గతం గుర్తుందా రామోజీ?.. ఆ విషయం ‘ఈనాడు’కు తెలియదా! | Eenadu Ramoji False Propaganda To Block New Investments In Ap | Sakshi
Sakshi News home page

గతం గుర్తుందా రామోజీ?.. ఆ విషయం ‘ఈనాడు’కు తెలియదా!

Published Sun, Feb 26 2023 12:52 PM | Last Updated on Sun, Feb 26 2023 1:29 PM

Eenadu Ramoji False Propaganda To Block New Investments In Ap - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడానికి ఈనాడు మీడియా ప్రయత్నాలు గట్టిగానే చేస్తోంది. ఏపీ అభివృద్దికి పెద్ద శత్రువుగా ఈ మీడియా మారిందంటే ఆశ్చర్యం కాదు. ఒక వైపు రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు తేవడానికి ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం విశాఖపట్నంలో భారీ స్థాయిలో గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్‌ను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 3,4 తేదీలలో ఈ సదస్సు జరగబోతోంది. దీనికి వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలను రప్పించడానికి మంత్రులు, ఐఎఎస్ అధికారులు విశేష కృషి చేస్తుంటే దానిని ఎలా చెడగొట్టాలా అని ఈనాడు మీడియా ఆలోచన చేస్తోంది.

మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, అమర్‌నాథ్‌ తదితరులు బెంగుళూరు, ముంబై, హైదరాబాద్ వంటి నగరాలలో పర్యటించి సన్నాహక సదస్సులు పెడుతున్నారు. వారి సమావేశాలకు ప్రముఖులు హాజరువుతున్నారు. ఏపీకి ఉన్న అపార అవకాశాలను మంత్రులు తెలియచేస్తున్నారు. విశాఖ సమ్మిట్ సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తుండడంతో ఈనాడు మీడియా పుల్లలు వేయడం ఆరంభించింది. అందులో భాగంగా శనివారం నాడు ఒక కథనాన్ని ఇచ్చింది. పారిశ్రామిక రాయితీ జాడేది అని హెడింగ్ పెట్టి మొదటి పేజీలో పరిచారు.

ప్రభుత్వం ప్రోత్సహాకాలను సకాలంలో చెల్లించలేదట. తీరా చూస్తే అదంతా కలిపి 728 కోట్లేనని ఆ మీడియాలోనే తెలిపారు. పైగా అది కూడా గత ఆగస్టునుంచే ఉన్న బకాయి. నిజానికి ఏ ప్రభుత్వంలో అయినా పారిశ్రామిక ఇన్సెంటివ్‌లు ఒకసారిగా చెల్లింపులు జరగవు. క్రమేపీ విడతల వారీగా ఇస్తుంటారు. గతంలో నాలుగైదేళ్ల పాటు కూడా పరిశ్రమలకు బకాయిలు చెల్లించని ఘట్టాలు చాలానే ఉన్నాయి.

తెలుగుదేశం హయాంలో ఈ బకాయిలు ఎలా ఉన్నాయో మాత్రం ఈ మీడియా రాయలేదు. అప్పుడంతా బకాయి లేకుండా చెల్లించారా?. టీడీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి 3400 కోట్ల రూపాయల బకాయి ఉందట. ఆ  ప్రభుత్వం సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు చెల్లించవలసిన సుమారు వెయ్యి కోట్ల రూపాయల పైగా బకాయిలను జగన్ ప్రభుత్వం చెల్లించిందన్న సంగతి ఈనాడు మీడియాకు తెలియదా!

ఎవరైనా పారిశ్రామికవేత్తలు ఆంద్రకు రావాలని అనుకుంటే,వారిని చెడగట్టడానికి గాను ఇక్కడ బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం సరిగా చెల్లించడం లేదన్న సంకేతం ఇవ్వడానికి, ఇలా దురుద్దేశపూరితంగా కథనం రాసిన సంగతి అర్దం అవుతూనే ఉంది. జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈనాడు వారు  ఇలాంటి దిక్కుమాలిన కథనాలు ఎన్ని వండి వార్చారో! కియా పరిశ్రమ వెళ్లిపోతోందని తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే ఈనాడు, జ్యోతి, టివి 5 వంటి మీడియా సంస్థలు విపరీత ప్రచారం చేశాయి. కాని ఆ సంస్థ వారు అదనంగా 400 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడాతమని ప్రకటించారు.

ఏపీకి ఎన్నడూ రాని ఆదిత్య బిర్లా వచ్చి పరిశ్రమలు పెడుతున్నారు. అయినా ఇక్కడకు పరిశ్రమలు రావడం లేదని దుష్ప్రచారం చేస్తుంటారు. విశాఖలో ఎల్జి పాలిమర్స్ సంస్థ నుంచి గ్యాస్ వెలువడడంతో పదమూడు మంది మరణించారు. ఆ సంస్థ తిరిగి తెరవడానికి వీలు లేదని టీడీపీ, ఎల్లో మీడియా వాదించాయి. అదే చిత్తూరు జిల్లాలో టీడీపీ ఎంపికి చెందిన సంస్థలో పొల్యూషన్ సమస్య సృష్టిస్తుంటే, వారికి నోటీసు ఇవ్వగానే నానా యాగి చేశాయి. ఇదే ఎంపీ తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటిస్తే, ఇంకే ముంది ఏపీకి రానివ్వడం లేదని అన్నారు. తదుపరి ఆయనే ఏపీలో కూడా పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటిస్తే ఈ మీడియా నోరుమూసుకుంది.

కాకినాడ వద్ద ఫార్మా హబ్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపితే, అది వద్దని టీడీపీ ఏకంగా లేఖ రాస్తే, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా తందాన అంటూ వంతపాడాయి. గతంలో శ్రీసిటీకి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం భూమి సేకరిస్తుంటే, రాష్ట్రంలో పారిశ్రామక సెజ్ లకు ఏర్పాట్లు చేస్తుంటే ఈనాడు రామోజీరావు దానిని వ్యతిరేకిస్తూ ఏకంగా సంపాదకీయం రాశారు. అదంతా ప్రజా వంచనగా వ్యాఖ్యానించారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2016 లో ఒక వార్త రాస్తూ అదంతా భాగ్యసీమ అయిపోయిందని రాసింది. అసలు ఆ పారిశ్రామికవాడ రావడానికి కృషి చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు మాత్రం ప్రస్తావించకుండా జాగ్రత్తపడింది. అదే పద్దతిలో ఇప్పుడు కూడా జగన్ ప్రభుత్వం పరిశ్రమలు తీసుకువస్తుంటే వ్యతిరేక కథనాలు రాయడానిక నానా పాట్లు పడుతోంది.

నెల్లూరు జిల్లా రాపూరు వద్ద సోలార్ ప్రాజెక్టుల కోసం పారిశ్రామికవాడను ఏర్పాటు చేస్తుంటే దానిని ఫలానా వారికి ఇస్తున్నారు.. అది ముఖ్యమంత్రి జగన్ సన్నిహితులది అంటూ దిక్కుమాలిన రాతలకు పాల్పడింది. అంతే తప్ప ఆ పారిశ్రామికవాడ వస్తే వేలాది మందికి ప్రయోజనం కలుగుతుందని మాత్రం రాయడానికి వారికి మనసు ఒప్పలేదు. తెలంగాణకు గత ఏడాదికాలంలో సుమారు రెండువేల కోట్ల పెట్టుబడులే వచ్చినా, చాలా గొప్పగా వచ్చాయని, అదే ఏపీకి సుమారు నలభై వేల కోట్ల పెట్టుబడులు వచ్చినా, ఏమీ రాలేదని ఉన్నవిలేనట్లు, లేనివి ఉన్నట్లు ఈనాడు ప్రచారం చేయడం దుర్మార్గంగా ఉంది.

ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో గత మూడేళ్లుగా ఏపీ నెంబర్ ఒన్ స్థానంలో ఉన్నా, వీరు మాత్రం గుర్తించరు. ఇలాంటి దుష్టచతుష్టయాన్ని ఎదుర్కుంటూ జగన్ ప్రభుత్వం కొత్త పరిశ్రమల ఏర్పాటుకు చాలా కృషి చేయవలసి వస్తోంది. చంద్రబాబు టైమ్‌లో విశాఖలో సదస్సులు పెట్టి దారిపోయేవారితో ఒప్పందాలు చేసుకున్నా, ఆహా, ఓహో అంటూ వీరే ఊదరగొట్టారు. వాటిలో పదో వంతు కూడా వాస్తవరూపం దాల్చకపోయినా, ఎన్నడూ వీరు ఆ విషయాలను ప్రజలకు చెప్పలేదు. మాల్ ఏర్పాటుకు విశాఖలో అత్యంత విలువైన స్థలాన్ని లూలూ అనే  కంపెనీకి కేటాయిస్తే, వారు ఏళ్ల తరబడి దానిని నిర్మించలేదు.

ఈ ప్రభుత్వం ఆ స్తలాన్ని వెనక్కి తీసుకుని వేరే అవసరాలకు కేటాయిస్తే తప్పు పడుతుంది. అమరావతి పేరుతో ఉన్న పల్లెల్లలో బిఆర్ షెట్టి అనే ఆయనకు వంద ఎకరాలను గత ప్రభుత్వం కేటాయించింది. అక్కడ ఆస్పత్రి తదితర నిర్మాణాలు చేస్తారని తెలిపింది. కాని అలాంటివి ఏమీ చేయకపోయినా ఆ ప్రభుత్వ పట్టించుకోలేదు.పైగా బిఆర్ షెట్టిపై దుబాయిలో కేసులు వచ్చాయన్న సంగతి ఆ తర్వాత వార్తలలో వచ్చింది. అప్పట్లో బోగస్ కంపెనీలతో హడావుడి చేస్తే, ఇప్పుడు నిజమైన కంపెనీలు వస్తుంటేనే ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటోంది. జిందాల్ స్టీల్స్ జమ్మలమడుగులో 8800 కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అంతా సిద్దం అయ్యాకే అక్కడ జగన్ శంకుస్థాపనకు వెళ్లారు. అయినా ఒక్కోసారి కొన్ని పరిశ్రమలు అనుకున్నట్లు రావచ్చు. రాకపోవచ్చు.

అది ఏ ప్రభుత్వంలోనైనా జరుగుతుంటుంది. కాని టీడీపీ ప్రభుత్వంలో అలాంటివాటిని కప్పిపుచ్చి, ఈ ప్రభుత్వంలో ఏదైనా చిన్న ఘటన జరిగినా చిలవలు, పలవులు చేసి వార్తలు ఇవ్వడం ఈనాడుకు రివాజుగా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదాని గతంలో చంద్రబాబును కలిస్తే గొప్ప విషయంగా ప్రాజెక్టు చేశారు. అదే జగన్‌ను కలిస్తే రాష్ట్రాన్ని రాసిచ్చేస్తున్నారని దుర్మార్గపు రాతలకు టీడీపీ మీడియా పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండాలి. వచ్చే పరిశ్రమలను ఏదో రకంగా అడ్డుకుని, మళ్లీ ఆ నెపాన్ని ప్రభుత్వంపైనే నెట్టే ప్రమాదం ఉంది.
చదవండి: రామోజీ తప్పు చేస్తే ఉద్యోగులు బలిపశువులా?

ఏ మీడియా అయినా ప్రభుత్వంలోని లోటుపాట్లు రాయడం తప్పుకాదు. కాని నిర్మాణాత్మక  విధానంలో కాకుండా, రాష్ట్ర అభివృద్దిని ఎలా చెడగొట్టాలన్న ధ్యేయంతో ఈ మీడియా పనిచేస్తోంది. సరిగ్గా విశాఖ సమ్మిట్‌కు ముందు ఇలాంటి దారుణమైన కథనాలు రాయడం ఆరంభించారంటేనే వారి దుష్ట తలంపు తెలుస్తూనే ఉంది. పరిశ్రమల మంత్రి అమరనాథ్‌ మీడియా సమావేశంలో చెప్పిన వాటికి తన పైత్యం జోడించి మళ్లీ రాశారు.

అందుకే ఈనాడు, తదితర టీడీపీ మీడియా అంతా ఇప్పుడు ఏపీ పాలిట విలన్‌గా మారాయని ఒకటికి పదిసార్లు చెప్పవలసి వస్తోంది. చివరిగా ఒక మాట!. ఆంగ్ల దినపత్రిక అయిన టైమ్స్ ఆఫ్ ఇండియా ఏపీకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని ప్రముఖంగా రాస్తే, ఏపీలో పుట్టి పెరిగిన తెలుగు దినపత్రిక అయిన ఈనాడు ఆ పెట్టుబడులు రాకుండా ఎలా చేయాలా అన్న యావతో కథనాలు ఇస్తోంది. దీనినే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడమని అంటారు.
-హితైషి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement