Etela Rajender, Challgenge To CM KCR After Joining In BJP - Sakshi
Sakshi News home page

ఆస్తులపై చర్చకు సిద్ధమా? : సీఎం కేసీఆర్‌కు ఈటల సవాల్‌

Published Tue, Jun 15 2021 1:37 AM | Last Updated on Tue, Jun 15 2021 5:25 PM

Etala Rajendar Challgenge To CM KCR After Joining In BJP - Sakshi

సోమవారం మాజీ మంత్రి ఈటలకు బీజేపీ కండువా కప్పుతున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌

  • నాతోపాటు పలువురు అనేక రోజులు ఘర్షణ పడిన తర్వాతే బీజేపీలో చేరాలనే నిర్ణయం తీసుకున్నాం. 
  • తెలంగాణలో ఏ పార్లమెంటరీ సంప్రదాయాలు,ప్రజాస్వామ్య విలువలు లేకుండా ప్రజలు అసహ్యించుకొనేలా జరుగుతున్న పాలనను తుదిముట్టించడమే మా కర్తవ్యం.
  • తెలంగాణ ఉద్యమకారులను బీజేపీ జెండా కిందకు తీసుకురావడమే మా ఎజెండా.
  • వేల కోట్లు ఖర్చుపెట్టినా, దౌర్జన్యాలు చేసినా, ప్రలోభాలకు గురిచేసినా, అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఏదైనా చేయవచ్చనే అహంకారాన్ని తొక్కిపడేసి ప్రజలు మెచ్చే తెలంగాణను తయారు చేసేందుకు పనిచేస్తాం. 

సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుపై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ విరుచుకుపడ్డారు. ఎవరి ఆస్తులేమిటో విచారణకు సిద్ధమా అని కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. తన ఆస్తులపై సిట్టింగ్‌ జడ్జి లేదా సీబీఐతో విచారణకు సిద్ధంగా ఉన్నానని, మీ ఆస్తులపై విచారణకు సిద్ధంగా ఉన్నారా? అని ఈటల ప్రశ్నించారు. ఒకవేళ రాష్ట్ర స్థాయిలో విచారణ చేపడితే సీఎం ఏది చెబితే అది రాసిచ్చే అధికారులతో న్యాయం జరిగే ఆస్కారం లేదని, రాష్ట్రంలో పక్షపాతంతో కూడుకున్న పరిస్థితులు, దుర్మార్గంగా వ్యవహరించే పద్ధతి ఉందని ఆరోపించారు. అందుకే ఇద్దరి ఆస్తులపై సిట్టింగ్‌ జడ్జి లేదా సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్‌ చేస్తున్నట్లు ఈటల తెలిపారు. సోమవారం ఢిల్లీలో లాంఛనంగా బీజేపీలో చేరిన అనంతరం ఈటల కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ వ్యవహార శైలితోపాటు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ముఖ్యంగా మంత్రుల దుస్థితి, ఉద్యమకారుల అణచివేత, తెలంగాణలో బీజేపీ అనుసరించబోయే పంథా తదితర అంశాల గురించి వివరించారు. 

ఆరోపణలు నిరూపించాలి...
తెలంగాణలో తన పేరిట ఒక్క ఎకరం అసైన్డ్‌ భూమి ఉందని నిరూపించినా ముక్కు నేలకు రాస్తానని ఇప్పటికే ప్రకటించినట్లు ఈటల గుర్తుచేశారు. తెలంగాణలో 2005లో కిరాయికి ఇచ్చిన గోడౌన్లను ఇప్పుడు ఖాళీ చేయించారని, ప్రస్తుతం తన భూములన్నింటిపై వివాదం చేశారని ఆయన ఆరోపించారు. ఇంత జరుగుతున్నా తాను భయపడట్లేదని, తమపై కసి ఉన్నందున చట్టం, యంత్రాంగాన్ని ఉపయోగించి తనపై చేసిన ఆరోపణలను నిరూపించుకోవాలని సీఎంకు ఈటల సవాల్‌ విసిరారు. ఒకవేళ తనపై చేసిన ఆరోపణలు నిరూపణ కాకపోతే ముక్కు నేలకు రాసేందుకు కేసీఆర్‌ సిద్ధమా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో తనది తప్పని తెలిస్తే దేనికైనా సిద్ధమన్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో ఈటల రాజేందర్‌. చిత్రంలో తరుణ్‌ ఛుగ్, బండి సంజయ్‌


ఆయన ఎవరి మాటా విన్నది లేదు.. 
ఏడేళ్లలో మంత్రిగా ఉన్నందున ఆ పదవి ఔన్నత్యం కాపాడటం కోసం ప్రయత్నించానని ఈటల తెలిపారు. ఈ ఏడేళ్లలో అనేకసార్లు సీఎంని అడిగానని, ప్రశ్నించానని, కానీ ఆయన ఎవరిమాటా విన్నది లేదని విమర్శించారు. కేసీఆర్‌ నేతృత్వంలో మంత్రులు ఎవరైనా ప్రశాంతంగా ఉన్నారా? మనసుకు నచ్చినట్లు పని చేయగలుగుతున్నారా అనేది గుండెలపై చేయి వేసుకొని చెప్పాలని ఈటల ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మొక్కవోని దీక్షతో పనిచేశామని, ఎన్నో అవమానాలను భరించామని, రాష్ట్ర సాధనలో తమ పాత్ర ఏమిటో ప్రజలందరికీ తెలుసునని ఈటల వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మేధావులతో కమిటీ వేసి గొప్ప రాష్ట్రం చేస్తామన్నారని, కానీ ఏనాడూ మేధావులకు కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా దొరకలేదని విమర్శించారు.

ఆ డబ్బుకు లెక్క చెప్పండి? 
నాగార్జునసాగర్‌ ఉపఎన్నికతోపాటు ఇటీవల జరిగిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ భారీగా డబ్బు ఖర్చు చేసిందని, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే లెక్కలు చెప్పాలని ఈటల డిమాండ్‌ చేశారు. గత ఏడేళ్లలో ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారో, అవి ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలన్నారు. కాగా, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో ఈటల సోమవారం రాత్రి అరగంటపాటు భేటీ అయ్యారు. తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో అవినీతి జరుగుతోందని, ఆ చిట్టా బయటపెడతామని బీజేపీ నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఈటల ఆయనతో పంచుకున్నట్లు తెలిసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement