వరదలతోనూ చంద్రబాబు కక్షపూరిత రాజకీయం: అంబటి | Ex Minister Ambati rambabu Slams Chandrababu Over Vijayawada Floods | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ అంటే చంద్రబాబుకు భయం.. అందుకే ఈ కుట్రలు: అంబటి రాంబాబు

Published Tue, Sep 10 2024 4:28 PM | Last Updated on Tue, Sep 10 2024 7:27 PM

Ex Minister Ambati rambabu Slams Chandrababu Over Vijayawada Floods

వైఫల్యాలు కప్పి పుచ్చడానికే బోట్ల పేరుతో డ్రామా

ప్రకాశం బ్యారేజ్‌ ఢీకొట్టిన పడవలు టీడీపీ వారివే

వాటిని వైయస్సార్‌సీపీకి అంటగట్టడం దారుణం

ఆ నింద మోపి మా పార్టీ నాయకులను వేధిస్తున్నారు

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్‌

సాక్షి, తాడేపల్లి: బుడమేరు, విజయవాడ సంక్షోభంపై సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీని టార్గెట్‌ చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారాయన. ప్రకాశం బ్యారేజీలో మూడు పడవలపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 

విజయవాడను ముంచెత్తిన వరదల్లో ముందు నుంచి చోటు చేసుకున్న వైఫల్యాలను కప్పి పుచ్చడానికే ప్రభుత్వం బోట్ల డ్రామా ఆడుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్‌ అయ్యారు. నిజానికి  ప్రకాశం బ్యారేజ్‌ను ఢీ కొట్టిన పడవలు టీడీపీ వారివే అని ఆయన స్పష్టం చేశారు. అయినా వాటిని వైయస్సార్‌సీపీకి అంటగట్టడం దారుణమన్న అంబటి, ఆ నింద మోపి తమ పార్టీ నాయకులను వేధిస్తున్నారని తెలిపారు. 

చంద్రబాబు దారుణంగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్న మాజీ మంత్రి, ఈ వయసులో ఎందుకీ కుట్రలు, కుతంత్రాలు? అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు విజనరీ, అడ్మినిస్ట్రేషన్‌ ఏమైందన్న ఆయన, ఈ వరదల్లో ప్రజల ప్రాణాలు ఎందుకు కాపాడలేకపోయారని ప్రశ్నించారు. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యేపై నంబూరి శంకరరావుపై  మంగళవారం జరిగిన దాడి దుర్మార్గమన్న అంబటి, రాష్ట్రంలో యథేచ్ఛగా అధికార పార్టీ దురాగతం సాగుతోందని ఆక్షేపించారు. రాష్ట్రంలో అసలు శాంతి భధ్రతలు ఉన్నాయా? అని గట్టిగా నిలదీశారు.

ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలన్న చంద్రబాబు, విజయవాడ వరదల సంక్షోభంతో వైయస్సార్‌సీపీ నాయకులపై కక్ష తీర్చుకోవాలని చూస్తున్నారని మాజీ మంత్రి అన్నారు. ప్రకాశం బ్యారేజ్‌ను మూడు పడవలు ఢీకొట్టడంతో బ్యారేజ్‌ కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడిందని, దీనికి వైఎస్‌ఆర్‌సీపీ కారణం అని, ఇది ఒక కుట్ర అని చంద్రబాబు, మంత్రులంతా చెప్పడం, దానికి ఎల్లో మీడియా వంత పాడడం దారుణమని ఆయన ఆక్షేపించారు. 

తమ పార్టీ నేతలపై కేసులు పెట్టాలన్న లక్ష్యంగానే ఇదంతా జరుగుతోందన్న ఆయన, నిజానికి ప్రకాశం బ్యారేజ్‌ను కేవలం ఆ మూడు పడవలే కాకుండా, ఇంకా చాలా బోట్లు  ఢీకొట్టాయని వెల్లడించారు. దాదాపు 11.43 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఈ మధ్యకాలంలో ఎన్నడూ రాలేదని, ఆ వరద ఉధృతికి పైనుంచి అనేక పడవలు కొట్టుకొచ్చాయని, వాటిలో టూరిజమ్‌ బోట్లు కూడా ఉన్నాయని తెలిపారు.

 ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఈ వరదల వల్ల 202 పడవలు పాక్షికంగా, 432 పడవలు పూర్తిగా దెబ్బతిన్నాయని, కొన్ని వందల చిన్న బోట్లు బ్యారేజ్‌ గేట్ల మధ్య నుంచి కొట్టుకుపోయాయని చెప్పారు. ఈ కేసులో కోమటి రామ్మోహన్, ఉషాద్రిని అరెస్ట్‌ చేశారన్న ఆయన.. కోమటి రామ్మోహన్‌ టీడీపీ ఎన్నారై వింగ్‌ హెడ్‌ కోమటి జయరామ్‌కు సమీప బంధువని, ఉషాద్రి కూడా లోకేష్‌తో ఫోటో దిగారని గుర్తు చేశారు.

అయినా ఆ ఘటనను వైయస్సార్‌సీపీకి అంటగడుతూ, తమ పార్టీ నాయకులు.. మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ను టార్గెట్‌ చేశారని అంబటి రాంబాబు ఆక్షేపించారు. తాము ప్రకాశం బ్యారేజ్‌ కూల్చే కుట్ర చేశామనడం దుర్మార్గమన్న ఆయన, ఇంత దారుణమైన మాటలు ఎందుకని?. కక్ష సాధింపు ఎందుకని ప్రశ్నించారు. వీటన్నింటికీ చంద్రబాబు సమాధానం చెప్పాలని కోరారు. అధికార పార్టీకి అసెంబ్లీ, లోక్‌సభలో తగిన మెజారిటీ ఉన్నా, ఎందుకు అభద్రతా భావంతో ఉన్నారని ప్రశ్నించారు. 

‘చంద్రబాబు అంతగా ఎందుకు భయపడుతున్నారంటే.. వైఎస్‌ జగన్‌ వెనకున్న 40 శాతం ఓట్లు. ఇంకా కూటమి గెలుపు వారిది కాదన్న భయం. అందుకే జగన్‌గారిని ఏదో ఒక విధంగా అణగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు’.. అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఏ పడవలకైనా నీలి, పసుపు రంగులే ఉంటాయన్న ఆయన, కావాలంటే ఏ పోర్టుకైనా వెళ్లి చూడాలని హితవు చెప్పారు.

విజయవాడను వరద ముంచెత్తడంతో 46 మంది చనిపోయినట్లు చెబుతున్నా, వాస్తవ సంఖ్య ఇంకా చాలా ఎక్కువని, ఆ వివరాలు త్వరలోనే బయటకు వస్తాయని మాజీ మంత్రి తేల్చి చెప్పారు. ఘటన జరిగి 10 రోజులైనా ఇప్పటికీ బాధితులకు సాయం అందడం లేదని, ఇందులో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని స్పష్టం చేశారు. వరద గురించి ముందే తెలిసినా, రెండు లక్షల మందిని తరలించడం సాధ్యం కాదు కాబట్టి, ఊర్కున్నామని రెవెన్యూ స్పెషల్‌ సీఎస్‌ చెప్పారన్న ఆయన, ఈ ఘటనలన్నింటిలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.

బుడమేరును జగన్‌  నది అనడాన్ని చంద్రబాబు అపహాస్యం చేశారని.. నిజానికి అది 160 కి.మీ ప్రయాణించే చిన్న నది అని స్పష్టం చేశారు. మరోవైపు పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకరరావు వరద ప్రాంతాల పర్యటనకు వెళ్తుంటే, దాడి చేసి దౌర్జన్యంగా ప్రవర్తించారని, వాహనాలు ధ్వంసం చేశారని అంబటి రాంబాబు ఆక్షేపించారు. 

ఈ సందర్భంగా ఆ ఘటన విజువల్స్‌ మీడియకు చూపిన ఆయన.. ఇది అసలు ప్రజాస్వామ్యమేనా? రాష్ట్రంలో శాంతి భధ్రతలు ఉన్నాయా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ పాలన సాగుతోందన్న ఆయన, పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నాయని చెప్పారు. వెంటనే బాధ్యులందరిపై కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలని కోరారు.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
బుడమేరు గండి పూడ్చడానికి మంత్రి రామానాయుడు అక్కడే ఉండాలా?. ఇది ప్రచార ఆర్భాటం కాదా?. అని అంబటి ఎద్దేవా చేశారు. అసలు ముందే అలెర్ట్‌ చేసి ఉంటే ఈ దారుణం జరిగేది కాదు కదా? అన్న ఆయన, ఇకనైనా ప్రభుత్వ పెద్దలు సొంత భజన మానుకోవాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement