ముంబై: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నడుమ.. మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. శివ సేన కీలక నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) తమ ఎదుట హాజరుకావాలని ఇవాళ నోటీసులు జారీ చేసింది.
మనీలాండరింగ్ కేసు ఆరోపణల నేపథ్యంలో.. సంజయ్ రౌత్‌ను ప్రశ్నించాల్సి ఉందని ముంబైలోని ఈడీ కార్యాలయం తెలిపింది. ఈ మేరకు మంగళవారం తమ ఎదుట హాజరు కావాలని సమన్లలో పేర్కొంది ఈడీ.
పాత్రా చావ్ల్ భూ కుంభకోణం కేసుకు సంబంధించి.. 1,034 కోట్ల గోల్‌మాల్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి.. ఏప్రిల్ నెలలో సంజయ్ రౌత్‌కు సంబంధించి ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ‘‘నేను భయపడే రకం కాదు. సీజ్ చేస్తే.. చేస్కోండి, చంపుకోండి.. కాల్చేయండి.. లేదంటే జైలుకు పంపండి’’ అంటూ ఆ సమయంలో ప్రకటన కూడా చేశారు.
ఇదిలా ఉంటే.. సంజయ్ రౌత్‌కు ఈడీ నోటీసులపై ఏక్‌నాథ్ షిండే తనయుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే వెటకారం ప్రదర్శించారు. ‘‘ఈడీ సమన్ల నేపథ్యంలో సంజయ్ రౌత్‌కు నా శుభాకాంక్షలు’’ అంటూ ప్రకటన ఇచ్చాడు. అలాగే.. అనర్హత విషయంలో న్యాయస్థానంలో జరుగుతున్న పోరులో రెబల్స్ విజయం సాధిస్తారని ధీమా ప్రకటించాడు. మహారాష్ట్ర ప్రజలు మొత్తం పరిణామాలు చూస్తున్నారని, సరైన టైంలో సరైన బదులు ఇస్తారని పేర్కొన్నాడు. రెబల్ ఎమ్మెల్యేలంతా ఇవాళ చర్చ జరిపి.. ఒక తుదినిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని శ్రీకాంత్ షిండే పేర్కొన్నాడు.
సంజయ్ రౌత్‌కు ఈడీ నోటీసులపై థాక్రే మద్ధతుదారులు స్పందించారు. షిండే తిరుగుబాటు నేపథ్యంలోనే.. దర్యాప్తు సంస్థలపై ఒత్తిడి పెరుగుతోందంటూ పరోక్షంగా కేంద్రంలోని బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు.
శివ సేన నేత, ఆ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుపై మొదటి నుంచి పార్టీ తరపున గట్టిగా గొంతుక వినిపిస్తున్నారు సంజయ్ రౌత్. ఈ క్రమంలో ఆయనకు ఈడీ నోటీసులు పంపడం ఆసక్తికరంగా మారింది. అయితే శివ సేనలో చీలికలకు ఈడీ భయమే కారణమని, ఈడీ ఒత్తిడితో పార్టీని వీడేవాళ్లు నిజమైన బాలాసాహెబ్ భక్తులు కాదని సంజయ్ రౌత్ ఇదివరకే ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment