకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు దక్కనున్నాయి.
ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు రాజీనామా చేసిన ఏ సభ్యుడి స్థానంలో ఎన్నిక కావడానికి నామినేషన్ వేస్తున్నారో స్పష్టంగా పేర్కొనాలని కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో వారిద్దరూ గతనెల 9వ తేదీన తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఎమ్మెల్సీలుగా వీరిద్దరికీ 30 నవంబర్ 2027 వరకు గడువు ఉన్నా.. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వేర్వేరుగా జరిగే ఈ ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లలో ఒకటి తెల్ల, రెండోది గులాబీ రంగులో ముద్రించాలని స్పష్టం చేశారు. మొత్తం సభ్యులు(119), ఎన్నికవ్వాల్సిన స్థానాల సంఖ్య +1తో భాగించడంతో వచ్చే భాగఫలం(ఒకరికి కావాల్సిన ఓట్ల సంఖ్య 59.5)ను నిర్ధారిస్తారు.
ప్రస్తుతం వేర్వేరుగా ఎన్నిక నిర్వహిస్తుండటం వల్ల ఒక అభ్యర్థికి కనీసం 59.5 ఓట్లు లభిస్తే ఆ అభ్యర్థి ఎన్నిక కావడానికి వీలుంటుంది. అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 64 మంది సభ్యులున్నందున, రెండు స్థానాలకు వేర్వేరుగా 119 మంది సభ్యులు రెండుసార్లు ఓట్లు వేయాల్సి ఉండడంతో ఈ రెండు స్థానాలూ కాంగ్రెస్‌కే దక్కనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఒకే నోటిఫికేషన్, ఒకే పోలింగ్ స్టేషన్ ఉంటే..
రెండింటికీ ఒకే నోటిఫికేషన్, ఒకే పోలింగ్ స్టేషన్ ఉన్న పక్షంలో మొత్తం సభ్యుల సంఖ్య(119)ని ఎన్నిక కావాల్సిన స్థానాలు రెండింటికి +1 కలప డం వల్ల 39.6 ఓట్లు లభిస్తే ఒక ఎమ్మెల్సీ స్థానం రావడానికి అవకాశం ఉండేది. ఈ లెక్కన కాంగ్రెస్‌కు ఒకటి, బీఆర్‌ఎస్‌కు ఒకటి కచ్చితంగా వచ్చేవి.
రెండోస్థానం కైవసం చేసుకోవడానికి ఏ పార్టీకి కూడా మెజారిటీ లేనందున దాదాపు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగే అవకాశం ఉండేది. అయితే ఎన్నికల సంఘం ఈ రెండింటికీ వేర్వేరుగా ఎన్నిక నిర్వహించాలని ఆదేశించింది. అసెంబ్లీలోని కమిటీ హాల్–1లో ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే వారు ఎస్సీ, ఎస్టీలు రూ. 5 వేలు, మిగిలిన కులాల వారైతే రూ.10 వేలు డిపాజిట్ కట్టాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment