సాక్షి, హైదరాబాద్: తనపై శరణ్ చౌదరి ఆరోపణలు చేశారని తన దృష్టికి వచ్చిందని.. ఆయన ఎవరో తెలియదని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, శరణ్ చౌదరి బీజేపీలో ఉన్నాడని తెలిసింది. శరణ్ చౌదరి భూకబ్జాలకు పాల్పడ్డాడని బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని ఎర్రబెల్లి అన్నారు.
‘‘దొంగ డాక్యుమెంట్లు సృష్టించి శరణ్ చౌదరి భూకబ్జాలకు పాల్పడ్డారు. ఎన్.ఆర్.ఐ.విజయ్‌కు, శరణ్ చౌదరి రెండు కోట్లు బాకీ వున్నారు శరణ్ చౌదరిపై చాలా కేసులు వున్నాయి. శరణ్ చౌదరి డబ్బులు ఇవ్వాల్సిన విజయ్ ఎవరో నాకు పరిచయం లేదు. శరణ్ చౌదరి, అతని భార్య పాస్ పోర్టులను పోలీసులు సీజ్ చేశారు. నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో వున్నా.. ఎక్కడా భూకబ్జాలకు పాల్పడలేదు’’ అని ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు.
బంజారాహిల్స్ పీఎస్ లో శరణ్ చౌదరి పై అనేక కేసులు ఉన్నాయి. ఈ వ్యవహారంలో నన్నెందుకు లాగుతున్నారో అర్దం కావడం లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు నాకు సంబంధం లేదు. ప్రణీత్ రావు ఎవరో కూడా తెలియదు. ప్రణీత్ రావు వాళ్ల బంధువులు మా ఊర్లో ఉంటారని తెలిసింది. రాజకీయ కుట్రలో భాగంగానే ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారు. నేను ప్రస్తుతం పార్టీ మారే ఉద్దేశ్యం లేదు. నేను పార్టీ మారను. పార్టీ మారాలని నాపై పై నుంచి ఒత్తిడులు వస్తున్నాయి’’ అని దయాకర్‌రావు తెలిపారు.
‘‘శరణ్ చౌదరి డబ్బులు ఇవ్వాల్సిన విజయ్ నాకు బంధువు అని అసత్య ప్రచారం చేస్తున్నారు. నేను అనేక కేసులు ఎదుర్కొన్నాను. గతంలో ఓబుళాపురం అక్రమ మైనింగ్, బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ప్రజల కోసం జైలుకు వెళ్లాను’’ అని ఎర్రబెల్లి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment