
అనుచరులతో భేటీ అయిన ఈటల రాజేందర్
మేడ్చల్: అందరి అభిప్రాయాల మేరకు తుది నిర్ణయం తీసుకుంటానని మాజీమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోనని, ఆచితూచి అడుగులు వేస్తానని స్పష్టం చేశారు. మేడ్చల్ మండలం పూడూర్ గ్రామ పరిధిలోని ఈటల నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్, వీణవంక, ఇల్లంతకుంట మండలాలకు చెందిన నాయకులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఈటల వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రస్తుత పరిణామాలు, తన రాజకీయ జీవితం, వ్యాపారం, తన భూముల వ్యవహారాలు, నియోజకవర్గంలో జరగబోయే పరిణామాల గురించి వారికి వివరించారు.
కొందరు తనకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని, కానీ అది జరిగే పనికాదని అన్నారు. గతంలో మన అనుకున్న నాయకులు కూడా మోసాలు చేశారని విచారం వ్యక్తం చేశారు. తాను మరికొంత మందితో సమావేశాలు నిర్వహిస్తానని, మనతో కలసి వచ్చేవారు ఎవరు.. ఎవరి తీరు ఎలా ఉంది.. అనే అంశాలను గుర్తించి అందరి అభిప్రాయాలు తెలుసుకున్నాకే ముందడుగు వేస్తానన్నారు. ‘ఆగం కాకుండా మీ పనుల్లో మీరు ఉండాలి, నా ప్రయోజనాల కోసం మీ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందులు కలగవద్దని నేను భావిస్తున్నాను. మీరు కూడా కొద్ది రోజులు ఓపికగా ఉండాలి’అని వారికి సూచించారు.
చదవండి: ఏ నిర్ణయమైనా నీ వెంటే..! ఈటలకు కొండా మద్దతు