
హైదరాబాద్, సాక్షి: మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ త్వరలో పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే.. వాటిని ఆయన కొట్టిపారేశారు. అంతేకాదు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి తీరతానని అంటున్నారాయన. తాజా.. పరిణామాలపై సాక్షి టీవీతో తాజాగా ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు.
‘‘నాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. నేను పార్టీ మారే ప్రసక్తే లేదు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఖచ్చితంగా బరిలో ఉంటా. పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తా’’ అని తనలోని ఆసక్తిని బయటపెట్టారాయన.
ఇదీ చదవండి: అందరి దృష్టి ఆ సీటుపైనే
రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ సెగ్మెంట్ నుంచి నెగ్గి.. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. దీంతో.. అంతకు ముందు ఆయన ఎంపీగా చేసిన మల్కాజ్‌గిరి ఖాళీ అయ్యింది. ఈలోపే సార్వత్రిక ఎన్నికలకు పెద్దసమయం లేకపోవడంతో మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అవసరం లేకుండా పోయింది. మరోవైపు ఈ నియోజకవర్గంపై ఇప్పటికే అధికార-ప్రతిపక్ష పార్టీల నేతలెందరి కన్ను వేశారు. మాజీ మంత్రి.. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సైతం ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. మొన్నటి కాంగ్రెస్ దరఖాస్తుల్లోనూ.. ఈ స్థానానికే ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయి. ఆశావహుల్లో.. రేవంత్‌రెడ్డి సన్నిహితులతో పాటు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment