మహారాష్ట్రలోని మహాయుతి (బీజేపీ, శివసేన-షిండే వర్గం, ఎన్సీపీ-అజిత్‌పవార్ వర్గం) కూటమి ప్రభుత్వంలో సీట్ల పంపకం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. క్షేత్రస్థాయిలో తమకే ఎక్కువ బలం ఉందంటూ ఎక్కువ స్థానాలను కేటాయించాలని కూటమిలోని శివసేన (షిండే వర్గం), అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ పట్టుబడుతుండటంతో బీజేపీకి తలనొప్పిగా మారింది.
ఈ తరుణంలో మార్చి 5న (నేడు) బీజేపీ నిర్వహించే ఎన్నికల సంబంధిత సమావేశాలు, పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మహారాష్ట్రలోని అకోలా, జల్గావ్, ఛత్రపతి శంభాజీనగర్‌లను పర్యటించనున్నారు. ఈ పర్యటనలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్..అమిత్ షాతో భేటీ కానున్నారు. దాదాపు పదహారు లోక్‌సభ స్థానాలపై సమీక్ష నిర్వహించాలని యోచిస్తున్నారు.
మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉండగా.. వాటిల్లో కనీసం 10 స్థానాల్లో పోటీ చేయాలని అజిత్ పవార్ శిబిరం భావిస్తోంది. ధారశివ్, పర్భానీ, బుల్దానా, గడ్చిరోలి, మాధా, హింగోలి, బారామతి, షిరూర్, సతారా, రాయ్‌గఢ్‌లు ఉన్నాయి.
ఆ సిట్టింగ్ ఎంపీ సీటుపై ఎన్సీపీ కన్ను
ప్రస్తుతం బీజేపీ సిట్టింగ్ ఎంపీ రంజిత్ నాయక్ నింబాల్కర్ కొనసాగుతున్న మాధా సీటుపై సీనియర్ ఎన్సీపీ (అజిత్ పవార్) నాయకుడు రాంరాజే నింబాల్కర్ తన వాదనను వినిపించారు. మాధా సీటు ఒకప్పుడు ఎన్సీపీకి కంచుకోట. ఇక్కడ శరద్ పవార్ 2009లో పోటీ చేసి గెలిచారని గుర్తు చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ సీట్ల పంపకంలో బీజేపీ అగ్రనాయకత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది.
22 స్థానాలు పట్టుబుడుతోన్న షిండే వర్గం
మహాయుతిలో శివసేన-షిండే వర్గం మొత్తం 22 స్థానాలు కావాలని పట్టుబడుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 22 నియోజకవర్గాల్లో పోటీ చేసిన శివసేన రాబోయే 2024 ఎన్నికల్లో మొత్తం 22 స్థానాల్లో పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే క్యాంప్‌కు చెందిన క్యాబినెట్ మంత్రి శంబురాజ్ దేశాయ్ స్పష్టం చేశారు. సీట్ల పంపంకం విషయంలో అసంతృప్తిగా ఉన్న ఏక్‌నాథ్ షిండే కేంద్ర పార్లమెంటరీ బోర్డు, రాష్ట్ర సమన్వయ సమావేశాలలో చర్చిస్తామని, అనంతరం బీజేపీ, ఎన్సీపీ నాయకులతో తదుపరి చర్చలు జరుపుతామని శంబురాజ్ దేశాయ్ చెప్పారు.
మీకన్నిస్తే మాకు మిగిలేదేంటి?
అయితే గత కొద్ది కాలంగా షిండే వర్గం డిమాండ్‌ను బీజేపీ నేతలు తప్పుబట్టారు. షిండే వర్గానికి 22 సీట్లు, అజిత్‌పవార్‌కు 11 సీట్లు కేటాయిస్తే మాకు మిగిలేదేంటి? 48 సీట్లలో 15 సీట్లా? అది ఎలా సాధ్యపడుతుంది అని బీజేపీ సీనియర్ నేత పేర్కొన్నారు. కాగా, బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ ఇప్పటివరకు చర్చలు జరగలేదని పేర్కొనడం గమనార్హం.
తొలిజాబితాలో లేని మహరాష్ట్ర
ఈ సారి 370కి పై చీలుకు పార్లమెంట్ స్థానాల్ని కైవసం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్న బీజేపీ తొలిసారి 195 మంది లోక్‌సభ అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. జాబితాలో మహరాష్ట్ర లోక్‌సభ అభ్యర్ధులు లేరు. ఇక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్‌డే పశ్చిమబెంగాల్- 20, మధ్యప్రదేశ్ - 24, గుజరాత్- 15, రాజస్థాన్- 15, కేరళ - 12, తెలంగాణ-9, ఝార్ఖండ్-11, ఛత్తీస్‌గఢ్-12, ఢిల్లీ -5, జమ్మూకశ్మీర్-2, ఉత్తరాఖండ్- 2, అరుణాచల్ ప్రదేశ్-2, గోవా,త్రిపుర, అండమాన్ నికోబార్, దమన్ అండ్ దీవ్ నుంచి ఒక్కో అభ్యర్ధిని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment