Medak Land Scam: Sensational Allegations On Telangana Minister Etela Rajender - Sakshi
Sakshi News home page

ఈటల కథ క్లైమాక్స్‌కు.. ఏం జరగబోతోంది..?

Published Sat, May 1 2021 10:13 AM | Last Updated on Sat, May 1 2021 2:30 PM

Etela Rajender Faces Land Scam Allegations What Needs To Know - Sakshi

కొంత కాలంగా పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వ్యవహారం క్లైమాక్స్‌కు చేరిందా..? మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలో అసైన్డ్‌ భూముల ఆక్రమణ అంశంలో ఈటలపై వచ్చిన ఆరోపణలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు..? తనకు ఆత్మగౌరవం కన్నా.. ఏ పదవి ముఖ్యం కాదని ఈటల చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న మర్మమేంటి..? ఈటల భవిష్యత్‌ అడుగులు ఎటువైపు పడబోతున్నాయి..? రాజకీయ వర్గాలతోపాటు కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా ప్రజల్లో ఆద్యంతం నెలకొన్న ప్రశ్నలివి.

సాక్షి, కరీంనగర్‌ : ఈటల రాజేందర్‌.. 2004 నుంచి ఎమ్మెల్యేగా, ఫ్లోర్‌ లీడర్‌గా, మంత్రిగా టీఆర్‌ఎస్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితుల్లో కీలక నేత ఈటల. టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పార్టీ, అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్న ఆయన పలుమార్లు తన అభిప్రాయాన్ని నర్మగర్భంగా చెపుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. అయితే.. ప్రజల పక్షాన మాట్లాడుతున్నానంటూ... కొన్ని సార్లు ప్రభుత్వంపై వాగ్బాణాలు సంధించేందుకూ వెనుకాడలేదు.  

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఇటీవల చురుకైన పాత్ర పోషిస్తున్న ఈటల తన సమర్ధతను చాటుకున్నారు. వ్యాక్సిన్‌ కొరత విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అంతా సర్దుకుంటుందనుకునే లోపే శుక్రవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చిన మాసాయిపేట మండలంలోని అసైన్డ్‌ భూముల వివాదం కొత్త చర్చకు దారితీసింది. రాష్ట్ర రాజకీయాల్లో కరీంనగర్‌లో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. 

ఏం జరగబోతోంది..?
మెదక్‌ జిల్లా భూముల వ్యవహారంలో 100 ఎకరాల అసైన్డ్‌ భూములు కబ్జా చేశారని కొన్ని ఛానెళ్లలో ప్రసారం కావడాన్ని మంత్రి ఈటల తప్పు పట్టారు. అసైన్డ్‌ భూములను కొనుగోలు చేసేందుకు న్యాయంగా తాను సాగించిన ప్రయత్నాలను వివరిస్తూనే ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎంవోలో ముఖ్యుడైన నర్సింగారావుకు కూడా అసైన్డ్‌ భూముల గురించి చెప్పానని, ఎక్కడా ఎకరం కూడా తాను కబ్జా చేయలేదని చెప్పుకొచ్చారు. అసైన్డ్‌ భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి విచారణకు ఆహ్వానించడాన్ని స్వాగతిస్తూనే సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, తాను తప్పు చేసినట్లు తేలితే దేనికైనా సిద్ధమన్నారు.

తాను తప్పు చేసినట్లు తేలే వరకు మంత్రిగా రాజీనామా చేసే అంశమే ప్రస్తావనకు రాదన్న రీతిలో వివరణ ఇచ్చారు. అయితే.. ముఖ్యమంత్రి సీరియస్‌ అయి వెంటనే ప్రాథమిక నివేదిక ఇవ్వాలని మెదక్‌ కలెక్టర్‌ను ఆదేశించడం.. టీఆర్‌ఎస్‌ నేతలెవరూ మంత్రికి అనుకూల వ్యాఖ్యలు చేయకపోవడం.. ఈటల ధిక్కార స్వరం.. వెరసి కథ క్లైమాక్స్‌కు చేరిందనే సంకేతాలు వెలువడుతున్నాయి.  

రెండోసారి గెలిచిన నాటి నుంచి దూరంగా...
2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల మరోసారి విజయదుందుబి మోగించారు. అయితే.. మంత్రివర్గ కూర్పులో ఆయనకు స్థానం లేదనే సంకేతాలు వెలువడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చొప్పదండి టికెట్టు విషయంలో ఈటల అధిష్టానానికి వ్యతిరేకంగా వెళ్లాడనేది అప్పటి ప్రచారం. అయితే.. చివరి నిమిషంలో కేసీఆర్‌కు సన్నిహితుడైన జిల్లాకు చెందిన ఓ నాయకుడు రంగ ప్రవేశం చేశారని, దాంతో ఆరోగ్యశాఖ మంత్రిగా అవకాశం లభించిందని అప్పట్లో వినిపించింది.

కాగా.. ఈటల తనకు మంత్రి పదవి లభించినా.. తెలంగాణ ఉద్యమ నాయకుడైన తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత లభించలేదనే అభిప్రాయంలోనే ఉండేవారు. తరువాత జిల్లాకు చెందిన కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా తన ప్రాధాన్యత తగ్గించారని ఆయన భావించినట్లు సన్నిహితులు చెపుతారు. ఈ క్రమంలోనే పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మంత్రి పదవి భిక్ష కాదు.. గులాబీ జెండాకు ఓనర్లం.. పార్టీ, పదవి ఉన్నా లేకున్నా నేనుంటా..’ వంటి వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షించారు.

గత ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో సాగిన పోరాటానికి బాహాటంగా మద్దతు తెలిపారు. ఈ క్రమంలో పార్టీ విధానాలను కూడా తోసిరాజన్నారు. రైతుల కోసం తానుంటానని, ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత నుంచి ప్రభుత్వాలు తప్పించుకోకూడదని అప్పట్లో వ్యాఖ్యానించారు.

ఇటీవలి కాలంలో కూడా రాజకీయాల్లో నైతికత గురించి, ఆత్మగౌరవం గురించి వ్యాఖ్యలు చేస్తూ తనదైన శైలిని కొనసాగించారు. అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజు మంత్రి కేటీఆర్‌ తన కారులో ఈటలను ప్రగతిభవన్‌కు తీసుకెళ్లారు. ఆ తరువాత ఈటల వాయిస్‌లో మార్పు వస్తుందని అంతా భావించారు. అయితే.. తనదైన నర్మగర్భపు వ్యాఖ్యలతో ఆయన వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.

కేసీఆర్‌కు  సన్నిహితుడిగా..
కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌లో చేరిన నాటి నుంచి ఈటల రాజేందర్‌ అధినేతకు సన్నిహితుడిగానే వ్యవహరించారు. బీసీ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమంలో ముందున్న నాయకుడిగా పార్టీలో పట్టు సాధించారు. తొలుత 2004లో కరీంనగర్‌ జిల్లా కమలాపూర్‌ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఈటల.. 2009 నుంచి హుజూరాబాద్‌ను అడ్డాగా మార్చుకున్నారు. ఇప్పటివరకు ఉప ఎన్నికలతో కలిపి ఆరు సార్లు ఇక్కడి నుంచి విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌ అధికారంలో లేనప్పుడు ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో పార్టీ ఫ్లోర్‌ లీడర్‌గా, అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

కేసీఆర్‌ అంతరంగికులైన సన్నిహిత వ్యక్తుల్లో ఈటల రాజేందర్‌ ఒకరుగా నిలిచారు. అలాంటి ఈటల కొంతకాలంగా పార్టీలో, ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలపై తన అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. ‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు.. ప్రజలకు అనుకూలంగా మాట్లాడుతున్నానని’ అసైన్డ్‌ బూముల ఆక్రమణ ఆరోపణలపై హైదరాబాద్‌ శివారు శామీర్‌ పేటలోని తన నివాసంలో శుక్రవారం  రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పిన మాటల అంతరార్థం కూడా ఇదే. 
చదవండి: 
ఈటలపై ఆరోపణలు.. కేసీఆర్‌ సంచలన నిర్ణయం
అంతా తప్పుడు ప్రచారం.. విచారణ చేస్కోండి: ఈటల సవాల్‌
టీఆర్‌ఎస్‌ సర్కార్‌లో 'భూ'కంపం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement