సాక్షి, హైదరాబాద్: సింగరేణి విషయంలో ఏ వేదికపై అయినా చర్చకు తాము సిద్ధమని, బీఆర్‌ఎస్ నేతలకు నిజాయతీ ఉంటే ముందుకు రావాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ చేశారు. ప్రధాని మోదీ రూ.11 వేలకోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర పర్యటనకు వస్తుంటే.. సింగరేణిపై బీఆర్‌ఎస్ నేతలు అబద్ధపు ప్రచారానికి దిగారని ఆరోపించారు.
ప్రధాని పర్యటన సందర్భంగా బీఆర్‌ఎస్ నిరసనలకు పిలుపునివ్వడాన్ని తప్పుపట్టారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు, పార్టీ నేతలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, విజయశాంతి, ఏనుగు రవీందర్‌రెడ్డి, అశ్వత్థామరెడ్డి, ఎన్వీ సుభాష్ తదితరులతో కలసి ఈటల మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేతకానితనాన్ని పక్కవారిపైకి నెట్టడం అలవాటుగా మారిందని విమర్శించారు.
ప్రధాని స్పష్టత ఇచ్చినా అదే తీరా?
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించిన సందర్భంగా సింగరేణి విషయంలో ప్రధాని మోదీ స్పష్టతనిచ్చారని ఈటల చెప్పారు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువగా 51 శాతం వాటా, కేంద్రానికి తక్కువగా 49 శాతం వాటానే ఉన్నప్పుడు.. కేంద్రం ఎలా నిర్ణయం తీసుకోగలుగుతుందని మోదీ ప్రశ్నించారని గుర్తు చేశారు. అయినా బీఆర్‌ఎస్ నేతలు దుష్ప్రచారానికి దిగుతున్నారని మండిపడ్డారు.
గనుల పాలసీకి బీఆర్‌ఎస్ మద్దతిచ్చి కూడా..
యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారం గనుల కేటాయింపుతో రూ.లక్షా 86 వేల కోట్ల నష్టం జరిగిందని కాగ్ రిపోర్ట్ ఇవ్వడం.. 216 గనుల కేటాయింపులను రద్దు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతోనే మోదీ సర్కారు 2015లో గనుల చట్టాన్ని సవరించిందని ఈటల గుర్తు చేశారు. దానికి అప్పుడు బీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. కొత్త చట్టం ప్రకారమే దేశంలో బొగ్గుగనుల కేటాయింపులు చేస్తున్నా కేంద్రాన్ని తప్పుపట్టడం ఏమిటని ప్రశ్నించారు.
అసలు తెలంగాణలోని నాలుగు గనుల కోసం సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా అడగలేదని.. 2019 తర్వాత సింగరేణి గనుల వేలంలో పాల్గొననే లేదని వివరించారు. దీనిపై ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలన్నారు. కాగా.. బీజేపీ నేతల పట్ల బీఆర్‌ఎస్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి మండిపడ్డారు. సింగరేణిపై ప్రధాని మోదీ గతంలోనే క్లారిటీ ఇచ్చినా.. కేసీఆర్ మళ్లీ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు.
ఎవరో వాట్సాప్ చేస్తే.. నాకు నోటీసులా: ఈటల
పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కేసులో పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడాన్ని ఈటల రాజేందర్ తప్పుపట్టారు. తాను టెక్నాలజీకి అప్‌డేట్ కాలేదని, మెసేజీలకు రిప్లై కూడా ఇవ్వనని చెప్పారు. ‘‘ఎవరో ఒక వ్యక్తి నాకు వాట్సాప్ చేస్తే.. అది నేను చూడకపోయినా నోటీసులు ఇచ్చారు. ఈ కేసుతో నాకు సంబంధం లేకున్నా నోటీసు ఇవ్వడాన్ని ఖండిస్తున్నా. నాకు చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి.. నోటీసులకు వివరణ ఇస్తా..’’ అని ఈటల వివరించారు. బీఆర్‌ఎస్ తాటాకు చప్పుళ్లకు తాను భయపడబోనని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment